టీవీ రేటింగ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం, ప్రసార మంత్రిత్వ శాఖ, ట్రాయ్ ఎప్పుడూ సందేహాస్పదంగానే వ్యవహరిస్తున్నయ్… కొన్ని వేల కోట్ల యాడ్స్ డబ్బు ఇన్వాల్వ్ అయి ఉన్న దందా అది… ఇప్పుడూ అంతే… కాస్త వివరంగా చెప్పుకుందాం… స్టార్, జీ, సోనీ, సన్ వంటి పెద్ద పెద్ద పెద్ద చానెళ్ల గుత్తాధిపత్యం సాగుతూ ఉంటుంది… వాళ్లు ఏదంటే అది చేయగలరు… నిజానికి ఆఫ్టరాల్ కొన్ని రీడింగ్ మీటర్లతో మొత్తం దేశవ్యాప్త టీవీ వీక్షణను లెక్కించడం, అంచనా వేయడం పక్కా అశాస్త్రీయం… ఆ పని అంతకుముందు టామ్ అనే ఏజెన్సీ చేసేది… మీటర్ రీడింగుల రిగ్గింగ్, ఫ్రాడ్ బయటపడేసరికి, బార్క్ తెర మీదకొచ్చింది… ఏమైనా బాగుపడిందా..? ఏమీలేదు…
అవే మీటర్లు, అవే రీడింగులు… ఆ డేటా తెలిస్తే చాలు, సదరు రీడింగ్ డబ్బా ఉన్న ఇంటికి వెళ్లి, డబ్బులిచ్చి, మేనేజ్ చేసుకోవడం… తెలుగు చానెళ్లు సహా అందరూ ఈ దందాకు ఎగబడ్డారు… యాడ్స్ డబ్బులే డబ్బులు… ఎప్పుడైతే రిపబ్లిక్ టీవీ వాడి బండారం బయటకొచ్చిందో బార్క్ న్యూస్ చానెళ్ల రేటింగ్స్ ఆపేసింది… దాదాపు 15 నెలలు గడిచిపోయాయి… ఆ కేసు అటకెక్కిపోయింది… కానీ ఈ రేటింగ్స్ మాత్రం మళ్లీ స్టార్ట్ కాలేదు… పోనీ, లోపరహితంగా రీడింగుల్ని అంచనా వేసి, కాస్త శాస్త్రీయంగా క్రోడీకరించే పనేమైనా చేసిందా ఈమధ్యలో..? అదీ లేదు… న్యూస్ చానెళ్ల రేటింగ్స్ ఆపేశారు కానీ… ఎంటర్‌టైన్‌మెంట్ చానెళ్ల మీద కూడా అవే ఆరోపణలున్నయ్ కదా… మరి ఆ రేటింగ్స్ ఎందుకు అలాగే కొనసాగించారు..?
ఇప్పుడు తాజాగా ప్రభుత్వం బార్క్‌ను ఏమని ఆదేశించిందంటే..? వెంటనే న్యూస్ చానెళ్ల రేటింగ్స్ స్టార్ట్ చేయండి, వారం వారం గాకుండా నెలకోసారి రేటింగ్స్ పబ్లిష్ చేయండి, రిగ్గింగ్ చాన్స్ లేకుండా నెలకోసారి రోలింగ్ యావరేజీ తీయండి అని చెప్పింది… మరి అప్పటికీ ఇప్పటికీ ఏం సంస్కరించినట్టు..? ఇన్నాళ్లూ ఆపీ ఆపీ ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు స్టార్ట్ చేస్తున్నట్టు..? ఒకవైపు వినోద చానెళ్ల రేటింగ్స్‌నే మార్చేయాలి బాబోయ్ అని డిమాండ్లు వస్తుంటే, అవేమీ పట్టకుండా… మళ్లీ అదే లోపభూయిష్ట విధానాన్ని న్యూస్ చానెళ్లకు మళ్లీ స్టార్ట్ చేస్తున్నారెందుకు..?
