.
దీన్నే తనకుమాలిన ధర్మం అంటారు… ప్రజెంట్ భాషలో చెప్పాలంటే ఓవరాక్షన్ అంటారు… నందమూరి తమన్ అలియాన్ కొణిెదల తమన్ కల్యాణ్… నిన్న అఖండ-2 విజయోత్సవ సభలో (విజయమేనా అనేది వేరే సంగతి) మాట్లాడుతూ ఏమంటాడంటే..?
‘‘తెలుగు ఇండస్ట్రీకి దిష్టి తగిలింది… డిసెంబర్ 5న విడుదల కావాల్సిన సినిమా 12న విడుదలైంది… నిజంగా కేసు వేయాలనుకుంటే ముందే వేయొచ్చు… కానీ లాస్ట్ మినిట్ లో వచ్చి అడ్డంకులు సృష్టిస్తారు… ప్రపంచంలో ఐక్యత కరువైందనడానికి ఇదో నిదర్శనం…
Ads
నేను, నాది అనే ఆలోచన పక్కనపెట్టి ‘మనది’ అని అనుకున్నప్పుడు ఇలాంటివి జరగవు… అంతా సలహాలిచ్చేవాళ్లే… చానళ్లకెక్కి ప్రసంగాలు చేసేవాళ్లే… ధైర్యాన్నిచ్చే వాళ్లు మాత్రం లేరు… దెబ్బ తగిలితే బ్యాండ్ ఎయిడ్ వెయ్యాలి కానీ… రోడ్డు మీదకెక్కి బ్యాండ్ వాయించకూడదు… కలిసి కూర్చొని మాట్లాడుకుంటే తీరిపోయే సమస్యలన్నింటినీ ప్రపంచమంతా తెలిసేలా చేసుకుంటున్నారు…
ఇది కరెక్ట్ కాదు… ఇది జనాల్లోకి చెడుగా వెళ్తుంది… మన తెలుగు సినిమా బయటవాళ్లంతా ఈర్ష్య పడేంత గొప్ప పరిశ్రమ… అలాంటి పరిశ్రమలో ఐక్యత అనేది ఉంటే ఇంకా ఎదుగుతుంది… యూనిటీగా ఉండాల్సిన సమయం ఆసన్నమయింది… ఈ సినిమా బిజినెస్ గురించి ప్రపంచానికి ఎందుకు తెలియాలి?
లాస్ట్ మినిట్లో సినిమాను ఎందుకు ఆపాలి? రేపొద్దున్నే సినిమా విడుదలవుతుంటే… విడుదల ఆగిందంటూ ట్వీట్ వేయాల్సిన ఖర్మ నిర్మాతలకు ఎందుకు? వారెంత కుమిలిపోయుంటారు… నిర్మాతలకూ ఒక కుటుంబం ఉంటుందని ఎందుకు ఆలోచించరు?’’

1) నీ సంగీతం నువ్వు చూసుకుని, నీ రెమ్యునరేషన్ నువ్వు తీసుకుని చెక్కేయకుండా… నీకెందుకు ఈ ఫైనాన్షియర్స్, ఈ నిర్మాతల పంచాయితీలో వేలు పెట్టడం..? నువ్వు ఆర్చేవాడివి కాదు, తీర్చేవాడివి కాదు…
2) కేసు వేయాలనుకుంటే ముందే వేయొచ్చు అంటావు సరే… పాత బకాయిల్ని వసూలు చేసుకోవాలనుకుంటే ఏ సమయంలో మెడ మీద కత్తి పెట్టాలో ఫైనాన్షియర్లకు తెలుసు… నడుమ నీకేం నొప్పి తమన్..? నీ కాపీ ట్యూన్లేవే నువ్వు చూసుకోక…
3) ఇందులో ఐక్యత లేకపోవడం ఏమిటి..? పాయింట్ బ్లాంకులో గురిపెడితే కదా… అందరూ ఐక్యంగా పరుగెత్తుకొచ్చి సమస్య సాల్వ్ చేశారు… అదే ఐక్యత అంటే..? నీకు అంతగా లోతుగా తెలియదు గానీ సైలెంటుగా ఉండు…
4) దెబ్బ తగిలితే బ్యాండ్ ఎయిడ్ వేయాలి గానీ బజారుకెక్కి బ్యాండ్ వాయించకూడదు… కరెక్ట్, ఇరోస్ సంస్థకు దెబ్బ తగిలితే ఎవడు బ్యాండ్ ఎయిడ్ వేశాడు మరి..? పాత బకాయిల్ని అడుగుతాడని, బ్యానర్ పేరు మార్చి, దొంగతనంగా సినిమా రిలీజుకు సిద్ధపడింది ఎవడు..? అది కదా ఇష్యూ… అది కదా మోసం..?
5) విడుదల ఆగితే నిర్మాతలు కుమిలిపోయారా..? వాళ్లకూ ఓ కుటుంబం ఉంటుందా..? మరి వాడు 28 కోట్లను ఎగ్గొట్టడానికి ప్రయత్నించినప్పుడు ఏమైంది ఈ నీతి బోధ..? ఏం..? ఇరోస్ వాళ్లకు కుటుంబాలు లేవా..? పుణ్యానికి వచ్చిన పెంకాసులా ఆ పైసలు..? నాన్సెన్స్, అబ్సర్డ్… తమన్, ఇంకా ఇజ్జత్ తీసుకోకు… ఉంటేనే..!!
6) సినిమా బిజినెస్ గురించి ప్రపంచానికి అక్కర్లేదా..? మూర్ఖత్వం… ఏ లెక్కలు చూపించి టికెట్ రేట్లను అడ్డగోలుగా పెంచారు..? చెల్లించేది ఎవరు..? ప్రేక్షక ప్రపంచం కాదా..? కనీస అవగాహన లేకపోతే అన్నీ మూసుకోవాలి… అంతేతప్ప నీతిబోధలు చేయకూడదు తమన్… మరీ దిష్టి, గిష్టి అని కొణిదెల తమన్ కల్యాణ్‌లాగా మాట్లాడకు..!!
ఫ్లూటు జింక ముందు, అంటే ఆహా ఓటీటీ తెలుగు ఇండియన్ ఐడల్‌లో ఊదు... మెయిన్ స్ట్రీమ్ మీడియా ముందు కాదు...!!
Share this Article