Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెలుగుదేశం పార్టీ పదవులపై కేడర్‌లో కుతకుత… ఎందుకు..?

April 25, 2026 by M S R

.

తెలుగుదేశం పార్టీ కమిటీల్ని ప్రకటించారు కదా… బాబు మీడియా ఎలాగూ సరైన విశ్లేషణలకు వెళ్లదు, సాక్షికి అస్సలు పట్టదు, అవసరం లేదు… మరి నిష్పాక్షిక సమీక్ష, జర్నలిస్టు కోణంలో విశ్లేషణ ఏది..? జమీన్ రైతు పత్రికలో కనిపించింది… తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వ నిర్ణయాల్లో లోకేష్, తన టీమ్ ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తోందనేది సారాంశం… అయితే పార్టీ పదవుల ఎంపికలో కొలమానాలు, ప్రామాణికాలు, అర్హతలు ఏమిటనేదే ప్రశ్న… పార్టీ చంద్రబాబు చేతుల్లో నుంచి వారసుడి చేతుల్లోకి ఆల్రెడీ వెళ్లిపోయిందని ఈ సమీక్ష సారాంశం… కొన్ని ముఖ్యాంశాలు ఇలా…

తెలుగుదేశం పార్టీ కార్యవర్గాలకు ఒక గౌరవం, స్థాయి వుంటాయి. పార్టీ పట్ల విధేయత ఒక్కటే కాకుండా, సమర్ధత ప్రాతిపదికన పదవులు ఇస్తుంటాడు చంద్రబాబు. ప్రతి ఎంపిక వెనుక పెద్ద కసరత్తు వుంటుంది. చర్చలు, సలహాలు, లెక్కలు వుంటాయి. కానీ ఈసారి ఏర్పడిన నూతన తెలుగుదేశం పార్టీ జాతీయ, రాష్ట్ర కార్యవర్గాలలో ఆ సంప్రదాయం కనుమరుగై పోయింది.

Ads

పార్టీపరంగా కనీసపాటి సలహా సంప్రదింపులు లేకుండా, ఆ మూల సౌధంలోని మూడవ అంతస్తులో అన్నీ జరిగిపోయాయి. పార్టీ విధేయత, విశ్వాసం, సమర్ధత, కష్టాలలో కనిపెట్టుకొని వుండడం, జిల్లాలలో పార్టీని సజీవంగా వుంచగలగడం, ప్రత్యర్ధి పార్టీల విమర్శలను ధీటుగా తిప్పికొట్టడం వంటి అర్హతలేవీ పరిగణనలోకి రాలేదు.

యువగళంలో పోషించిన పాత్ర, లోకేష్ పాదయాత్రలో నడిచిన దూరం, పార్టీ నిధుల సమీకరణలో శక్తి సామర్ధ్యాలు వంటివి పరిగణనలోకి వచ్చాయి. పార్టీలో ప్రవేశించిన నూతన తరం వ్యక్తులు ఈ ఎంపికలలో కీలక భూమిక పోషించారని చెప్తున్నారు. కిలారి రాజేష్, భాష్యం ప్రవీణ్, కేశినేని చిన్ని, సానా సతీష్ వంటి కొత్త పిట్టల విన్యాసాలు అధికంగా కనిపించాయి. వారి కొలమానాలు వేరైపోయాయి. ధనమూలం ఇదం రాజకీయం అన్న సూత్రాన్ని బలంగా విశ్వసించినట్లు కనిపిస్తున్నది.

ఈ పరిణామం తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా ఒక అగ్నిపర్వతం వలె కుత కుతలాడుతున్నది. ఇప్పటికిప్పుడు ఏ ఒక్కరు కూడా పార్టీ పట్ల అసంతృప్తి లేదా అక్కసు వ్యక్తం చేసే స్థితిలో లేరు. ఇంకా మూడేళ్ల పాటు ప్రభుత్వం నడవాలి కాబట్టి, ఇప్పుడు నోరు జారి లేనిపోని సమస్యలు కొనితెచ్చుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు.

వైకాపా నుంచి వలస వచ్చిన వారిలో అత్యధికులకు పెద్ద పీట వేశారు. పెద్ద పెద్ద పదవులు ఇచ్చారు. వీరి ప్రధాన అర్హత, ఎన్నికల సమయంలో ఎంత ఖర్చయినా పెట్టుకోగల శక్తి. అయితే గాలిలో ఏ మాత్రం మార్పు కనిపించినా, వీరిలో ముప్పాతిక భాగం మంది ఎన్నికల సమయానికి గోడ దూకేయడం ఖాయం అన్నది నిజం.

