.
ఏడేళ్ల క్రితం… ఒక్కసారి ఊహించండి… నాటి ఆర్టీసీ సమ్మె రోజుల్ని… కేసీయార్ పాలనకాలంలోని చీకటిరోజులు అవి… 48 వేల మందిని సెల్ఫ్ డిస్మిస్ అన్నాడు, జీతాల్లేవు పో అన్నాడు, ఆర్టీసీని అమ్మేస్తున్నాం, మీకు దిక్కున్నచోట చెప్పుకొండి అని ఉరిమాడు… పండుగలప్పుడు కూడా జీతాలు రాక సగటు ఆర్టీసీ కార్మికుడు ప్రభుత్వాన్ని, కేసీయార్‌ను ఏడుస్తూ నానా శాపనార్థాలు పెడుతున్న ఎమర్జెన్సీ రోజులవి… 52 రోజుల నిత్య నరకం…
ఇప్పుడు… నిజంగా ఆర్టీసీ కార్మికులకు రేవంత్ రెడ్డి ఓ అంతులేని భరోసా… మూడే రోజుల్లో మానవతా కోణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు శుభం కార్డు వేశాడు… తన ప్రజాసంబంధాల విభాగం గానీ, పార్టీ ప్రచారాల విభాగం గానీ, చివరకు ఆర్టీసీ అసోసియేషన్లు గానీ… ప్రభుత్వం అంగీకరించిన డిమాండ్ల మేరకు సగటు ఆర్టీసీ కార్మికుడికి ఎంత ఫాయిదా జరగబోతున్నదో సరిగ్గా చెప్పుకోలేని ఫెయిల్యూర్… సెలబ్రేషన్స్ జాడ లేదు…
Ads
అదే కేసీయార్ కాలంలో ఇలాంటి నిర్ణయాలు జరిగి ఉంటే… ప్రతి డిపో ఎదుట భారీ క్షీరాభిషేకాలు, మిఠాయిల పంపిణీ జరిగి ఊదరగొట్టి ఉండేవాళ్లు… సరే, ఆర్టీసీ కార్మికుడికి జరగబోతున్న ఫాయిదాలో ముఖ్యమైంది జీతాల పెంపుదల… దాన్నోసారి వివరంగా చూద్దాం…
1. ఎవరెవరికి లబ్ధి చేకూరుతుంది?
ప్రస్తుత ఉద్యోగులు… సంస్థలో పనిచేస్తున్న 37,360 మందికి జీతాలు పెరుగుతాయి…
విశ్రాంత ఉద్యోగులు…: 2021 ఏప్రిల్ 1 తర్వాత రిటైర్ అయిన సుమారు 9,600 మందికి పైగా మాజీ ఉద్యోగులకు కూడా ఈ పెంపు వర్తిస్తుంది…
2. జీతాల పెంపు & నెలకు అయ్యే ఖర్చు…
నెలకు అదనపు భారం…: 11% ఫిట్‌మెంట్ వల్ల ప్రతి నెల వేతనాల కోసం సంస్థ అదనంగా రూ. 31 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది…
వార్షిక భారం…: ఏడాదికి జీతాల రూపంలోనే రూ. 415 కోట్ల అదనపు భారం పడుతుంది….
వ్యక్తిగత పెంపు…: కండక్టర్లకు నెలకు రూ. 4,000 – 15,000 వరకు, డ్రైవర్లకు రూ. 4,000 – 17,000 వరకు జీతం పెరిగే అవకాశం ఉంది…
3. బకాయిల (Arrears) చెల్లింపు ఎలా…
2021 నుంచీ పెంపు వర్తిస్తుంది కాబట్టి, మొత్తం బకాయిల భారం రూ. 2,400 కోట్లకు పైగా ఉంది…. వీటిని చెల్లించే విషయంలో ప్రభుత్వం రెండు విధానాలను అనుసరిస్తోంది…
విశ్రాంత ఉద్యోగులకు…: వీరికి రావాల్సిన సుమారు రూ. 200 కోట్ల బకాయిలను ముందుగానే చెల్లిస్తారు…
సర్వీసులో ఉన్నవారికి…: ప్రస్తుతం పనిచేస్తున్న వారికి రావాల్సిన రూ. 2,178 కోట్ల బకాయిలను వారు పదవీ విరమణ (Retirement) చేసే సమయంలో చెల్లిస్తారు… గతంలో కూడా ఇదే పద్ధతిని అనుసరించారు…
4. తదుపరి ప్రక్రియ ఏమిటి…
ఆప్షన్ ఫారాలు…: ఇంక్రిమెంట్ తేదీలను ఎంచుకునేందుకు ఉద్యోగుల నుంచి ‘ఆప్షన్ ఫారాలు’ సేకరిస్తారు…
సమయ పరిధి…: ఈ జీతాల పెరుగుదల ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి 6 వారాల సమయం పడుతుంది…. అప్పుడే ఏ ఉద్యోగికి ఖచ్చితంగా ఎంత జీతం పెరుగుతుందనేది స్పష్టమవుతుంది…
క్లుప్తంగా చెప్పాలంటే…: ఈ నిర్ణయం వల్ల ఆర్టీసీ కార్మికులకు దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న వేతన సవరణ కల నెరవేరింది…. బకాయిలు వెంటనే చేతికి రాకపోయినా, నెలవారీ జీతం పెరగడం, రిటైర్మెంట్ సమయంలో భారీ మొత్తం చేతికి అందడం అనేది ఉద్యోగులకు పెద్ద ఊరట…
అన్నింటికన్నా ముఖ్యంగా… ఆర్టీసీ ఉద్యోగగణాన్ని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ సజావుగా పూర్తయితే… అందరు ప్రభుత్వ ఉద్యోగులకు లభించే అన్ని సౌకర్యాలు, రక్షణ, ప్రభుత్వ భరోసా ఎట్సెట్రా అన్నీ వర్తిస్తాయి… సగటు ఆర్టీసీ కార్మికుడు కాలరెగరేసి, పండుగలు జరుపుకుని, సంతోషపడే రోజులు అవి… అందుకే యూనియన్లు, పార్టీపరమైన సెలబ్రేషన్స్ ఏమీ లేకపోయినా సరే, సగటు ఆర్టీసీ ఉద్యోగి కుటుంబం ‘రేవంత్ రెడ్డి’ని మనసారా తలుచుకుంటోంది కృతజ్ఞతతో..!!
Share this Article