Ads
నిజానికి ఈ దిక్కుమాలిన పాత, అశాస్త్రీయ మీటర్ రీడింగ్ పద్ధతికన్నా… సెట్ టాప్ బాక్సుల నుంచే ఆర్పీడీ (రిటర్న్ పాథ్ డేటా) ఆధారంగా శాస్త్రీయంగా ప్రేక్షకుల సంఖ్యను లెక్కించవచ్చునని నిపుణులు ఎందరో, ఎప్పట్నుంచో చెబుతున్నారు… ఓటీటీ సంస్థలు తమ వీక్షకుల సంఖ్యను పక్కాగా శాస్త్రీయ పద్ధతిలో అంచనా వేస్తున్నయ్… అక్యురసీ డేటా… అది టీవీ రేటింగులకు ఎందుకు సాధ్యం కాదు..? అవుతుంది… కానీ చేయడం లేదు…
ఇప్పుడు తాజాగా ఓ జాయింట్ వర్కింగ్ గ్రూపు వేశారు… ఇది శాస్త్రీయ రేటింగ్స్ మీద కసరత్తు చేసి, నాలుగు నెలల్లో రిపోర్ట్ ఇవ్వాలట… మరి ఇన్నాళ్లూ ఏం చేసినట్టు..? నిజానికి న్యూస్ చానెళ్ల రేటింగ్ దందా బయటికొచ్చినప్పుడే ప్రసారభారతి సీఈవో నేతృత్వంలో ఓ కమిటీని వేశారు… అది రిపోర్ట్ ఇచ్చి ఏడాది దాటింది… అప్పటి నుంచీ చడీచప్పుడూ లేదు… ‘‘ట్రాయ్ చెప్పినట్టుగా రేటింగ్ ప్రోటోకాల్స్, ప్రాసెస్ మార్పుల మీద బార్క్ దృష్టి పెట్టింది కాబట్టి ఇక రేటింగ్స్ స్టార్ట్ చేయొచ్చు’’ అంటోంది ప్రభుత్వం… అబ్బ ఛా… అలాగే బార్క్ బోర్డును పునర్వ్యస్థీకరిస్తారట, ఇండస్ట్రీ వాళ్లే గాకుండా స్వతంత్ర సభ్యులనూ వేస్తారట… ఇప్పుడు వెంటనే రేటింగ్స్ స్టార్ట్ చేయడంతోపాటు పాత 4 నెలల ట్రెండ్ కూడా పబ్లిష్ చేయంటోంది ప్రభుత్వం…
ఇప్పుడు వేసే జాయింట్ వర్కింగ్ గ్రూపులో ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతినిధులతోపాటు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, బార్క్, డీటీహెచ్ అసోసియేషన్, డిజిటల్ కేబుల్ ఫెడరేషన్ ప్రతినిధులు కూడా ఉంటారట… ఇది రకరకాల అంతర్జాతీయ మెథడ్స్ కూడా పరిశీలించి తమ రిపోర్ట్ ఇస్తుందట… అది సరేనండీ మహాశయా… ఇన్నిరోజులూ ఏం చేశారు..? వినోద చానెళ్ల రేటింగ్స్ ఏ రిగ్గింగూ లేకుండా, శుద్ధపూస పద్ధతిలో కొనసాగుతున్నాయా ఏం..? అసలు ఈ రేటింగ్స్ దందా ఆగడానికి ఇప్పటిదాకా తీసుకున్న నిర్ణయాత్మక చర్యలేమున్నయ్..? ఏమీలేవు… ఉంటే గింటే ప్రస్తుత జాయింట్ వర్కింగ్ గ్రూపు ఏమైనా రికమెండ్ చేస్తే, ప్రభుత్వం అమలు చేస్తే, పెద్ద ప్లేయర్లు అమలు చేయనిస్తే…!!
Share this Article