తమిళనాడు… కల్లకురిచి జిల్లా… వలయంపట్టు గ్రామం… ఆమె పేరు సెల్వి… ఆమెకు ఇద్దరు కొడుకులు… 2009లో భర్త చనిపోయినప్పుడు పెద్ద కొడుకు భాస్కర్ వెల్లూరులో ఇంజనీరింగ్ ఫస్టియర్ చదువుతున్నాడు… చిన్న కొడుకు 11వ తరగతిలో ఉన్నాడు… ఓసారి స్కూల్‌లో పనిచేసే ఓ టీచర్ వద్దకు భాస్కర్ వెళ్లినప్పుడు ఆయన ‘‘ఎంతోకాలంగా మీ అమ్మ ఒంటరి జీవితం గడుపుతోంది, రెండో పెళ్లి మీరే ఎందుకు చేయకూడదు’’ అనడిగాడు… అక్కడ ఈ కథకు బీజం పడింది…
భాస్కర్‌కు ఆ మాటలు జీర్ణం కాలేదు… ఆ టీచర్ వైపు ఓసారి విచిత్రంగా చూశాడు… తరువాత మరిచిపోయాడు… చదువైపోయింది… భాస్కర్‌కు పుస్తకాలు చదివే అలవాటుంది… అలాంటివాళ్లు చాలామంది మిత్రులయ్యారు… పునఃవివాహాలపై పెరియార్ రాసిన విషయాల్ని చదివిన భాస్కర్ తరచూ లైక్ మైండెడ్ మిత్రులతో చర్చించేవాడు… హఠాత్తుగా ఓసారి ‘‘నా ఇంట్లోనే, నా తల్లి కూడా ఒంటరిగానే గడుపుతోంది కదా, తనెందుకు పెళ్లిచేసుకోకూడదు’’ అనే ఆలోచన మదిని తాకింది…
కానీ సమాజం హర్షిస్తుందా..? ఏమో, ఓసారి ప్రయత్నించి చూద్దాం అనుకున్నాడు… తమ్ముడు వివేక్‌కి చెప్పాడు… అన్న చెప్పిందాంట్లో అభ్యంతరకరం ఏమీ లేదు కదా, మనమే చేసేద్దాం అని తమ్ముడు సపోర్ట్ చేశాడు… అమ్మ జీవితమంతా మాచుట్టే తిరిగింది, ఆమెకంటూ ఓ జీవితం వద్దా..? కానీ ఆమె ఈ రెండో పెళ్లికి అంగీకరిస్తుందా..? అడిగి చూద్దాం అనుకుని తల్లి ఎదుట ఈ ప్రతిపాదన పెట్టారు… అదీ నేరుగా చెప్పలేదు… ఒరేయ్ భాస్కర్ పెళ్లిచేసుకోరా, నీకు పెళ్లీడొచ్చింది, ఎవరైనా అమ్మాయిని చూద్దాం అని తల్లి అడిగినప్పుడు… నువ్వు చేసుకుంటేనే నేను చేసుకుంటాను అని మెలిక పెట్టాడు భాస్కర్…
Ads
ఆమె మొదట నిర్ఘాంతపోయింది… తరువాత కొట్టిపారేసింది… నీ మొహం అని తిట్టేసింది… కానీ ఇద్దరు కొడుకులు పదే పదే ఇదే అడుగుతుండేసరికి తనూ ఆలోచనల్లో పడింది… సరేనంది… కానీ భర్తలను కోల్పోతే మన సమాజంలో అత్యధికులకు ఒంటరి జీవితమే కదా… అందుకని సమాజం సెల్వి రెండో పెళ్లి ఆలోచనను స్వాగతించలేదు… దాంతో ఆమె తన రెండో పెళ్లి ఆలోచనను చంపుకోలేదు సరికదా… నేను భర్తలను కోల్పోయిన మరికొంతమందికి ఎందుకు ఉదాహరణగా నిలవొద్దు అనుకుంది… ఆమె నిశ్చయం బలపడింది… నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కడూ సాయం రాలేదు, ఈ పెళ్లి విషయం వచ్చేసరికి అందరూ ముందుకొచ్చి మరీ వ్యతిరేకిస్తున్నారు అని చీదరించుకున్నదామె…
ఓ వరుడు కావాలి… రెండో పెళ్లి కదా… తన తల్లిలాగే ఒంటరి జీవితం గడుపుతున్నవాడైతే ఇంకా బెటర్ అనుకున్నారు… వరాన్వేషణ ప్రారంభించారు… మా అమ్మకు పెళ్లి చేస్తాం, సంబంధం ఉంటే చెప్పండి అని తిరిగే కొడుకులను చూసి నవ్వుకునేవాళ్లు, వెక్కిరించేవాళ్లు చాలామంది… కానీ వాళ్లు ఆ ప్రయత్నాలను అలాగే పట్టువదలకుండా కొనసాగించారు…
విడాకులు తీసుకున్నవాళ్లు రెండో పెళ్లి చేసుకోవడం లేదా..? ఇదీ అంతే… చట్టవిరుద్ధం కాదు, ధర్మవిరుద్ధం కాదు అని ఇద్దరు అన్నదమ్ములు బదులు చెప్పేవాళ్లు… లేటు వయస్సులో పెళ్లి కేవలం సంభోగం కోసం కాదు కదా… ఓ లైఫ్ సపోర్ట్ కోసం… ఈ నేపథ్యంలో ఆమె ఏమనేదో తెలుసా..? ‘‘నా పిల్లల తండ్రిని కోల్పోయాక, ఒంటరిగా బతుకుతున్నాను కదా, చాలామందికి అలుసు… నా వద్దకు తప్పుడు ఉద్దేశంతోనే వచ్చేవాళ్లు… పెళ్లి చేసుకోవాలని కాదు, ఆ లైంగిక సుఖం కోసం… నా ఇంట్లో మరుగుదొడ్డి లేకపోతే, ఏ రాత్రిపూటో బయటికి వెళ్తే, ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడిగేవారు వెకిలిగా నవ్వుతూ…’’ అని గుర్తుచేసుకునేది…
పెళ్లాం చనిపోయిన ఏడాదిలోపు మళ్లీ పెళ్లి చేసుకుంటున్నవారు మగవాళ్లు… మరి ఆడవాళ్లు మాత్రమే ఎందుకు ఒంటరిగా బతుకులు చాలించాలి… ఇదీ ప్రశ్న… ఆమెకు తగిన వరుడు ఎట్టకేలకు దొరికాడు… అతనొక రైతుకూలీ… పేరు ఏలుమలై… ఆ పెళ్లికి సెల్వి సంబంధీకులు ఎవరూ రాలేదు… వరుడి తరఫు మాత్రం కొందరు వచ్చారు… భర్త లేకుండా ఇద్దరు పిల్లల్ని ఎలా పెంచాలో అర్థం కానప్పుడు మామకు, అత్తకు ఫోన్లు చేశాను, ఎవరూ ముందుకురాలేదు, దాదాపుగా వదిలేశారు… ఒంటరిగానే కష్టపడి పెంచాను, ఇప్పుడు ఇది తప్పు అది తప్పు అని అడ్డుతగలడానికి మాత్రం బంధుత్వాలు ముందుకొస్తున్నాయి… వాటి గురించి ఆలోచించడం మానేశాను… ఇలాంటి కొడుకులు ఉండటం నా అదృష్టం అంటోంది సెల్వి…
Share this Article