.
నో డౌట్… సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో తెలంగాణ సీఎం పోస్టును వెకిలి చేసిన తీరు తీవ్ర అభ్యంతరకరం… కేసీయార్ గనుక సీఎంగా ఉండి ఉంటే… ఈ సినిమా దర్శకుడు, ఆ పాత్ర వేసిన సీనియర్ నరేష్‌కు తప్పకుండా ఇబ్బందులు ఉండేవేమో…
తను అధికారంలో లేడు, కేడర్ నిస్తేజంగా ఉంది… అందుకే తన ఊతపదం ‘ఏం జేద్దామంటవ్ మరి’ అనే హుక్ లైన్‌ను ఏదో ఐటమ్ సాంగులో, అదీ కల్లు సాంగులో వెకిలి చేసినా పెద్దగా స్పందన లేదు… ఆమధ్య రాజేంద్రప్రసాద్ ఏదో సినిమాలో తెలంగాణ యాసను ఖూనీ చేసిపారేశాడు… అసలు సాధన, డిక్షన్ సరిగ్గా చేతకానప్పుడు యాసను ఎందుకు హతమార్చాలి..?
Ads
గతంలో విలన్లుగా, కమెడియన్లుగా చూపిస్తూ తెలంగాణతనాన్ని ఇష్టారాజ్యంగా వెకిలి చేసిన ‘ఆంధ్రా ఇండస్ట్రీ’ ఇప్పుడు తెలంగాణకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తున్నా, ఆ ధోరణి వేర్వేరు రూపాల్లో ప్రదర్శిస్తూనే ఉంది… మొన్నామధ్య అల్లు అర్జున్ ఏకంగా బహిరంగవేదిక మీద సీఎం పేరు తెలియనట్టుగా నటించి, అడ్డగోలుగా తెలంగాణ సీఎంను అవమానించాడు… అదీ తెలంగాణలో బతుకుతూ… తెలంగాణ మీద బతుకుతూ…
వద్దంటే ఊరేగింపు, ఓ మహిళ చచ్చిపోయిందిరా బాబూ అన్నాసరే థియేటర్ నుంచి కదలకుండా… సీఎంకు బాగా కాలినట్టుంది… ఫలితంగా అరెస్టు… జైలు… దానికి పోలోమంటూ ఇండస్ట్రీ మొత్తం పరామర్శలు… అందుకే సీఎం అడిగాడు, కాలు పోయిందా, చేయి పోయిందా అని… ఒకరకంగా తెలంగాణ ప్రభుత్వం మీద ఇండస్ట్రీ పెద్దలు ప్రదర్శించిన నిరసన పరామర్శలు అవి…
సరే, రేవంత్ ఎక్కడ, ఎందుకు రాజీపడ్డాడనేది వదిలేస్తే… సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో కోడిమెదడు దర్శకుడు ప్రదర్శించిన వెకిలితనం మరో ఎత్తు… బహుశా రేవంత్ రెడ్డికి విషయం ఎవరూ చెప్పిఉండరు… ఈ సినిమాలో తెలంగాణ సీఎం పాత్ర ఖచ్చితంగా ఆ పోస్టు గౌరవాన్ని మూసీలే కలిపేరకమే…
అత్యంత కృతకంగా తెలంగాణ యాసలో కొన్ని పదాలు మాట్లాడటం, మళ్లీ తనే మామూలు ఆంధ్రా భాషలోకి మళ్లడం దర్శకుడి అర్ధ తెలివి… ఎవడో పారిశ్రామికవేత్త వస్తే సీఎం స్వయంగా వెళ్లి రిసీవ్ చేసుకుంటాడా..? ఎవడో కిడ్నాప్ చేస్తే, ఇంకెవరినో ఆ ప్లేసులో పెడితే… మూడు నాలుగు రోజులు వేరే పని లేనట్టు అక్కడే ఉంటాడా సీఎం..?
పైగా విలన్‌తో వీడియో కాల్స్… సినిమాను సినిమాగా చూడాలి, లాజిక్కులు వెతకొద్దు అనే మాటలు నాన్సెన్స్ ఇక్కడ… తెలంగాణ ఐపీఎస్ అదేదో ఆంధ్రా గ్రామానికి బదిలీ అవుతుందట… తెలంగాణ నుంచి ఆంధ్రాకు బదిలీ ఏమిటో కథ రాసుకున్నవాడికి, తీసుకున్నవాడికి తెలియాలి కదా… నిజానికి సినిమా కథకు తెలంగాణకు సంబంధమే లేదు…
మరి మధ్యలో తెలంగాణ సీఎం పాత్ర ఎందుకు క్రియేట్ చేసినట్టు..? ఇంత వెకిలి చేస్తుంటే సీఎంకు తెలియరాలేదా..? లేక మన దిల్ రాజు సినిమా కదాని వదిలేశాడా..? సో, దిల్ రాజు ఏది చేసినా చెల్లుబాటేనా..? తెలంగాణ సంస్కృతిని వెక్కిరిస్తూ తెల్ల కల్లు, మటన్ ముక్క అని నిజామాబాద్ సభలో పేలాడు… సారీ చెప్పాడు… అంతకుముందు హోస్ట్ శ్రీముఖి అయితే రామలక్ష్మణులు ఫిక్షనల్ కేరక్టర్లు అని పేలింది… సారీ చెప్పింది…
తెలుగు ఇండస్ట్రీని శాసించే స్థితిలో ఉండటం వేరు… కానీ తెలంగాణ సంస్కృతి మీద పిచ్చి వ్యాఖ్యలు తన అహానికి, అధికార ఆధిపత్య ధోరణికి సంకేతం… ఒక్కమాట… తెలంగాణ సీఎం పాత్రకు బదులు చంద్రబాబును పోలే పాత్రను క్రియేట్ చేయగలరా ఈ దిల్ రాజు..? ఈ అనిల్ రావిపూడి..? ఈ నరేష్..? ఒక్కసారి చేసి చూడండి…!!
ఒక సింగర్ మధుప్రియ ఏకంగా కాలేశ్వరుడి గుడి తలుపులు మూసి, భక్తుల్ని బయటికి పంపించి, గర్భగుడిలో ప్రైవేటు సాంగ్స్ రికార్డ్ చేయిస్తే స్పందన లేదు… సోయి లేదు… సంక్రాంతికి వస్తున్నాం సినిమా విషయానికి వస్తే… ఆ బుల్లిరాజు కేరక్టర్ బూతులు మొత్తం పిల్లలపై నెగెటివ్ ఇంపాక్ట్ ఉంటుంది… జబర్దస్త్‌కు ఎక్కువ, ఎఫ్3కి తక్కువ… మరి ట్రిపుల్ బ్టాక్ బస్టర్, 200 కోట్లు దాటి వసూళ్లు అంటారా..? జనం టేస్ట్ అలా ఉంది…
ఎటొచ్చీ ఇంకా ఇంకా తెలంగాణతనం ఛీత్కారానికి, వెక్కిరింపులకు… అందులోనూ ఏకంగా సీఎం పోస్టునే వెకిలి చేస్తుంటే విమర్శించకపోతే ఎలా..? అదే ఇది… ఓసారి సగటు తెలంగాణవాసి కోణంలో ఆ సీనియర్ నరేష్ పాత్రను పరికించండి… సమజవుతుంది..!!
Share this Article