Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెలుగు వెండితెర తండ్రి… ఆనంద చక్రపాణి… A Tearful Success Story

August 18, 2023 by M S R

తెలుగు వెండితెర తండ్రి

ఆనంద చక్రపాణి
A Tearful Success Story
……………………………………

అది 1989.

చింతపల్లి – నాగార్జునసాగర్ రోడ్డులో

Ads

పాడుబడిన ఒక పాత దొరల గడీ.

అప్పటికే జాతీయ అవార్డు పొందిన హీరోయిన్ అర్చన ఒక గోడకి దగ్గరగా నిలుచుని వుంది.

ఆమె రెండు చేతులూ పట్టుకుని, పైకెత్తి గోడకి అదుముతూ, అర్చన మీద దౌర్జన్యం చేయాలి చక్రపాణి. అది దాసి సినిమా షూటింగ్ లోకేషన్. చక్రపాణికి తొలి సినిమా. అర్చన రెండు చేతులూ పట్టుకున్నాడు. చక్రపాణి చేతులు గడగడ వణుకుతున్నాయి. అదేమిటి? అని అడిగింది.

“నాకు కొత్త. భయంగా ఉంది” అన్నాడు. ఇది కేవలం సినిమా షూటింగేరా పిచ్చివాడా అన్నట్టు, ఆమె, అందంగా నవ్వి, “ఫర్లేదు” అనింది. దర్శకుడు బి నర్సింగరావు “యాక్షన్” అన్నాడు. షాట్ బ్యూటిఫుల్గా వచ్చింది. ఆ సంవత్సరం దాసికి ఏకంగా 5 నేషనల్ అవార్డులు వచ్చాయి. ఈ చిన్న పాత్ర కోసం చక్రపాణిని బి నరసింగరావు కి పరిచయం చేసినవాడు కవి దేవీప్రియ.

అంతే! తొలి సినిమా తరువాత ఒక్క

అవకాశమూ రాలేదు. ఎవరూ పిలిచి

పాత్ర ఇచ్చిన పాపాన పోలేదు.

29 సుదీర్ఘ సంవత్సరాల తర్వాత ….

మిత్రుడు, ఆర్టిస్టు యేలే లక్ష్మణ్ ఫోన్ చేశాడు.

ఒక సినిమా ఉంది. తండ్రి పాత్ర. రమ్మన్నాడు. నిరుత్సాహంగానే వెళ్ళాడు చక్రపాణి. ఆడిషన్…. నటించాడు. డైలాగు చెప్పాడు. దర్శకుడు పెదవి విరిచాడు. చక్రపాణి ఫెయిల్ అవ్వడం కాదు, అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. వాళ్ళు పొమ్మన్నారు.

పట్టుదల పెరిగింది చక్రపాణికి. “ఒక్క అవకాశం ఇవ్వండి. నేను ప్రిపేర్ అయి వస్తాను. ఆ పాత్ర ఇవ్వకపోయినా పర్లేదు. నా పెర్ఫార్మన్స్ చూడండి” అని ప్రాధేయపడ్డాడు. “సరే తగలడు” అన్నాడు దర్శకుడు.

తెగించి వెళ్లిన చక్రపాణి కెమెరా ముందు విజృంభించాడు. నటనతో, డైలాగులతో ఒక విషాద సన్నివేశాన్ని పండించాడు. వాళ్లు ఆశ్చర్యపోయారు. "అదరగొట్టావ్ గా… ఆ పాత్ర నీకే" అన్నారు. అది "మల్లేశం" సినిమా. తండ్రి నరసింహులు పాత్ర. ఆ చిన్న బడ్జెట్ సినిమాలో పెద్ద పేరొచ్చింది చక్రపాణికి. దర్శకుడు రాజ్ రాచకొండ ఇచ్చిన గొప్ప అవకాశం అది. చేనేత పని చేసే ఆడవాళ్ళకి క్రమంగా

భుజపుటెముకలు అరిగిపోతాయి. వాళ్ళు ఇక చేతులతో ఏ పని చేయలేరు. ఈ ప్రమాదం నుంచి వాళ్ళని కాపాడటం కోసం చింతకింది మల్లేశం అనే ఆయన “ఆసు” యంత్రం కనిపెట్టాడు. ఆ డిస్కవరీకి ఆయనకి పద్మశ్రీ వచ్చింది. సినిమాలో మల్లేశం తండ్రి పాత్ర వేశాడు చక్రపాణి. షూటింగ్ కి వచ్చిన మల్లేశం.. చక్రపాణి అభినయం చూసి కరిగినీరైపోయాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. చక్రపాణిని కావలించుకుని “ఏడిపించారు. నాయన కన్పించిండు సర్” అన్నాడు.

