టీవీ రియాలిటీ షోలలో జడ్జిలను మారిస్తే… యాంకర్లను మారిస్తే టీఆర్పీలు పెరగవు, ఆదరణ దక్కదు… చేయాల్సింది షోను జనానికి కనెక్టయ్యేలా నడపడం… మాస్టర్ చెఫ్, ఎవరు మీలో కోటీశ్వరులు షోలతో రీసెంటుగా జెమిని టీవీకి కళ్లు తెరుచుకున్నయ్… అదిరింది షోతో జీటీవీకి తెలిసొచ్చింది… కామెడీ స్టార్స్, స్టార్ట్ మ్యూజిక్ షోలతో మాటీవీ పాఠం నేర్చుకుంది… స్వరాభిషేకం, పాడుతాతీయగా షోలతో ఇప్పుడు ఈటీవీకి అనుభవం అవుతోంది… షోలో దమ్ముండాలే తప్ప ఈ యాంకర్లు, జడ్జిల మార్పులతో రేటింగుల్లో జంప్ రాదు అనే నిజం తెలిసినా సరే, టీవీలు మార్పులు చేస్తూనే ఉంటయ్…
అలాగే సీనియర్, ఎఫిషియెంట్ యాంకర్లు, హోస్టులు ఉన్నా సరే, ఆ షో క్లిక్కవ్వాలని కూడా ఏమీలేదు… స్టార్ట్ మ్యూజిక్ షోతో సుమ, సూపర్ క్వీన్ షోతో ప్రదీప్, మాయాద్వీపంతో ఓంకార్, మాస్టర్ చెఫ్ షోతో అనసూయ చేదు అనుభవాల్ని మనం గమనించిందే కదా… అన్నట్టు మ్యూజిక్, ప్రదీప్ అనగానే గుర్తొచ్చింది… ఈమధ్య ప్రదీప్ చేస్తున్న ఏ రియాలిటీ షో కూడా పెద్దగా రేటింగ్స్ తీసుకురావడం లేదు… జీలో ఓ మ్యూజిక్ షో వస్తుంది తెలుసు కదా… సరిగమప… అది గత సీజన్లో ఏమాత్రం క్లిక్ కాలేదు, పూర్ టీఆర్పీలు దక్కాయి…
ప్రదీప్ నిజానికి బాగానే యాంకరింగ్ చేశాడు… స్పాంటేనియస్‌గా తను వేసే చెణుకులు నవ్వులు పూయించినా సరే, ఓ మ్యూజిక్ షో కాస్తా కామెడీ షో అయ్యిందనే విమర్శలు కూడా వచ్చాయి… ఈసారి సరిగమప సింగింగ్ సూపర్ స్టార్ అని కొత్త సీజన్ స్టార్ట్ చేయబోతున్నారు, వచ్చే 20న లాంచింగ్… ఈసారి ప్రదీప్ లేడు, శ్రీముఖి వచ్చి చేరింది… తను కూడా సీనియరే…
Ads
ఎలాగూ ఈటీవీలో పాడుతా తీయగా పెద్దగా క్లిక్ కావడం లేదు కాబట్టి… ఇదే అదునుగా తన మ్యూజిక్ రియాలిటీ షోను ఎలాగైనా హిట్ చేసుకోవాలని జీటీవీ ప్రయత్నం చేస్తోంది… అందుకే ఎడాపెడా మార్పులు చేసేసింది… యాంకరే కాదు, గతంలో ముగ్గురు జడ్జిలు ఉండేవాళ్లు కదా… శైలజ, కోటి, చంద్రబోస్… (రెండు ఎపిసోడ్లకు కల్పన కూడా జతచేరింది)… ఇప్పుడు లిరిసిస్ట్ చంద్రబోస్‌ను తీసేశారు… శైలజ, కోటి అలాగే ఉండగా, కొత్తగా స్మిత, అనంత శ్రీరామ్ వచ్చి చేరారు… పర్లేదు, కానీ తెలుగు రియాలిటీ షోలలో ముగ్గురేసి, నలుగురేసి జడ్జిలు ఉన్న షోలు పెద్దగా వర్కవుట్ కాలేదు మరి…
గతంలో జూరీ పేరిట దామిని, దీపు, సాకేత్, హారిక, రేవంత్, పృథ్వి, రఘురామ్, సోనీ, సందీప్ కనిపించేవాళ్లు… ఒక్కో ఎపిసోడ్‌కు ఒక్కో గెస్టును తెచ్చేవాళ్లు… సో మెనీ కేరక్టర్స్… ఈసారి మెంటార్స్‌గా సాకేత్, రేవంత్, గీతామాధురి, శ్రీకృష్ణలను తీసుకొస్తున్నారు… లాంచింగే భారీగా, పూజా హెగ్డే ముఖ్యఅతిథిగా చేయనున్నారు… నిన్న రిలీజ్ చేసిన తాజా ప్రోమో కూడా బాగుంది… ఇండియన్ ఐడల్ షోలో కంటెస్టెంట్లు ఎలా పాడినా సరే జడ్జిలు, గెస్టులు పొగడాలని ఓ షరతు పాటిస్తుంటారు… ఈ సరిగమప షోలో కూడా అనంత శ్రీరామ్ అందరినీ ఆహా ఓహో అని ఎత్తుకుంటున్నాడు… నిజానికి కాంపిటీషన్ కదా, గాయకుల లోపాలను కూడా తార్కికంగా ప్రస్తావించాలి… ఆ పని చేయాల్సింది కోటి, శైలజ… చూడాలిక…!!
Share this Article