Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వంద రోజులు ఆడిన సినిమాయే… వంద మార్కుల సినిమా మాత్రం కాదు…

June 8, 2024 by M S R

శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం… వంద రోజులు ఆడిన సినిమా అయినా ఇది వంద మార్కుల సినిమా మాత్రం కాదు . ప్రముఖ నాటక రచయిత తాండ్ర సుబ్రమణ్యం రచించిన శ్రీకృష్ణార్జున యుధ్ధం , రామాంజనేయ యుధ్ధం నాటకాలు తెలుగు నాట చాలా పాపులర్ . ఆ నాటకం ఆధారంగానే మే 1972 లో వచ్చిన ఈ శ్రీకృష్ణార్జున యుధ్ధం సినిమా తీయబడింది .

త్రేతాయుగం చివర్లో శ్రీరాముని అవతారం చాలించమని అడిగేందుకు యముడు వచ్చినప్పుడు బయట కాపలాగా లక్ష్మణుడిని నియమిస్తాడు శ్రీరాముడు . దూర్వాసుడు రావటం , లక్ష్మణుడు ఏకాంత భంగం చేయటం , రాజ్యబహిష్కరణ కావటం మనందరికీ తెలిసిన కధ . ఈ సినిమాలో కాపలాగా ఆంజనేయుడు నియమించబడతాడు . వాల్మీకి రామాయణంలో ఏముందో నాకు తెలియదు . పండితులకే తెలవాలి . పామరులకు ఏది కరెక్టో తెలియదు .

ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా కధ సత్యభామ గర్వభంగం సినిమా అని చెప్పవచ్చేమో ! కృష్ణావతారంలో నారదుడు ఆంజనేయుడిని రెచ్చగొట్టి , బలరామ శ్రీకృష్ణుల మీదకు పంపటం , సత్యభామ అవమానపడటం , కృష్ణుడితో తలపడటం , ఓడిపోవటం , రుక్మిణి ప్రవేశంతో ఆంజనేయుడు శాంతించటం , కృష్ణుడు విష్ణువు రూపంలో ప్రేక్షకులకు దర్శనం ఇవ్వడంతో సినిమా ముగుస్తుంది .

Ads

సినిమా అంతా కూడా ఏదో లోపం ఉన్నట్లు ప్రేక్షకుడికి అర్ధమవుతుంది . NTR ని కూడా అందంగా చూపలేకపోవటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది . రుక్మిణిగా – సీతగా దేవిక బదులు అంజలీదేవిని పెట్టుకుని ఉంటే బాగుండేది . సత్యభామగా జమునని , యస్ వరలక్ష్మిని చూసిన తెలుగు ప్రేక్షకులు వాణిశ్రీని చూడలేకపోయారు . ముఖ్యంగా ఆంజనేయుడిని రారా అని ఒక సన్నివేశంలో పిలవటం ఒక ప్రేక్షకుడిగా ఇప్పటికీ నేను జీర్ణించుకోలేను .

ఇలాంటి లోపాలు కధాపరంగా , నటీనటుల ఎంపికలో , సంభాషణలలో చాలా ఉన్నా NTR సినిమా కావటం వలన వంద రోజులు ఆడింది . కమర్షియల్ గా కూడా సక్సెస్ అయింది . రిపీట్ రన్సులో కూడా బాగానే ఆడింది . ముఖ్యంగా ఈ సినిమా రాజనాల సినిమా . శ్రీరామ భక్తుడిగా తన భక్తిప్రపత్తులను చూపటంలో , వీరాంజనేయుడిగా తన ప్రతాపం చూపటంలో గొప్ప నటనని ప్రదర్శించారు . ఈ సినిమాలో వంద మార్కులు అతనికి ఒక్కరికే .

బలరాముడిగా SVR , నారదుడిగా కాంతారావు , గరుత్మంతుడిగా ఆర్జా జనార్ధనరావు , యముడిగా ధూళిపాళ నటించారు . ఇతర పాత్రల్లో త్యాగరాజు , రాజబాబు , శాంతకుమారి , హేమలత , లీలారాణి , నాగయ్య ప్రభృతులు నటించారు . పౌరాణికం అనగానే చాలామంది నటీనటులు కావాలిగా ! చాలామంది ఉన్నారు .

రాముడి మీద పాడబడిన ఏ పాటయినా హిట్ కావలసిందే . రామనామంలో , రామగానంలో ఉన్న మాధుర్యం అలాంటిదేమో ! ఈ సినిమాలో కూడా రామా రఘురామా పాట అలాంటిదే . ద్వారకలో అందరిచేత ఆంజనేయుడు పాడించి , ఆడించే పాట చాలా శ్రావ్యంగా ఉంటుంది .

తాండ్ర సుబ్రమణ్యం నాటకంలోని పద్యాలనే ఈ సినిమాలో కూడా వాడుకున్నారు . ఆనాటి తెలుగు ప్రేక్షకులకు ఆ పద్యాలన్నీ సుపరిచితమే .
టి వి రాజు సంగీత దర్శకత్వంలో పాటలు , పద్యాలు అన్నీ శ్రావ్యంగా ఉంటాయి . సి యస్ రావు దర్శకుడు . మా నరసరావుపేటలో చూసా . టివిలో కూడా ఏదో చానల్లో ఈ మధ్య కూడా చూసా . యూట్యూబులో ఉంది . చూడనివారు చూడవచ్చు . చూడబులే . .. ((డోగిపర్తి సుబ్రహ్మణ్యం ))

#తెలుగుసినిమాలు #తెలుగుసినిమాలసింహావలోకనం

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒంటె ఒక్క కన్నీటి చుక్క… 26 పాముల విషానికి విరుగుడు…
  • ఇండోసోల్ కంపెనీ… అది మరో మేఘా… అయినవారే అందరికీ…
  • యాక్టింగ్ సీఎం మీనాక్షి పట్ల పొంగులేటి డోన్ట్ కేర్ యాటిట్యూడ్..!!
  • ఫిష్ వెంకట్‌కు హీరో ప్రభాస్ సాయం..? నిజమా..? అబద్ధమా..?
  • కడుపు పండించిన AI … కృత్రిమ గర్భధారణలో కృత్రిమ మేధస్సు..!!
  • వనతి శ్రీనివాసన్… జేపీ నడ్డా ప్లేసులో బీజేపీ జాతీయ అధ్యక్షురాలు..?!
  • ఆకుపచ్చని సూరీడు అల్లూరికి బెంగాలీ అరవింద్ ఘోష్ శిక్షణ..?!
  • జనాదరణలో దుమ్మురేపుతున్న మన యువ గాయకుడు…
  • పాకిస్థాన్ నుంచి మైక్రోసాఫ్ట్ ఔట్… ఒక్కొక్కటీ బయటపడుతున్నయ్…
  • నా వెనకాల ఎందుకు నిలబడ్డారు? – ప్రవచనకర్త చాగంటి క్లాస్ …

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions