సరే, ఆంధ్రజ్యోతి అంటేనే అది ఆంధ్రాజ్యోతి, తెలుగుజ్యోతి, బాబుజ్యోతి అని ఎవరైనా ఏమైనా సెటైర్లు వేయండి… కానీ కొన్నిసార్లు ఆలోచనాత్మకమైన స్టోరీలు వేస్తుంటుంది… అది జగన్ మీద లేదా తనకు పడనోళ్ల మీద కావచ్చుగాక… కానీ నిజమే రాస్తుంది… అన్నిసార్లూ కాదు, కొన్నిసార్లు… ఆ కొన్నిసార్ల వార్తల్లో ఈరోజు వచ్చిన ‘రికార్డ్ బ్రేక్’ అనే వార్త కూడా ఒకటి…
ప్రజలు ఏమీ పట్టించుకోరు, వాళ్లకు ఏదో ఉచితంగా పడేస్తే చాలు, ఇక మనం ఎంత అరాచకంగా వ్యవహరించినా వాళ్లకు పట్టదు అనే భావనే ఒక పెద్ద అబద్ధం… ప్రజలు అన్నీ గమనిస్తుంటారు… జగన్ ఓడిపోవడానికి చిన్న చిన్న అంశాలు కూడా కారణాలే… జగన్ లైట్‌గా తీసుకున్నాడు గానీ… తను ప్రవేశపెట్టిన రంగుసారా బ్రాండ్లు తన మీద తీవ్ర వ్యతిరేకతకు దారితీశాయి… అది రియాలిటీ…
అలాగే… తిరుమల విషయంలో జగన్ ప్రభుత్వం, తన నాయకులు వ్యవహరించిన ధోరణి కూడా కారణమే… విగ్రహాల తలలు నరికివేతలు, ఊరేగింపు రథాల దహనం వంటివే కాదు, తిరుమలలో నాయకుల ఓవరాక్షన్, పెత్తనాలు కూడా ఓ కారణమే… అసలు తిరుమలలో రాజకీయ నాయకుల పెత్తనాలే శ్రీవారికి పెద్ద శాపం… ఏ ప్రభుత్వం వచ్చినా సరే, చంద్రబాబు పాలన అయినా సరే అది మారడం లేదు… అదొక దురవస్థ…
Ads
ఇక వైవీ రెడ్డిలు, భూమన రెడ్డిలు పగ్గాలు చేపట్టాక… ఇక చెప్పనక్కర్లేదు… ఫాఫం శ్రీవారు అనుకోవాల్సిన స్థితి… ఆంధ్రజ్యోతి వార్తలో ఉదహరించిన కొన్ని అంశాలు…
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి… ఈ ఏడాది ఫిబ్రవరి 12న నాలుగు తోమాలసేవ, ఆరు ప్రోటోకాల్ దర్శనాలు, 12 మందికి కల్యాణోత్సవాలు, 52 మందికి వీఐపీ బ్రేక్ దర్శనాలు, 74 మందికి ఆర్జితసేవ, బ్రేక్ దర్శనాలకు ఆయన సిఫారసు చేశాడట… కె.నారాయణస్వామి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు… ప్రత్యేకించి రోజా… అసలు ఆమె మంత్రిత్వ శాఖ పేరే తిరుమల దర్శనాల శాఖ అని మార్చి ఉంటే పోయేదేమో…
తెల్లారిలేస్తే అదే పని… ఊ అంటే తిరుమల… వెంట మందీమార్బలం… ఒకరోజు 30 మందితో తరలివెళ్లిందట… అప్పలరాజు ఓ ఏడాది జులైలో 150 మందితో వీఐపీ బ్రేక్‌లో హల్‌చల్ అట… ఉషశ్రీ చరణ్ ఒకేసారి 50 మందితో శ్రీవారికి దర్శనమిచ్చాడట… కొన్నిసార్లు వీళ్ల తాకిడితో ఉదయం 8.30 నుంచి 1.30 వరకు కూడా బ్రేక్ దర్శనాలు కొనసాగాయట… మరి కంపార్ట్‌మెంట్లలో పడిగాపులు గాచే భక్తులు… ఏముందీ..? లబోదిబో..! ఇలాంటోళ్లను జనం నెత్తిన రుద్దిన జగన్‌ను స్మరించుకుని, దేవుడా మాకీ శాపాలు ఎన్నాళ్లు అని జపం చేయడమే…
అసలు బ్రేక్ దర్శనాలు, వీఐపీ దర్శనాలు, ప్రోటోకాల్ దర్శనాలు అనేదే మన గుళ్లకు పట్టిన పెద్ద శాపం… ఆ శ్రీవారూ ఏమీ చేయలేక నిస్తేజంగా చూస్తూ ఉండిపోవడమే… దర్శనాల వరకు వోకే… వీళ్లకు సేవలు చేయడానికే టీటీడీ సిబ్బందికి, అధికార్లకు తలకుమించిన పని అయిపోయేది… సరే, ధర్మారెడ్డి ఆ శ్రీవారి సేవకన్నా వీళ్ల సేవకే ప్రాధాన్యం ఇచ్చేవాడు కాబట్టి ఇదింకా పెచ్చరిల్లిపోయింది… చివరకు ఏమైంది..? సగటు భక్తుల శాపనార్థాలతో జగన్ కుర్చీయే విరిగిపోయింది…
ఎక్కడైనా సరే, ఏ గుడైనా సరే… రాజకీయ నాయకుల పెత్తనాలు, ఓవరాక్షన్ అనేది స్థూలంగా హిందూ సమాజానికే పెద్ద శాపంగా మారాయి… దేవాదాయ శాఖ అంటేనే మొత్తం గుళ్లను భ్రష్టుపట్టించి, భక్తుల విరాళాల్ని దోచుకుని, ప్రభుత్వ కార్యక్రమాలకు వెచ్చించే ఓ దిక్కుమాలిన శాఖ అనే భావన ప్రబలిపోవడానికి ఇదుగో ఈ ధోరణులే కారణం… ఇంకా ఇదెన్ని రోజులో…? మొత్తం చదివి చంద్రబాబు ఏదో శుద్ధపూస అని మీరనుకుంటే అది మీ భ్రమ..!! ఐనా దేవుడి దగ్గర కూడా ఈ వీవీఐపీ వేషాలు ఏమిటి..? అధర్మం, దైవద్రోహం కాకపోతే..!!
Share this Article