నిర్మాతలు, దర్శకులు, పెద్ద హీరోలు తమ వారసులను ప్రేక్షకుల మీద రుద్దుతారు… వాళ్లు ప్రేక్షకుల తలలపైకి, సారీ, బుర్రల్లోకి ఎక్కి డాన్సులు చేస్తుంటారు… ఏం చేస్తాం మన ఖర్మ… ఒక్కడికీ నటన తెలియదు, వాచికం తెలియదు, బేసిక్స్ తెలియవు… దేభ్యం మొహాలు వేసుకుని, డాన్సులుగా పిలవబడే నాలుగు పిచ్చి గెంతులు నేర్చుకుని, ఆ ఫైట్లు వంటి రెండు సర్కస్ ఫీట్లు చేసేసి, ఇక సినిమా రంగాన్ని ఉద్దరిస్తున్నట్టే హైపులు, ప్రచారాలు, మీడియా పిచ్చి రాతలు… కొందరు నిలబడతారు, ఇంకొందరు కొట్టుకుపోతారు, మరికొందరిని వేరే దిక్కులేక ప్రేక్షకులు భరిస్తారు…
డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్, ప్రొడక్షన్ వంటి కీలక సినిమా బిజినెస్ విభాగాల్ని గుప్పిట్లో పెట్టుకున్న కొందరు ప్రముఖుల్లో దిల్ రాజు కూడా ఉంటాడు కదా… తనకు తెలుసు కదా ఈ సంగతులన్నీ… డబ్బు, పెత్తనం, ఆధిపత్యం తన కాలి వేలి నుంచి కొస జుత్తు వెంట్రుక దాకా కనిపిస్తుంది కూడా… అందుకే రాజ్ తరుణ్, శ్రీవిష్ణు వంటి హీరోలను పులుసులో పురుగుల్లాగా తీసిపారేసిన తీరు కూడా చూశాం… ఎవడెవడికో లైఫ్ ఇస్తున్నాం, మరి మన వారసుడు కూడా రావాలి కదా అనుకున్నట్టున్నాడు… బ్రదర్ కొడుకు అశిష్ రెడ్డిని రంగంలోకి దింపాడు… రౌడీ బాయ్స్ అని ఓ సినిమా తీశాడు… కానీ, ఇప్పుడు చెప్పు దిల్ రాజూ… సినిమా ఔట్ పుట్ చూశావు కదా, నీ అన్నకొడుకు మెరిట్ చూశావు కదా… డైరెక్టర్ ఎంత తన్నుకున్నా ఆ మొహంలో ఒక్క ఫీలింగ్ కూడా పలకడం లేదు కదా… శ్రీవిష్ణు, రాజ్ తరుణ్‌కన్నా నీ అన్నకొడుకు ఏం బెటరో… పైగా 25 కిలోలు తగ్గాడట హీరో కెరీర్ కోసం… అంటే అంత భారీ బరువును కసాకసా కోయించుకుని ఉంటాడు…
తను హీరోగా ఎస్టాబ్లిష్ కావడానికి ఎన్నేళ్లు పడుతుందో ఓసారి అంచనా వేయి… తెలుగు సినిమాను గుప్పిట పెట్టుకుంటే, వారసుడిని ప్రమోట్ చేస్తే, ప్రేక్షకుడు మరీ జేజేలు కొట్టి, నెత్తిన పెట్టుకుని పూజిస్తాడా..? చూద్దాం… పోనీ, ఓ టేస్టున్న సినిమాను తీశావా..? లేదు… రెండు కాలేజీలు, పోరగాళ్ల పంచాయితీలు… అదీ ఓ మెడికల్ కాలేజీ, మరో ఇంజనీరింగ్ కాలేజీ నడుమ గ్యాంగ్ వార్… ఏ కాలం నాటి కథ నాయనా ఇది..? ఓ ఎమోషన్ లేదు, ఓ ప్రయోగం లేదు, ఓ కొత్తదనం లేదు, ఓ క్రియేటివిటీ లేదు… డబ్బులు పారేసి, ప్రలోభపెట్టి, ఫాఫం, అంతటి అనుపమతో కూడా లిప్ లాక్ చేయించావు… అసలు సినిమాలో పెద్ద మైనస్ హీరోయే… దేవిశ్రీప్రసాద్ ఎంత కష్టపడి ఏవేవో ట్యూన్లు కొడితే ఏం లాభం..? అసలు హీరో కేరక్టరైజేషనే బోర్, బోరర్, బోరెస్ట్…
Ads
ఇప్పుడు చూడాలి, దిల్ రాజు, తన సాధనసంపత్తిని ఎలా వినియోగించి, ఏమేరకు ఈ వారసుడిని నిలబెడతాడో చూడాలి… హేపీడేస్, ప్రేమదేశం గట్రా ప్రేమ, కాలేజీ కథల్ని మిక్సీ చేసి, ఓ కొత్త కథను తయారు చేశాను అనిపించుకుని, ప్రేక్షకుల మీదకు వదిలిన బాణం… ఓటీటీల్లో రాకపోదు, టీవీల్లోకి కూడా రాకుండా పోదు… మరీ ఒమిక్రాన్ భయాల నడుమ థియేటర్ దాకా వెళ్లి, నిలువు దోపిడీ ఇచ్చుకునేంత సీన్ ఏమీ లేదు… దిల్ రాజు కదా అని మొహమాటపడాల్సిన పనిలేదు… ఈ రోజుల్లో దేహఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే…
Share this Article