మరొక పక్క, లోకేష్ బృందం పేరుతో చాలామంది అనర్హులకు అగ్రతాంబూలం లభించింది. పక్క ఇంటి వాడికి కూడా పేరు తెలియని అనామకులు నేరుగా పొలిట్‌బ్యూరో సభ్యులుగా ఎదిగిపోయారు. రాజకీయంగా ఓనమాలు తెలియని వారు పొలిట్ బ్యూరో వంటి సర్వోన్నత విధాన నిర్ణాయక సమావేశాలలో ఎటువంటి పాత్ర పోషిస్తారో ఊహించుకోవచ్చు.

కిలారి రాజేష్‌కు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్ ఇవ్వడాన్ని జాతీయ పత్రికలు, మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచారం చేశాయి. కిలారి రాజేష్, లోకేష్‌కు అత్యంత సన్నిహిత స్నేహితుడు. పార్టీలో ఎప్పుడూ తెర ముందుకు రాలేదు కానీ, తెరవెనుక కథ మొత్తం నడిపేది ఆయనే. ఎంత కొమ్ములు తిరిగిన ధీరుడైనా, పార్టీలో ప్రభుత్వంలో పని కావాలంటే కిలారి రాజేష్‌ను కలిస్తేనే సాధ్యం. ముఖ్యమంత్రి కూడా చేయలేని పనులు కిలారి రాజేష్ క్షణాలలో చక్కబెట్టగలడనే ప్రచారం వుంది. కానీ ఆయనెప్పుడూ ప్రజలలోకి రాడు. కనీసం పత్రికల వారికి కూడా ముఖం చూపించడు. ప్రభుత్వంలో నిధుల సమీకరణ సమస్తం ఆయన నాయకత్వంలోనే నడుస్తుందని చెప్తారు. ఏ డీల్ అయినా, రాజముద్ర పడేది అక్కడే. తనకు అంత విశ్వాసంగా సేవ చేస్తున్నాడనే అభిమానంతో కిలారి రాజేష్‌కు పెద్ద పీట వేసాడు లోకేష్.

తెలుగుదేశం పార్టీలో నూతన రాజకీయ పోకడలు ఎట్లా వుండబోతున్నాయో తెలుసుకోవడానికి ఇదొక సంకేతం. అయితే, చంద్రబాబును కలవడం సులభం కానీ, కిలారి రాజేష్‌ను కలవడం మాత్రం చాలా కష్టం. మహామహులు కూడా మూడవ అంతస్తుకు అనుమతి లేక, రిసెప్షన్ దగ్గరే నిట్టూర్పులు విడుస్తూ వెనుదిరగడం చాలా సాధారణ విషయం. అందుకు కొన్ని అర్హతలుంటాయి. బరువును బట్టి తూకం. భవిష్యత్తులో తెలుగుదేశంలో పైకి ఎదగాలనుకునే నేతలు, కార్యకర్తలు ఈ సూక్ష్మాన్ని గ్రహించగలిగితేనే, ఉనికి.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తెలుగుదేశం పార్టీ పదవులపై కేడర్‌లో కుతకుత… ఎందుకు..?
  • ఆప్ నుంచి బీజేపీకి షిఫ్ట్… అసలు గేమ్ ఏమిటి..?
  • చిన్న దూరాలకు ‘వందే’ భారత్ బెటర్… ఎందుకొచ్చిన ఫ్లయిట్ జర్నీలు…
  • ఓ ముసలి కేసు… ఇందులో న్యాయం లేదు, ఘనత అస్సలు లేదు…
  • RTC సమ్మె..! KCR అమానుషానికీ నేటి మానవీయతకూ ఎంత తేడా..?!
  • ఇప్పుడు ఈ బూతుల ‘షో అంత అవసరమా మిస్టర్ నాగబాబూ..?!
  • …. ఐనా మనిషి మారలేదు, ఆతని కాంక్ష తీరలేదు… అతనే ‘కింగ్ కోహ్లీ’…
  • వోటుకునోటు కేసు… మరో మహారాష్ట్ర కేసుతో లంకె… న్యాయ సంక్లిష్టత…
  • నోటికొచ్చింది పేలితే ఇకపై కుదరదు… పవన్ ఖేరా కేసే ఉదాహరణ…
  • ఏపీ పాలిటిక్స్..! చివరకు ‘హానీ ట్రాప్’ చీకట్లు… బ్లాక్ మెయిల్ దందాలు…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions