.
రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా ఫంక్షన్‌లోనే కదా… ఓ తెలుగు నిర్మాత కాయలు పళ్లు అని ఏవో పిచ్చి కూతలు కూసింది… తరువాత ఏదో విఫల సమర్థనకు ప్రయత్నించాడా లేదా తెలియదు గానీ… ఇంతకీ ఆ సినిమా ఎలా ఉంది..?
అది ఓ డబ్బింగ్ సినిమా… ప్రదీప్ రంగనాథన్ అనబడు ఓ తమిళ వర్ధమాన నటుడు మెయిన్ లీడ్… పర్లేదు, బాగానే ఈజ్ ఉంది… బాగానే చేశాడు… అనుపమ పరమేశ్వరన్ మనకు తెలిసిన నటే కదా… అందంగా ఉంది, కాకపోతే సెకండ్ లీడ్ కాయదు లోహర్ పాత్ర, నిడివితో పోలిస్తే తక్కువే…
Ads
కాయదు కూడా పర్లేదు… గతంలో అల్లూరి అనే తెలుగు సినిమా చేసినట్టు గుర్తు… కథకొస్తే ఓ బీటెక్కు… ఏకంగా 48 బ్యాక్ లాగ్స్… అవునూ, ఇంజనీరింగులో నాలుగేళ్లు కలిపి అన్ని సబ్జెక్టులు ఉంటాయా..? ఏమో తెలియదు…
ఫస్ట్ ప్రేయసి విడిచిపెడుతుంది… ఇక మన హీరో ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి, జాబ్ కొట్టి, చకచకా మెట్లు ఎక్కిపోతాడు… అంత తెలివి ఉన్నవాడికి ఆఫ్టరాల్ 48 పాస్ కావడం కష్టమా అని మీరడక్కండి… అలాంటి లాజిక్కు రాహిత్యాలు, సినిమాటిక్ సీన్లు బోలెడు… తీసేవాడికి చూసేవాడు లోకువ…
తమిళ సినిమా… ఏదో ఇటువైపు కూడా రిలీజ్ చేస్తే ఎంతొస్తే అంత లాభం… తక్కువ ఖర్చుతో డబ్బింగ్ లాగించొచ్చు కదా… దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఓ మామూలు కథను కాస్త వినోదాన్ని రంగరించి రిలీజ్ చేశాడు… కాకపోతే యూత్ టార్గెట్ అనగానే వెగటు, వెకిలి, అశ్లీల, అసభ్య పోకడలకు పోలేదు, సంతోషం…
అయితే మరీ తీసిపారేసే సినిమా ఏమీ కాకపోయినా… పెద్దగా థియేటర్లకు రప్పించేంత సరుకు లేదు… ఓటీటీలో వస్తే ఓ లుక్కేయవచ్చు అనుకునే బాపతు… డబ్బింగ్ డబ్బింగే… మార్కెట్‌లో ప్రస్తుతం బాపు పెద్దగా అట్రాక్ట్ చేయకపోయినా రామం రాఘవం పర్లేదు… తండేల్, ఛావా ఉండనే ఉన్నాయి… సో, వాణిజ్య కోణంలో ఈ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌కు పెద్ద అనుకూల స్థితి మాత్రం లేదనే చెప్పాలి…!
ఈ ఇంగ్లిష్ టైటిల్ దేనికీ అంటారా..? 48 సబ్జెక్టుల ఫెయిల్యూర్ హీరో మళ్లీ కాలేజీకి వచ్చి రాయాలి.., అనగా రీ ఎంటర్ ది డ్రాగన్ అన్నమాట…!!
Share this Article