నిజానికి ఏమీ చెప్పుకోవద్దు… చరిత్రకు వక్రబాష్యం చెబుతూ, చరిత్రపురుషుల కథను వంకరబాట పట్టిస్తూ… కొత్తతరం ఇదే అసలు చరిత్ర అనుకుని తప్పుదోవ పట్టేలా, ఓ చరిత్రకు ద్రోహం చేసిన సినిమా గురించి అస్సలు చెప్పుకోవద్దు… 2000, 3000, 4000, 5000 దాకా బెనిఫిట్ షో టికెట్ల ధరలు… పేదప్రజల ఆరాధ్య సీఎం జగన్ పెంచిన అడ్డగోలు ధరలు… నిరుపేద ప్రజల సీఎం కేసీయార్ పెంచిన ఔదార్యపు ధరలు… ఆ ఫుల్ కమర్షియల్ దందాకు అందరూ దాసోహం అంటున్న వేళ… సాగిలపడుతున్నవేళ… టికెట్టు దొరికి సినిమా చూడటమే జన్మసార్థకం అనేంతగా హైప్ క్రియేట్ అయిన వేళ…
అసలు ఆ సినిమా చూడటమే ఒక అరుదైన అదృష్టంగా ప్రేక్షకజనం భక్తిగా తరిస్తున్నవేళ… సినిమా చూడకపోతే తప్పకుండా రౌరవాది నరకాలకూ పోతారన్నంతగా వాతావరణం ఆన్ని మెదళ్లనూ ఆవరించినవేళ… ఏపీ రాజకీయ ప్రాబల్యమున్న కమ్మ, కాపు కుల బ్యాలెన్స్‌తో ఓ పాన్ వరల్డ్ దర్శకుడు కిందామీదా పడుతున్నవేళ… ఆ సినిమా గురించి మాట్లాడుకోకపోతే ఎలా..? ఈ స్థితిలోనూ కథ, కాకరకాయ, ఉదాత్తత, విశ్వసనీయత వంటి పదాలతో ఎవడైనా వ్యతిరేకిస్తే వాడిని దేశద్రోహిగా ముద్రవేసే వేళ… ఒరేయ్, చరిత్రను ఇంత నీచంగా చిత్రించడం పాపంరా అని ఎవడైనా నోరువిప్పితే వాడి నోరు మూయించేవేళ… ఓ ఇండియన్ సూపర్ డూపర్ బంపర్ మెగా సుప్రీం డైరెక్టర్ కళాసృష్టి గురించి అబ్జెక్టివ్‌గా చెప్పకుండా… కీర్తించకుండా ఉంటే అది కళాద్రోహం అని ముద్రలేసేవేళ… చెప్పుకోకుండా ఎలా ఉండాలి..?
Ads
ఒకే ఒక ప్రశ్న… క్రియేటివ్ ఫ్రీడం… కల్పిత కథ… ఈ పేర్లు చెబితే చాలు, ఇక ఏది చూపించినా, ఏది చిత్రించినా, ఏది జనం మీదకు వదిలినా బారా ఖూన్ మాఫ్ అన్నట్టేనా..? అసలు నీరు, నిప్పు నడుమ పోరాటం ఏమిటి..? పోనీ, కలిసిన పోరాటం ఏమిటి..? ఒక కుమ్రం భీమ్ సాగించిన పోరాటం దేని మీద..? ఒక అల్లూరి స్పూర్తిదాయక యుద్ధం ఎవరి మీద..? ఈ కథలో చూపించింది ఏమిటి…? సినిమా చూస్తున్నంతసేపూ అదే పదే పదే కలుక్కుమంటుంటే దాచుకోవడం ఎలా..? ఏ బ్రిటిష్ సైన్యం మీద అలుపెరగని పోరాటంలో ప్రాణాలు కోల్పోయాడో ఆ అల్లూరిని అదే బ్రిటష్ సైన్యంలో సైనికుడిలా ఎలా చూసేది..? కడుపు రగిలిపోదా ఏం..? ఎంత రాజమౌళి అయితేనేం..? రారాజమౌళి అయితేనేం..?
