.
[[ హరగోపాలరాజు వునికిలి ]] ……. “దేశ భాషలందు తెలుగు లెస్స” అని చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు వందల ఏళ్ల క్రితం చెప్పాడు. తెలుగు వాడు కానప్పటికి తెలుగులో కావ్యం రాశాడు.. ఇటలీ కి చెందిన ఓ పరీశోధకుడు ద్రవిడ భాష అయిన తెలుగు అక్షర సౌందర్యం, నుడికారం, తలకట్టు, ఉచ్చారణ చూసి “ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్” అని పొగిడాడు.
కానీ ఇప్పుడు తెలుగు లెస్సు (తక్కువ) అని అనుకోవాల్సిన రోజులు వచ్చాయి. పైత్యకారులు పెరిగి, పెడధోరణులు ప్రబలి భాషను ఇది తెలుగేనా అనేలా చేస్తున్నారు.. ఇప్పటి తరానికి ఇదే తెలుగు అనే భ్రమలు కల్పిస్తున్నారు. తెలుగు అంటే ఈ మహాశయులకు ఎంత అభిమానమో అని కొంతమందిని చూస్తే, కొన్ని రాతలను చదివితే మనసు ‘పులకేసిం’చి పోతుంది.
Ads
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిసరాల్లో రాష్ట్ర ప్రధాన కార్యాలయాలన్నీ కొలువు దీరాయి కదా. అందులో బోర్డులు చిత్రంగా కనిపిస్తున్నాయి. “వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన అధినేత వారి
కార్యాలయం” అని ఉంది. రాజకీయ పార్టీల ప్రచార తెరలు చూసి అధినేత పదం బాగా వంటబట్టినట్టుంది. ఇంగ్లిషులోనేమో “ office of the commissioner of commercial taxes” అని ఉంది.
మరో ప్రధాన కార్యాలయం “ప్రధాన మహాగణణాధికారి వారి (ఎ&ఇ) కార్యాలయం” అని రాసుకున్నారు. ఇంగ్లిషులోనేమో “ office of the accountant general (a&e)” అని ఉంది. అంటే ఏజి ఆఫీస్ అన్నమాట. ఖాతాలు, పద్దుల కార్యాలయం అంటే మీ లెక్కలకు ఏమీ తక్కువ కాదు కదా… పద్దులు, ఖాతాలు అంటే మీకు తెలియకపోవచ్చు గాని ప్రజలందరికీ తెలుసు. కనీసం బోర్డులు రాయించేటప్పుడు తెలుగు తెలిసిన వాళ్ళని సంప్రదిస్తే నామోషి అనుకున్నారేమో.
విజయవాడ ఆర్టీసి బస్టాండ్ ప్రధాన ద్వారం వద్ద తాటికాయంత అక్షరాల్లో “పరిరక్షణ ద్వారం” అని ఉంటుంది. మరి ఎవరు, ఎవర్ని పరిరక్షిస్తారో వారికే ఎరుక. ఇక వ్యాపార, వాణిజ్య ప్రకటనలు, ప్రచారాలు అయితే చెప్పలేం. ఎందుకంటే వాళ్ళ ఇష్టం.
ఈ మధ్యన ఓ బట్టల షాపు పెద్ద ప్రచార బోర్డులో ఇలా రాశారు. “aashdapu anamdaala shopping ku imtillipadi randi” దీన్నే “తెలుగులో ఆషాడపు షాపింగ్ కు ఇంటిల్లిపాది రండి’ అని రాసుకోవచ్చు కదా. దీన్ని ప్రయోగం అనుకోవాలా పైత్యం అనాలా…
బహుళజాతి కంపెనీ, అదేనండీ రకరకాల రొట్టెల్ని, దుంపల్ని మన చేత డబుల్ డబుల్ ధరలకు కొనిపించే మెక్ డి దుకాణాల ముందు “PEDDA TIINANTA CRUNCH” అంట. ఈ సంకర భాష ఏమిటో వాడికే తెలియాలి. జడ్ జనరేషన్ ను ఆకట్టుకోవడానికి అని అనుకోవడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే వాళ్ళకు ఇవన్నీ చదివే ఓపిక, తీరిక లేవు. ఏదో ప్రయోగాల పేరిట భాషను ఖూనీ చేయడమే.
రైల్వేలో వాడే తెలుగు అనువాదాలు ఎంత కృతకంగా ఉంటాయో అందరికి తెలిసిందే. నిరీక్షించడమైనది, చింతించడమైనది.. వంటివి.. ఇప్పుడిప్పుడే కొంత మెరుగవుతుందనుకుంటే.. విశాఖ రైల్వే స్టేషన్ లో ఒక చోట ఇలా రాసి ఉంది. “బేబీ దాన కేంద్రం” చదవగానే ఏమి అనిపిస్తుంది. “Baby feed center” కి వచ్చిన తిప్పలు ఇవి.
ఇంకా నయం “దాణా” రాయలేదు అని సంతోసించాలి.. ఆ రాసినవాణ్ని, రాయించినవాణ్ని బంగాళాఖాతంలో మూడు మునకలు వేయించాలని అనిపించడంలో తప్పు లేదు కదా. ఇదీ మన తెలుగు వారి హృదయ వైశాల్యానికి నిదర్శనం అనుకోవాలి.
భాష పట్ల మన తోలు మందానికి ఒక మచ్చగా చెప్పుకోవాలి. 72 ఏళ్ల వయసులో తెలుగు భాష దుర్గతి గురించి ఆందోళన చెందుతున్న డా. పెదవీర్రాజు లాంటి అభిమానుల ఆవేదనను అర్ధం చేసుకునే ప్రయత్నం చేయాలి.
ముప్పయి ఏళ్ల క్రితం పత్రికల్లో టెలిప్రింటర్ భాష అని ఒకటుండేది. అదే ఇప్పుడు గూగుల్ తెలుగు కీ బోర్డు అయిందనుకోండి. దాన్ని అలా రాసినా తప్పు లేదు. దానికి మన సొంత తెలివితేటలు ఉపయోగిస్తే వచ్చే తంటాలే ఇవి.
తెలుగు భాషాభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్లో రూ. 10 కోట్లు కేటాయించామని ప్రకటించారు. ఇలాంటి వాటికి డబ్బుతో పని లేదు. చిత్తశుద్ధి, కార్యాచరణ ఉంటే చాలు. ఇప్పుడు ఏది కావాలన్నా గూగులమ్మను వెదకడమే కదా పని.. అది ఏం చెబితే అదే వేదం…. పైగా నెట్ లో అలాగే ఉందని దబాయింపు .. దీనికి తోడు కించిత్తు ఆలోచన కూడా లేకుండా ఏఐ ని ఆశ్రయించడం. లేదంటే గ్రోక్ ని గోకుతామనడం… ఖర్మరా బాబూ…
Share this Article