మట్టి మీద ప్రేమ ఉండాలి… పుట్టిన మట్టి మీద మరింత ఉండాలి… అది పుట్టిన ఊరు కావచ్చు, పుట్టిన దేశం కావచ్చు… మట్టి మీద ప్రేమ ఉండాలి… కానీ అది మరీ వెర్రితలలు వేయకూడదు… ఆ మట్టికి మంచి చేయాలి, మంచి పేరు తీసుకురావాలి…
మొన్న ప్రపంచకప్పు అందించిన ఆ ఫీల్డ్ మీద ప్రేమ తెగపెరిగిపోయి రోహిత్ శర్మ కాస్త మట్టిని తిన్నాడనే వార్త, ఫోటో చూశాక జాలిపడాలో, కోప్పడాలో, ఇంకేమనాలో అర్థం కాలేదు… మట్టికి మహత్తేమీ ఉండదు… మనం ఆపాదిస్తే తప్ప, ఏదో ఉద్వేగంతో పూసుకుంటే తప్ప… మట్టి మట్టే… భౌతికంగా…!
ఆది నుంచీ మనం ఇంతే… నీ పదములే చాలు రామా, నీ పద ధూళియే పదివేలు అంటాం… తను నడిచిన నేల, తను తొక్కిన మట్టికి ఆ పవిత్రతను మనం ఫీలవుతాం… ఆ భక్తి చివరకు హీరోలు, నాయకులు, ఇతర సెలబ్రిటీలు… అన్నింటికీ మించి స్వాములకూ వర్తింపజేసి, వీరభక్తితో ఈ పాదధూళికి మహా మహా మహత్తును ఆపాదించి… దాన్ని చేతుల్లోకి అపురూపంగా స్వీకరించి, బొట్టు పట్టుకుని… పూసుకుని పరవశించిపోతున్నాం… పాదతీర్థం కథ వేరు, అది మరీ నీచం…
Ads
మూఢనమ్మకాలకు మించిన మూఢత్వం… నిన్న హథ్రాస్‌లో జరిగిందేమిటి..? దాదాపు 121 మంది మరణించారు, 100 మంది గాయపడ్డారు… తొక్కిసలాట… ఎందుకు..? ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం స్వామీ భోలే బాబా నడిచి వెళ్లిన మట్టి కోసం భక్తుల ప్రయత్నంలో జరిగిన తొక్కిసలాట అట… తోపులాట అట… ఆ పాదధూళికి అంత పవిత్రతను ఆపాదించి మరీ భక్తులు ఓ ఉద్వేగంలో, ఓ ఉన్మాదంలో వ్యవహరించారు…
అసలు ఈ భోలే బాబా ఎవరు..? ఓ సాదాసీదా మనిషే… మొదట్లో తండ్రితో కలిసి వ్యవసాయం చేసేవాడు, తరువాత పోలీస్ ఇంటలిజెన్స్ (ఇన్‌ఫార్మర్‌గా) పనిచేసిన వ్యక్తి… తరువాత తెల్ల దుస్తులు ధరించాడు… దేవుడి మనిషిని అన్నాడు… ప్రసంగాలు, కార్యక్రమాలతో ఓ బాబా అయిపోయాడు… అసలు పేరు నారాయణ్ సాకార్ హరి… తనకు గురువు ఎవరూ లేరని చెప్పేవాడు…
మన దేశంలో బాబాలకు, స్వాములకు ఉన్న గిరాకీ తెలిసిందే కదా… ఈ బాబాను ఆ తర్వాత కాలంలో వేల సంఖ్యలో భక్తులు అనుసరించడం మొదలు పెట్టారు… అలీగఢ్‌తోపాటు హాథ్రాస్ జిల్లాల్లో ప్రతి మంగళవారం ‘సత్సంగ్’ పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు… ఇందుకు వేల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు… ఉత్తర్‌ప్రదేశ్ కాకుండా ఉత్తరాఖండ్, హరియాణా, రాజస్థాన్, ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా భోలే బాబాకు లక్షల మంది అనుచరులు ఉన్నారు… కార్యక్రమాల నిర్వహణకు వాలంటీర్లు ఉంటారు… కోవిడ్ మహమ్మారి సమయంలోనూ భారీ సంఖ్యలో భక్తులు భోలే బాబా కార్యక్రమాలకు హాజరయ్యారు…
ఊపిరాడకే… తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫుల్‌రాయ్ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు… ఇందుకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు… ఈ క్రమంలో బాబా పాదాల వద్ద ఉన్న మట్టిని తీసుకునేందుకు భక్తులు పోటీపడుతున్న సమయంలో తొక్కిసలాట జరిగింది… దాంతో ఊపిరాడక అనేక మంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి ప్రాణాలు కోల్పోయారు… వీరిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నారు… ఏ విపత్తు చోటుచేసుకున్నా మొదట బలయ్యేది వాళ్లే కదా…
నిజానికి ఇది విషాదం కాదు, ప్రమాదం కాదు… ఓ నేరం… యోగి ఎలా చూస్తున్నాడో తెలియదు గానీ..!! జనం వెళ్లిపోయే బాట మహా ఇరుకు అట… ఆ పక్కనే ఓ గొయ్యి ఉందట… కొందరు ఆ తొక్కిసలాటలో మొదట గొయ్యిలో పడ్డాక, తోపులాటలు పెరిగి, ఒకరిపైనొకరు పడి, ఊపిరాడక మరణించినవాళ్లే అధికం… అంతమంది వచ్చినప్పుడు సరైన ఏర్పాట్లు చూసుకోని నిర్వాహకులు, ప్రత్యేకించి సదరు భోలే బాబాయే అసలు నేరస్థుడు…!! స్వామి వారు ప్రస్తుతం పరారీలో ఉన్నారు… నో, నో, దేవుడి తదుపరి ఆదేశాలు, సూచనల కోసం ఎక్కడో రహస్యంగా దాగి నిరీక్షిస్తున్నాడు..!!
Share this Article