Sai Vamshi……….. #శ్రీవిద్య .. జీవితంలో ఒకానొక సమయంలో ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడూ ఇష్టపూర్వకంగానో, అయిష్టంగానో కొన్ని సంబంధాల్లోకి తోయబడతారు. అది పెళ్లి కావచ్చు, సహజీవనం కావచ్చు. మరేదైనా కావచ్చు. నేను పెళ్లి చేసుకోవాలని అనుకున్న ఓ వ్యక్తి నన్ను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఆ వ్యక్తి ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు!
మా పెళ్లి దాదాపు ఖరారైంది. ఒకరి ఇంటికి మరొకరు వచ్చి వెళ్తున్నారు. ఆ సమయంలో మేమిద్దరం 22 ఏళ్ల ప్రాయంలో ఉన్నాం. మరొక్క ఏడాది ఆగి పెళ్లి చేద్దామని పెద్దలు అనుకున్నారు. ఆ ఏడాదిలో అంతా మారిపోయింది. ఆయన మరో వ్యక్తితో ఉన్న సంగతి తెలిసి, నాతో ఆయన పెళ్లి జరగదని అర్థమయ్యాక నా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి.
మా అమ్మ (ఎం.ఎల్.వసంతకుమారి) నన్ను తీసుకుని లాయర్ దగ్గరికి వెళ్లింది. అప్పుడు నేను ఉండటానికి ఒక ఇల్లు కావాలి. డబ్బులెలా? ఆ సమయంలో దేవుడు నా వెంట ఉన్నాడు. వెంటనే AVM సంస్థ నుంచి డబ్బులు వచ్చాయి. ఆ తర్వాత రోజు టి.రాజేందర్ గారి సినిమా షూటింగ్ ఉంది. అక్కడికి వెళ్ళి నటించాను. అలా రెండు, మూడు రోజుల్లో నాకు కావాల్సిన డబ్బు వచ్చింది. ఒక ఇంటికి అడ్వాన్స్ ఇచ్చాను. మళ్లీ నా జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టాను.
Ads
ఏ వ్యక్తినైతే వివాహం చేసుకోవాలని అనుకుని అది జరగకుండా పోయిందో, ఆ వ్యక్తి మీద నాకేమీ కోపం లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అదే వ్యక్తి తన సొంత సినిమాలో నటించమని కోరినప్పుడు వెళ్లి ఆయనకే అమ్మగా నటించాను. అదొక Professionalism. ఇలాంటి క్షమించే గుణం నాకు ఎలా వచ్చింది అని ఎవరైనా అడిగితే, అది దైవానుగ్రహం అంటాను.
ఏదేమైనా నాకు పెళ్ళికి ముందు జీవితమే బాగుంది. నచ్చిన పాటలు, మెచ్చిన ఆటలు, సంగీతం, నాట్యం.. అంతా రంగుల లోకంలో ఉన్నట్టు ఉంది… (2006లో క్యాన్సర్తో మరణించే ముందు నటి శ్రీవిద్య ఓ మలయాళ ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు..)
Share this Article