పుష్ప… 300 కోట్ల కలెక్షన్లు అనే అంకె కాదు ఆశ్చర్యపరిచింది… హిందీలో 80 కోట్ల దాకా చేరుకున్నాయి పుష్ప కలెక్షన్లు అనే పాయింట్ విశేషంగా కనిపిస్తోంది… హిందీ బెల్టులో అనేక ప్రాంతాల్లో కోవిడ్ ఆంక్షలతో థియేటర్లు సగం సగమే నడుస్తున్నయ్… ఐనా సరే, ఒక డబ్బింగ్ సినిమా స్ట్రెయిట్ హిందీ సినిమాను మించి దున్నేస్తోంది… రణవీర్ సింగ్ 83 సినిమా 90 కోట్ల దాకా కలెక్ట్ చేసిందని అంచనా… అంటే ఓ స్ట్రెయిట్ సినిమాకు దీటుగా మన సినిమా… అదీ తెలుగు నుంచి డబ్… మరెందుకు ఆశ్చర్యం అంటారా..? మన తెలుగు హీరోల సినిమాలు కొన్ని తెలుగునాట 100 కోట్ల దాకా వసూలు చేయడం ఇప్పుడు పెద్ద విశేషం కాదు… తెలుగు సినిమా బిజినెస్ రేంజ్‌కు ఇప్పుడు 100 కోట్లు అనేది పెద్ద లెక్క కానేకాదు… కానీ…
బాహుబలి ఇండియన్ సినిమాకు అసాధారణమైన బెంచ్ మార్క్ గీతలు గీసిపెట్టింది… దాంతో ఇప్పుడే పోల్చాల్సిన పనేమీ లేదు కానీ… సాధారణంగా సౌత్ హీరోలంటే నార్త్ ప్రేక్షకులకు గిట్టదు, హిందీ ఇండస్ట్రీ అస్సలు ఎంటర్‌టయిన్ చేయదు… రానివ్వరు… మన ఆడలేడీస్ కావాలి, హేమమాలిని, శ్రీదేవి, రేఖ, జయప్రద… ఎవరైనా సరే, కానీ హీరోలు మాత్రం అక్కర్లేదు… సౌత్ టాప్ హీరోలు చాలామంది హిందీలోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేసి, బాలీవుడ్ పడనివ్వక, తిరిగి వచ్చేైసి, అన్నీ మూసుకుని మన సినిమాల మీదే కాన్సంట్రేట్ చేసిన ఉదాహరణలు బోలెడు… కానీ ఇప్పుడు ఆ సీన్ మారిపోయినట్టుంది…
బాహుబలి తరువాత ప్రభాస్ సాహో… తెలుగులో అంతంతమాత్రమే, కానీ హిందీలో హిట్… ఇప్పుడిక రాధేశ్యాం, ఆదిపురుష్ సహా ప్రభాస్ చేతిలో పెద్ద పెద్ద ప్రాజెక్టులున్నయ్… అన్నీ హిందీ మార్కెట్‌ను కూడా టార్గెట్ చేసేవే… నిజానికి ఇప్పుడు ట్రెండ్ ఏమిటి..? ఒక భాషలో సినిమా తీసేసి, నాలుగైదు భాషల్లో డబ్ చేసేసి, పాన్ ఇండియా పేరిట వదిలేస్తే సరి… ఓటీటీ, టీవీ రైట్స్ డబ్బులు… వస్తే గిస్తే థియేటర్ డబ్బులు… అయితే ఇప్పుడు పుష్ప స్ట్రెయిట్ హిందీ సినిమాకు దీటుగా కలెక్షన్లు సాధించడమే అసలు విశేషం… ఆ పాత హిందీ మొహాలు, కథలు చూసీ చూసీ హిందీ ప్రేక్షకులు కూడా టిపికల్ తెలుగు సూపర్ హీరోయిక్ కథలు, ట్రీట్‌మెంట్‌ను ప్రేమిస్తున్నారా ఏంటి..?
Ads
అందుకేనేమో… అర్జున్‌రెడ్డి హిందీ రీమేక్‌కు వెళ్లాడు, జెర్సీ వెళ్లింది… ఆర్ఆర్ఆర్ రూపంలో రాంచరణ్, జూనియర్ ఎన్టీయార్ వెళ్తున్నారు… ఏమో, ఇంకా మున్ముందు మరిన్ని…! మనకు తమిళ, మలయాళ కథలు కావాలి… హిందీ వాళ్లకు మన కథలు కావాలి… లోకో భిన్న రుచి… మన బ్రోచేవారెవరురా రీమేక్ అయ్యింది… 2005 నాటి ఛత్రపతి ఇప్పుడు రీమేక్ అవుతోంది… ఎఫ్-2, హిట్, క్రాక్, నాంది, అల వైకుంఠపురంలో… మన కథలిప్పుడు హిందీ వాళ్లకు హాట్ హాట్ వాంటెడ్… ఊ అంటావా మామా, ఊఊ అంటావా మామా అని ఊరిస్తున్నయ్ బాలీవుడ్‌ను… నిజానికి రీమేక్ దాకా దేనికి..? పుష్పలాగే డబ్ చేసి వదిలేస్తే పోలా… ఇరగబడతారు…
నిజానికి ఓటీటీలు వచ్చాక సినిమాల భాషాభేదాలు బాగా తగ్గిపోయాయి… సబ్ టైటిళ్లు చూస్తూ జనం రకరకాల భాషల్లోని సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు… వెనక్కీ, ముందుకూ ఎప్పుడుపడితే అప్పుడు స్ట్రీమింగ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు… పాటలు, పిచ్చి ఫైట్లు వచ్చినప్పుడు జంప్… ఓటీటీలో సినిమా చూడటం ఓ సుఖమే… ఇప్పుడు ఆ సబ్ టైటిళ్లు చదువుతూ కళ్లను సీన్ మీదకు, అక్షరాల మీదకూ పదే పదే మళ్లించే శ్రమ కూడా లేకుండా పాన్ ఇండియా పేరిట సినిమాలు రిలీజ్ అవుతున్నయ్… ఇంకేం… థియేటర్‌కే వెళ్లి అడ్డా వేసేస్తున్నారు ప్రేక్షకులు… ఇన్ని కారణాల నేపథ్యంలో పుష్ప కలెక్షన్లను బాలీవుడ్ మాత్రమే కాదు, సౌత్ ఇండియా ఫిలిమ్ సర్కిళ్లు కూడా ఆసక్తిగా, ఆశ్చర్యంగా గమనిస్తున్నయ్… కన్నడ, మలయాళ, తమిళ హీరోలకు చేతకాని ఈ హిందీ ఫీట్లను ఒక ప్రభాస్, ఒక బన్నీని ఈర్ష్యగా చూస్తున్నయ్…!!
Share this Article