చిర నిరీక్షణ తర్వాత వచ్చిన నర్సింహులు పాత్ర చక్రపాణికో టర్నింగ్ పాయింట్. కేరెక్టర్ ఆర్టిస్టుగా గౌరవమూ, గుర్తింపూ పొందాడు. మల్లేశం చూసి

వెండితెర మీద పద్మ శాలివాహన శకారంభం

అయినట్టే అన్నాను నేను .

ఇపుడు, టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రవితేజకి మేనమామగా నటించేదాకా ఎదిగాడు చక్రపాణి. దీనికిముందు అనగనగా ఓ అతిథిలో పాయల్ రాజ్ పుత్ కి తండ్రి. లవ్ స్టోరీలో సాయి పల్లవి తండ్రి. వరల్డ్ ఫేమస్ లవర్ లో ఓ ఫాదర్. నాందిలో హీరోయిన్ తండ్రి. వకీల్ సాబ్ లో ఒక హీరోయిన్ తండ్రి… ఇలా ఆనంద చక్రపాణి అనే నటుడు విషాదం పలికించే తండ్రి పాత్రలో మేటినటుడిగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. గ్లిజరిన్ లేకుండానే కెమెరా ముందు సహజంగా కన్నీళ్లు పెట్టగల నటునిగా పేరు తెచ్చుకున్నాడు. అదెలా సాధ్యం? అని

అడిగానోసారి చక్రపాణిని. “బతుకులో పడిన బాధలూ, వేదనా, కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.

నాకు ఈజీగా కన్నీళ్లు వస్తాయి” అన్నాడు.

*** *** ***

తెలంగాణలో మిర్యాలగూడకి 12 కిలోమీటర్ల దూరంలోని కొండ్రపోలు గ్రామం చక్రపాణిది. తండ్రి పుల్లయ్య తల్లి మల్లమ్మ పేద పద్మశాలీలు. చదువు లేని వాళ్ళు. పేదరికమూ, ఐదుగురు పిల్లలూ వాళ్ళ ఆస్తి. చిన్నవాడూ, చివరివాడూ చక్రపాణి. నానా కష్టాలూ పడి నల్గొండలో ఇంటర్ పూర్తి చేశాడు. బతకాలంటే హైదరాబాదే దిక్కు. వచ్చాడు. ఒక పనికిమాలిన ప్రెస్ లో దిక్కుమాలిన కంపోజిటర్ గా చేరాడు. కంప్యూటర్లు లేని కాలం అది. హ్యాండ్ కంపోజింగ్. అంటే, లెడ్ తో తయారై ఉండే ఒక్కో తెలుగు అక్షరాన్నీ కూర్చి , తెలుగు వాక్యాలుగా అమర్చాలి. అది చచ్చేంత శ్రమ. తిప్పలుపడి కాసిని డబ్బులు పోగేశాడు. ఆఫ్ సెట్ ప్రింటింగ్ అనేది ఖరీదైన మల్టీకలర్ వ్యాపారం. దానికి పేద ఆల్టర్నేటివ్ స్క్రీన్ ప్రింటింగ్. రెండు మూడు వేల రూపాయలతోనే కథ నడిపించవచ్చు. దానికి షిఫ్ట్ అయ్యాడు. అందులో నైపుణ్యమూర్తిగా నిలబడ్డాడు.

ఓసారి ఓ పెద్ద సంస్థ నుంచి భారీ స్క్రీన్ ప్రింటింగ్ ఆర్డర్ వచ్చింది. చేశాడు. “ఇంకా చాలా వర్క్ ఉంది. మా మేడమ్ ని కలవండి” అన్నారు. అలా సుగుణ ఆచార్య అనే తెలుగమ్మాయిని కలిశాడు చక్రపాణి. ఆమె వ్యక్తిత్వ వికాసం ట్రైనర్. హైక్లాస్ ఇంగ్లీష్… క్లాసులూ… కృష్ణా ఒబెరాయ్ హోటల్లో శిక్షణా తరగతులూ నడిచేవి. “నేనూ వాటిలో చేరొచ్చా” అని అడిగాడు. చక్రపాణి ఉత్సాహాన్ని చూసి ముచ్చటపడిన ఆవిడ “ఫీజు వద్దులే. ఫ్రీగా జాయిన్ అవ్వు” అనింది. పుస్తకాలు ఇచ్చి చదివించింది.

ఎలా మాట్లాడాలి? ఎలా బిహేవ్ చేయాలి? ఎలా బుట్టలో వేయాలి? లాంటి ట్రిక్కులన్నీ నేర్పించింది. చురుకైన చక్రపాణి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే దొంగ విద్యలో ఆరితేరి, కొన్ని రోజుల్లోనే ట్రైనర్ స్థాయికి ఎదిగాడు. “సుగుణమ్మ నన్ను తీర్చిదిద్దింది. నన్ను మనిషిని చేసింది” అంటాడు చక్రపాణి. ఆమె విశాఖ వెళిపోవడంతో హిమాయత్ నగర్ లో ఒక సొంత యాడ్ ఏజెన్సీ పెట్టుకున్నాడు. దాని పేరు ఫస్ట్ ఇంప్రెషన్. అభిరుచి ఉంది. డిజైనింగ్ తెలుసు. మాటలు నేర్చాడు. సక్సెస్ అనే దరిద్రం కార్లుగా, డబ్బుగా చక్రపాణి పాదాల దగ్గరకు వచ్చింది. పెళ్లి చేసుకున్నాడు. కానీ, కుదురుగా ఉండలేకపోయాడు. శ్రీశ్రీ ఏదో కవిత్వం గురించి అన్నాడు గానీ, అసలు తీరనిదాహం సినిమా కదా!

సినిమా తియ్యాలి. వేషం వెయ్యాలి. ఇరగదియ్యాలి… ఇలాంటి హైపిచ్చి ఊహల్తో కార్లు అరిగేలా తిరిగాడు. జనాల్ని కలిశాడు. “ఊబి” అనే లోబడ్జెట్ సినిమా తీసి, అందులోనే దిగబడిపోయాడు. రెండు మూడు పెద్ద అవకాశాలు వచ్చినట్టే వచ్చి, వెక్కిరించి వెళిపోయాయి.

మంచి కలలన్నీ కరిగి సాయంకాలపు మందు పార్టీలుగా మిగిలాయి.

కట్ చేస్తే, రచయిత పతంజలి, ఆర్టిస్ట్ మోహనూ, పాటల గోరటి వెంకన్నా, కవి మోహన్ రుషీ, ప్రకాష్ గాడూ, కవి సిద్ధార్థ, క్రిటిక్ తల్లావఝుల శివాజీ… వీళ్లు మిగిలారు… ప్రెస్ క్లబ్ లోనో… మోహన్ ఆఫీసులోనో!

తండ్రి చనిపోవడంతో తల్లి మల్లమ్మ హైదరాబాద్ వచ్చింది. భార్య, ఇద్దరు ఆడపిల్లలు, చదువులు, ఫీజులు… మిడిల్ క్లాస్ కథ మామూలే! అప్స్ అండ్ డౌన్స్. అప్పులూ, కష్టాలూ అని! ఇవన్నీ పక్కన పెడితే, చక్రపాణిది ఆకట్టుకునే అందం. యాతడు కురద్రూపి. అనగా కుర్రవాడూ, అందగాడూ అని నా దురుద్దేశం! మెరిసే మేనిఛాయ, ఆడపిల్ల కోరుకునే డ్రీమ్ బాయ్. అసలు నవ్వకపోయినా బాగుంటాడు. నవ్వితే మరింత బావుంటాడు. పైగా, వైఫల్యం అనే దరిద్రం తెచ్చిన వినయం వల్ల అతను అందరికీ నచ్చుతాడు. చక్రపాణికి నూటికి 99 మార్కులు తెచ్చుకునే ఇద్దరు అమ్మాయిలు. టాప్ క్లాస్ బ్రిలియంట్ స్టూడెంట్స్ – నూతన, కీర్తన. వాళ్లని చూశాక, వీడికి విజయం రాసిపెట్టి వుందని నాకనిపించింది.

*** *** ***

పులి అంజయ్య పిలుపు.

తెలంగాణ అంటే ఎప్పుడో ఒకపుడు విప్లవం నీ ఇంటి తలుపు తడుతుంది. పీపుల్స్ వార్ అగ్ర నాయకుల్లో ఒకడుగా ఎదిగిన పులి అంజయ్య గౌడ్ ది చక్రపాణి వాళ్ళ ఊరే! కొండ్రపోలు. ఎదురింటి వాడే .’మామా’ అని పిలిచేవాడు చక్రపాణి. ‘ఏరా’ అనే వాడు అంజయ్య. వాళ్ళు బాగా సన్నిహితులు. పెద్దగా మాట్లాడకుండా, వినమ్రంగా, అమాయకంగా ఉండే ఒక గ్రామీణ అంజయ్య , పీపుల్స్ వార్ పులిగా మారిన ట్రాన్స్ఫర్మేషన్ని చక్రపాణి చెపుతుంటే వినాలి. చివరిసారి పులి అంజయ్య హిమాయత్ నగర్ లోని తన యాడ్ ఏజెన్సీకి వచ్చి ఎంతో ప్రేమగా మాట్లాడాడనీ, ప్రజల కోసమే బతికాడనీ జీరబోతున్న గొంతుతో, కన్నీళ్ళతో చెబుతాడు చక్రపాణి. ఆ వీరుడి ఇన్ఫ్లుయెన్స్ తో తుపాకీ పట్టుకొని, అడవుల్లోకి వెళిపోవాలి అనుకున్న చక్రపాణి, ఒక చిన్న సంఘటన వల్ల ఆ ప్రయత్నం మానుకున్నాడు. పులి అంజయ్యనీ, ఆయన భార్య శోభక్కనీ బెంగళూరులో అరెస్ట్ చేసి, పట్టుకొచ్చి, చిత్రహింసలు పెట్టి పోలీసులు చంపారని, దానికి ఎన్కౌంటర్ అని పేరు పెట్టారనీ మా జర్నలిస్టులు అందరికీ తెలుసు.

*** *** ***

‘ఎల్లమ్మ’ సినిమా తీసిన మోహన్ కోడా జీనియస్. గౌతమ్ ఘోష్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసేవాడు. మోహన్ కోడా అంటే నాకు ఒక మానసిక ధైర్యం. ఆయన్ని ఎప్పటికీ మరిచిపోలేను అంటాడు చక్రపాణి.

ఎన్ని ఇబ్బందులున్నా అమ్మ మల్లమ్మని 35 ఏళ్ల పాటు శ్రద్ధగా, కంటికి రెప్పలా కాపాడుకున్నాడు

ఆమె చివరి క్షణాల దాకా.

దారుణమైన స్ట్రగుల్, ఒక అవకాశం, చిన్న గెలుపు, మళ్లీ నిరాశ, పోరాటం… ఊపిరి సలపని రోజులు ఉక్కిరిబిక్కిరి చేసినా, కలలు కకావికలైనా తెగించి నిలబడ్డాడు. చివరికి సాధించాడు చక్రపాణి.

ప్రస్తుతం ‘శాంతల’ అనే సినిమాలో తండ్రి పాత్ర. డెవిల్ అనే కళ్యాణ్ రామ్ సినిమాలో ఒక మంచి పాత్ర. పద్మావతి మల్లాది డైరెక్ట్ చేస్తున్న ‘గాంధీ తాత చెట్టు’ అనే ఫిల్ములో లీడ్ రోల్ తాతగా, జీవో-111 లో ప్రధాన పాత్ర రైతుగా నటిస్తున్నాడు చక్రపాణి. జీవో-111కి సంభాషణలు మోహన్ రుషి రాశారు. సొంత గొంతు, distinct style వున్న గొప్ప కవి మోహన్ రుషి. చక్రపాణి సొంత అన్న కొడుకు.

ఇంత జీవితాన్ని చూసినా, జీవఫలం చేదు విషం అని తెలిసినా, ఇంకా ఏదో సాధించాలని తపన పడుతుంటాడు చక్రపాణి. చక్రం తిరిగినా, గుర్రం ఎగిరినా , ఎక్కాల్సిన శిఖరం ఏదో ఒకటి మిగిలే వుందంటాడు అందమైన చంద్రవంక లాంటి నవ్వుతో.

“నా కూతురు కీర్తన సివిల్స్ కి ప్రిపేర్ అవుతోంది” అన్నాడొక గొప్ప రిలీఫ్ తో.

చాల్లే చక్రపాణీ, తెలంగాణలో ప్రతిభావంతుడైన కేరెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నావు. ఇంకా ఎన్ని సముద్రాలని ఈదగలవ్! ఈ దయలేని, దాక్షిణ్యం లేని, డబ్బు తప్ప మరో ధ్యాస లేని సినిమా ఫీల్డ్ గురించి నీకు మేం చెప్పాలా?

మోహన్, మీరూ, నేనూ , శివాజీ గడిపిన సాయంకాలాల్నీ, ఎంజాయ్ చేసిన క్షణాలనీ,

30 ఏళ్లు దాటిన స్నేహాన్నీ తలుచుకుంటూ –

ఆగస్టు 18 – స్నేహితుడా పుట్టినరోజు శుభాకాంక్షలు! – TAADI PRAKASH   97045 41559

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!
  • నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో… ఇదో వింత కథ…
  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions