ఆమధ్య హీరోయిన్ కావాలంటే తమిళ, మలయాళ ఇండస్ట్రీ వైపు చూసేవాళ్లు… నటన తెలుసు, కష్టపడతారు, కమిటెడ్‌గా వర్క్ చేస్తారు, అందంగా ఉంటారు… ఇండస్ట్రీ పట్ల హంబుల్‌నెస్ కనిపిస్తుంది… తరువాత ఏమైంది..? కన్నడ కస్తూరి తెలుగు తెరను ఆవరించేసింది… అసలు బుల్లితెర హీరోయిన్లందరూ వాళ్లే… నిజానికి వాళ్లు కూడా బాగా చేస్తున్నారు… వెండితెరకూ వాళ్లే కనిపిస్తున్నారు… రష్మిక ఇప్పుడు ఎంత టాపో తెలుసు కదా… తాజాగా రచిత రామ్… చిరంజీవి అల్లుడు ‘విజేత’ సినిమా తరువాత తాజాగా సూపర్ మచ్చి అనే సినిమాలో నటించాడు, అదిప్పుడు రిలీజైంది…
ఇందులో రచిత హీరోయిన్… సినిమా అంతా అయిపోయాక ఆ మొహమే పదే పదే యాదికొస్తుంది… అందమైన మొహమని కాదు, ఆ పాత్రలో దూరిపోయింది… నిజానికి ఆ పాత్ర చిత్రణ పెద్దగా బాగాలేదు, కానీ ఆ పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకుని, తన నటనతో కాస్త పాత్రను పైకి లేపింది ఆమె… ష్, పలుచోట్ల కల్యాణ్‌దేవ్ నటనలో తేలిపోయాడు నిజానికి… ఇంకా చాలా మెరుగుపడాలి తను… చాలాదూరం ప్రయాణించాలి తను… కానీ రచిత ఇరగేసింది… అసలు ఎవరీమె..?
బెంగుళూరు… మొదట్లో టీవీ సీరియళ్లు చేసేది… చెల్లెలు నిత్యా రామ్ కూడా నటే… రచిత ఓసారి ఏదో సినిమాకు సంబంధించి చాలా బోల్డ్‌గా నటిస్తే, అదే అడిగితే… పెళ్లయ్యాక రొమాన్స్ ఉండదా..? ఇంటిమేట్ సీన్లు ఉండవా..? అని ఎదురుప్రశ్నించింది రిపోర్టర్లను… వాళ్లు బాగానే ఉన్నారు, కన్నడ ఫిల్మ్ ఛాంబర్ పెద్దాయన ఒకరికి కోపమొచ్చింది… ఆమె మీద బ్యాన్ పెట్టాలి, సంప్రదాయ విరోధి అంటూ ఏదేదో ఎగిరాడు… కానీ ఎవరూ పట్టించుకోలేదు… ఆమె టాప్ పెయిడ్ హీరోయిన్ ఇప్పుడు… దటీజ్ రచిత… ప్రస్తుతం శాండల్‌వుడ్ టాక్ ప్రకారం ఆమె చేతిలో దాదాపు డజన్‌కు పైగా సినిమాలు ఉన్నయ్… (ఈ సినిమాకు మొదట్లో రియా చక్రవర్తిని తీసుకున్నారు, ఆమె కూడా బెంగుళూరు బేస్డ్ నటి… రచితలాగే టీవీ నుంచి సినిమాల్లోకి ఎమర్జైన నటి… కానీ ఏమైందో కాస్త షూటింగ్ అయ్యాక కూడా ఆమెను వదిలేసి, రచితను తీసుకున్నారు…)
Ads
నిజానికి ఈ సూపర్ మచ్చి సినిమా కథే ఓ పెద్ద గందరగోళం… హీరోయిన్ తెలియనివాడిని ఎవరినో ప్రేమిస్తుంది, హీరో తనకు తెలియని స్త్రీని ప్రేమిస్తాడు… మళ్లీ హీరోయిన్ జులాయిగా తిరిగే హీరో వెంటపడుతుంది… వదిలించుకోవడానికి ఓ రాత్రి పడుకో, ప్రేమిస్తా అంటాడు హీరో… హబ్బ, ఏం కేరక్టరైజేషన్‌రా తండ్రీ…? దానికీ ఆమె రెడీ అంటుంది… ఎందుకలా..? అదే కథ… తండ్రి కోరిక, మన్నూమశానం అని ఏదో సమర్థన, బిల్డప్ ట్రై చేశాడు దర్శకుడు గానీ… ప్రేక్షకుడికి సరిగ్గా ఎక్కదు అది, కనెక్ట్ కాదు…
పైగా ఇలాంటి సినిమాలకు సంగీతం బాగుండాలి, సీన్లలో ఫ్రెష్‌నెస్ ఉండాలి… థమన్ ఈమధ్య బాగా పాపులర్ సంగీత దర్శకుడు కావచ్చుగాక, కానీ ఈ సినిమాలో మరీ నాసిరకం పర్‌ఫామెన్స్… కాపీ కొట్టడానికీ సమయానికి ఏదీ దొరకనట్టుంది… ఒక కొత్తతరహా కథ రాసుకుంటే, దాన్ని అంత సక్సెస్‌ఫుల్‌గా జనానికి ఎక్కించగలిగితేనే బొమ్మ హిట్… ఇదుగో ఇక్కడ దర్శకుడు తడబడ్డాడు… కాకపోతే ఈ సినిమాకు సంబంధించి మరో ప్లస్ పాయింట్ ఏమిటంటే… సినిమాలో అశ్లీలాన్ని, అసభ్యతను నమ్ముకోలేదు దర్శకుడు… తను అనుకున్న కథను చెప్పడానికి ప్రయత్నించాడు తప్ప అడ్డదోవలు తొక్కలేదు… పర్లేదు, ఓటీటీలో వస్తుందిగా, టీవీలో వస్తుందిగా చూద్దాం… పోనీ, రచిత కోసమే అనుకొండి…!!
Share this Article