ఒక భీమ్ పోరాటం ఆదివాసీల జల్, జంగిల్, జమీన్ కోసం నిజాంపైనా పోరాడింది..? లేక బ్రిటిషర్ల మీదా…? అసలు తమ జీవితకాలంలో కలిసే చాన్సే లేని రెండు చారిత్రక పాత్రలు కలవడం ఏమిటి..? కలిసి పోరాడటం ఏమిటి..? సరే, సరే, అవన్నీ వదిలేద్దాం… హాలీవుడ్ రేంజ్ దాటేసిన పాన్ వరల్డ్ బుర్రాగ్రేసరుడు రాజమౌళి గురించి ఏ నింద వేసినా కళ్లుపోతయ్ ఇప్పుడు… ఈ సినిమా గురించే చెప్పుకుందాం… ఇవి భీమ్, అల్లూరి పాత్రలు కావనీ, జస్ట్, ఓ కల్పితకథ అనీ సమాధానపడదాం కాసేపు…
ఇద్దరు పాపులర్ స్టారాధిస్టార్లు కాబట్టి ఫైట్లు, డాన్సులు… మానవాతీత శక్తులేవో ఆవరించిన పాత్రలే అనుకుందాం… కమర్షియల్ దందా అని జవాబు మనమే చెప్పేసుకుందాం.,. బాహుబలితో పోలిక కూడా కరెక్టు కాదు… తాడిచెట్లు స్ప్రింగుల్లా మారిన అత్యంత విచిత్ర యుద్ధరీతుల్ని చూసి తరించాం కదా… ఓ బుల్లెట్ బండిని గిరగిరా తిప్పేసిన ఈ సినిమా స్టంట్ కూడా అలాగే చూసి తరిద్దాం… అన్నీ సరే… పైగా రాజమౌళి… ప్రతి సీన్‌ను హాలీవుడ్ స్థాయిలో చెక్కుతాడు…
నో డౌట్… కథ దరిద్రం అయినా సరే… కథనం బాగుండేలా… ప్రతి సీన్ ప్రేక్షకుడిని మరోలోకంలోకి తీసుకుపోయేలా రాజమౌళి చెక్కగలడు… అదే స్థాయిలో ఆ ఔట్‌పుట్ నుంచి వేల కోట్లు పిండుకోగలడు… అదే గ్రాండియర్ ఈ సినిమా కూడా… రాంచరణ్, జూనియర్ నటనకు వంకలు పెట్టేది ఏముంది..? ఇద్దరూ ఇరగదీశారు..! పైగా హీరో చెప్పినట్టే సినిమా వండబడే ఈ రోజుల్లో ఓ డైరెక్టర్ చెప్పినట్టు ఏళ్ల తరబడీ డేట్లు, ప్రయాస మెచ్చుకోదగిందే కదా…
సరే, ఓ ఆలియా భట్, ఓ అజయ్ దేవగణ్… హిందీ ప్రేక్షకుల డబ్బుల కోసం, పాన్ ఇండియా లక్కు కోసం అని రాజీపడదాం… వాళ్లకు పెద్ద ప్రాధాన్యమేమీ లేదు,.. ఒలీవియా, మరో ఇద్దరు ముగ్గురు బ్రిటిష్ నటులూ కనిపించారు… ప్రాధాన్యం లేదు… వీళ్ల పేరిట కోట్లకుకోట్లు పెట్టి, ఆ పేరిట ప్రేక్షకుల జేబుల్ని లూటీ చేయడం కూడా కరెక్టే అనుకుందాం కాసేపు… కానీ అసలు ఆ కథేమిటి..?
మల్లి పాత్ర బాగుంది సరే… ఆమెను వాడెవడో బ్రిటిషోడి పెళ్లాం ఎత్తుకుపోవడం ఏంది..? తమ ఆదివాసీ సమాజం అభ్యున్నతి కోసం అహరహం పోరాడిన భీమ్ ఆ అమ్మాయి కోసం ఢిల్లీ వెళ్లి కోట బద్దలు కొట్టడం ఏమిటి..? బ్రిటిష్ సైన్యంలో పనిచేసే అల్లూరితో తనకు వైరం ఏమిటి..? జైలు ఏమిటి..? తప్పించుకోవడం ఏమిటి..? అప్పుడే తన్నుకుంటారు, అప్పుడే కలిసిపోతారు, అప్పుడు స్టెప్పులేస్తారు, అప్పుడే భుజాలు కలుపుతారు… రాజమౌళీ ఏమైంది నీకు అసలు..?
ఎస్, రాజమౌళి ఓ సినిమాను గ్రాండియర్‌గా ప్రజెంట్ చేయగలడు, ఇందులోనూ అలాగే చేశాడు… కొన్ని సీన్లు నిజంగా అబ్బురపరుస్తయ్… వావ్ రాజమౌళీ అనిపించేలా, చప్పట్లు కొట్టేలా ఉంటయ్… కానీ అవన్నీ టేక్ ఇట్ ఫర్ గ్రాంట్ అనుకోవాలా..? సుప్రీం హీరోయిజాన్ని ఆపాదించిన సీన్లను పోనీలే కమర్షియల్ వాల్యూస్ కోసమే అనుకుందామా..? ది గ్రేట్ సంగీత దర్శకుడు కీరవాణి పాటలు, బీజీఎం సోసో… కామెడీ ఎలాగూ రాజమౌళికి చేతకాదు… ఇందులో బాహుబలి మార్క్ లవ్, రొమాన్స్ కూడా లేదు… ఇవన్నీ సరే, సినిమా చూడొచ్చా… చూడొచ్చు… అవి భీం, అల్లూరి పాత్రలు కావని ముందే ఫిక్సయిపోయి, ఓ తెలుగు మల్టీస్టారర్ కమర్షియల్ సినిమా మాత్రమే అనుకుని థియేటర్‌లో అడుగుపెట్టండి… సరిపోతుంది…
ఆ సౌండ్, ఆ సినిమాటోగ్రఫీ క్వాలిటీ, ఆ సీన్ల చిత్రీకరణ… అబ్బురమే… కానీ ఓ మంచి క్రెడిబుల్ నిజాయితీ కథకు ఇవన్నీ జతకూడితే ఎంత బాగుండు..? రాజమౌళిని సరైన దారిలో ఓ సినిమా తీయించగలిగితే ఎంత బాగుండు..? ఛల్, మాది ఫిక్షన్, ఎవ్వడూ నోరెత్తకూడదు అనే అహం లేకుండా… ఓ ప్రపంచవ్యాప్త ఆర్ట్ దందా అనుకునే ప్రమోషన్ గుర్తుకురాకుండా… నిజంగానే ఓ మంచి సినిమా వస్తే ఎంత బాగుండు..? దారితప్పిన రాజమౌళి పర్వర్షన్ నయమైపోయి, ప్రతిభ ఓ మంచి గ్రాండియర్ కళాఖండం కోసం పనిచేస్తే ఎంత బాగుండు…!!
Share this Article