అదసలే తమిళనాడు… నాస్తికత్వం, హేతువాదం గట్రా పార్టీల సిద్ధాంతాల్లో ఉంటాయి గొప్పగా… ఆస్తికత్వం, భక్తితత్వానికీ కొరతేమీ లేదు… ఎటొచ్చీ కొందరు మూర్ఖభక్తులుంటారు… దరిద్రులు… సినిమా తారలకు, హీరోలకు, రాజకీయ నాయకులకు గుళ్లు కట్టి పూజిస్తుంటారు దేవతలుగా…
అదంతే… ఒకవైపు తెలివైన సమాజం, అదేసమయంలో మరోవైపు పూర్తి భిన్నమైన మూర్ఖ సమూహం… దేవుళ్లు, దేవతలు జాన్తానై కానీ… జయలలిత దూరంగా వెహికిల్‌లో వెళ్తుంటే ఉన్నచోటే సాష్టాంగ ప్రణామాలు చేసేంత పైత్యమూ అక్కడే… తాజాగా ఓ వీరభక్గుడు ఏకంగా ఓ గ్రహాంతరవాసి విగ్రహం చేయించి, ప్రతిష్ఠించాడు…
ఇదేమిట్రాా… దేవుడు కాదు, హీరో కాదు, నాయకుడు కాదు… వీడెవడు, సారీ, ఇదెవత్తి అనడిగితే… గ్రహాంతర దేవుడు, ప్రకృతి విపత్తుల నుంచి రక్షిస్తాడు అంటున్నాడు… సేలం దగ్గర మల్లమూపంబత్తికి చెందిన లోగనాథన్ అలియాస్ లోకనాథన్ తన పేరు… ముప్పావు ఎకరంలో కట్టిన గుడిలో ఎందుకైనా మంచిదని శివపార్వతులు, కాళి, మురుగన్ విగ్రహాలు కూడా పెట్టాడు…
Ads
తనలాంటోళ్లకూ కొరత లేని సమాజం కదా… మస్తు మంది జనాలు వచ్చి పొర్లుదండాలు పెట్టి పూజించుకుంటున్నారు… అసలు ఈ ఆలోచన వచ్చిందోయ్ అనడిగితే… నాతో ఏలియెన్స్ మాట్లాడారు, వాళ్ల పర్మిషన్ తీసుకున్నాకే గుడి కట్టాను, వాళ్ల నుంచి వచ్చే రేడియేషన్ నుంచి రక్షణకు అరటాకులు చుట్టుకోవాలంటున్నాడు… దేవుడా… ఇదేం వైకల్యమో…
ఇక అసలు విషయానికి వద్దాం… ఈ గుళ్లో కనిపిస్తున్న విగ్రహం రూపు నిజానికి సినిమా దర్శకుల సృష్టి… తమ కథలకు అనుగుణంగా మనిషి రూపం వచ్చేలా సాగిన సృజన… ఒక ఫాంటసీ… నిజానికి ఈ అనంత విశ్వంలో భూమి మినహా మరే గ్రహంలోనూ జీవం ఉనికే లేదు… కనిపించలేదు… పోనీ, మన దృష్టికి, మన నిర్ధారణకు రాలేదు…
పోనీ, వాళ్లు ఉన్నారే అనుకుందాం… ఇలాగే ఉండాలనేమీ లేదు… ఈ భూమి పరిస్థితులకు అనుగుణంగా… అంటే ఇక్కడి వాతావరణ పరిస్థితులు, తన మనుగడ కోసం జరిపే పోరాటంలో ఆ రూపు, ఆ అవయవాలను జీవం సంతరించుకుంది… పైగా జీవం ఇక్కడ ఓ లక్ష రకాల జాతులుగా వర్ధిల్లుతోంది… మనిషి జాతి, రూపం అందులో ఒకటి… అంతేతప్ప వేరే గ్రహంలో జీవం ఉన్నా సరే ఇలాంటి రూపంతోనే ఉండాలని అనుకుంటే, దానికి వంద కోట్లలో ఒకటి శాతం సంభావ్యత కూడా ఉండదు…
ఏదో గ్రహంలో ఉండే భౌగోళిక ప్రతికూల, అనుకూల వాతావరణాల్లో మనలాగే కళ్లు చెవులు నోరు కాళ్లు చేతులు ఉండాలనేది మన ఊహ మన కోరిక తప్ప… అలా ఉండటం అనేది సింపుల్‌గా అసాధ్యం శాస్త్రీయ కోణంలో… ఐతేనేం, అవన్నీ జాన్తా నై… మా భక్తి మా ఇష్టం అంటాడేమో ఈ లోకనాథుడు… అంతేలెండి… అదసలే తమిళనాడు…! అనేక పైత్యాలకు అడ్డా మరి..!! అఫ్‌కోర్స్, ఇతర రాష్ట్రాల్లోనూ తక్కువేమీ కాదు… అసలు దేవుడనేవాడే లేడు అని చెబితే, ఆహా ఏం చెప్పాడో కదా, తనే దేవుడు అని విగ్రహాలు కట్టి పూజించే సమాజం మనది..!!
Share this Article