ఒక వార్త ఆశ్చర్యానికి గురిచేసింది… ‘‘గుజరాత్‌లోని జామ్‌నగర్‌కి చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ గౌరవ్ గాంధీ హార్ట్ ఎటాక్‌తో కన్నుమూశాడు… నిజానికి హార్ట్ ఎటాక్స్ కామనే, కానీ ఈ 41 ఏళ్ల వయసున్న డాక్టర్ స్వయంగా కార్డియాలజిస్టు… గౌరవ్ గాంధీకి జామ్ నగర్‌లోని టాప్ కార్డియాలజిస్ట్‌గా పేరుంది… హృద్రోగంతో బాధపడుతున్న 16 వేల మందికిపైగా పేషెంట్లకు ఆయన శస్త్రచికిత్సలు చేశాడు… ఈయన ఎప్పటిలాగే సోమవారం రాత్రి పొద్దుపోయే వరకు పేషెంట్లను చూశాడు… రాత్రి సమయంలో ప్యాలెస్ రోడ్‌లోని తన ఇంటికి వెళ్లాడు… భోజనం చేశాక నిద్రకు ఉపక్రమించాడు…
అప్పటివరకు తను మామూలుగానే ఉన్నాడు… గుండెపోటుకు సంబంధించిన సూచనలేమీ లేవు… కానీ మరుసటి రోజు ఉదయం 6 గంటలకు కుటుంబ సభ్యులు ఆయన్ను నిద్రలేపేందుకు గదిలోకి వెళ్తే. ఆయన అచేతనంగా కనిపించాడు… వెంటనే హాస్పిటల్‌కు తరలించారు… సీపీఆర్ వంటి చర్యలతో ఆయన్ను బతికించం కోసం డాక్టర్లు రెండు గంటలపాటు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది…
జామ్‌నగర్‌లోనే ఎంబీబీఎస్ పూర్తి చేసిన గౌరవ్ గాంధీ.. అహ్మదాబాద్‌లో కార్డియాలజీలో స్పెషలైజేషన్ చేశాడు… ఆ తర్వాత తన సొంతూళ్లో డాక్టర్ సేవలు అందించడం మొదలుపెట్టాడు… ‘గుండెపోట్లను అరికడదాం’ అని ఫేస్‌బుక్‌లో చేస్తున్న ప్రచారంలో ఆయన భాగంగా ఉన్నాడు… 1982లో జన్మించిన డాక్టర్ గౌరవ్.. పని పట్ల అంకిత భావంతో ఉండేవాడు… 16 వేల యాంజియోగ్రఫీ, యాంజియోప్లాస్టీ హార్ట్ సర్జరీలు చేశాడంటేనే ఆయన పనితనాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆయన భార్య దేవాన్షి గాంధీ డెంటిస్ట్‌గా పని చేస్తోంది…’’
Ads
నిజానికి కార్డియాలజిస్టు అయినంత మాత్రాన గుండెపోటు రావద్దని ఏమీ లేదు… పైగా ఇటీవలి కాలంలో… ముఖ్యంగా కరోనా తర్వాతి కాలంలో గుండెపోటు మరణాలు పెరిగిపోయాయి. అప్పటి వరకూ ఆరోగ్యంగా ఉన్నవారు సైతం సైత అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎక్కువయ్యాయి. చిన్నారులు సైతం కార్డియాక్ అరెస్ట్ కారణంగా చనిపోతున్నారు… దీనికి కారణాలపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ సాగుతోంది… అలాంటిది అందరికీ జాగ్రత్తలు చెప్పే కార్డియాలజిస్టులే వైద్యపరమైన జాగ్రత్తల్లో ఉండకపోవడం ఒకింత విస్మయకరం…
కార్డియాలజిస్టులు సైతం గుండెపోట్ల ముందస్తు సూచనల్ని పసిగట్టనంత వేగంగా, హఠాత్తుగా గుండెపోట్లు మీదపడుతున్నాయి… అదీ టైమ్ కూడా ఇవ్వడం లేదు… రావడమే పవర్ ఫుల్ స్ట్రోక్‌గా వస్తున్నాయి… కొట్టేస్తున్నాయి… కరోనా వ్యాక్సిన్ల వల్ల మనుషుల్లో రక్తం చిక్కబడుతోందనీ, అదే గుండెపోట్లకు కారణమనే ప్రచారం అయతే డాక్టర్ సర్కిళ్లలో కూడా ఉంది… కరోనా వ్యాక్సిన్లకు పర్మిషనే అర్జెంట్ నీడ్ పేరుతో ఇచ్చారు… జరగాల్సిన మొత్తం ముందస్తు పరీక్షలు సరిగ్గా జరగలేదనే ఆరోపణ కూడా ఉంది…
ఇలాంటి చర్చ జరుగుతున్నప్పుడు సహజంగానే కార్డియలాజిస్టులు కొంత జాగ్రత్తగా ఉంటారు కదా… కానీ ఇక్కడ డాక్టర్ అలాంటి ప్రికాషన్స్ తీసుకున్నట్టు సమాచారం లేదు, ఏమో, తీసుకుంటున్నా సరే, గుండెపోటు మీదపడిందేమో… వ్యాక్సిన్లను నిందించడం సరికాదనే అభిప్రాయం కూడా ఉంది… 1) వ్యాక్సిన్లు తీసుకున్న ఆరు నెలల తరువాత కూడా గుండెపోట్లు సంభవిస్తున్నాయి… (6 నెలలు అనే కాలపరిమితి కూడా వైద్యేతరులే నిర్ధారిస్తున్నారు…) 2) ఇన్ని వందల కోట్ల మంది వేయించుకున్నారు కదా, మరి పెరిగిన గుండెపోట్ల శాతం అత్యంత స్వల్పం కదా… 3) వ్యాక్సిన్లపై ఇలాంటి ప్రచారం జరుగుతున్నప్పుడు ప్రభుత్వాలు కూడా పదే పదే బూస్టర్ డోసుల గురించి చెబుతున్నదే తప్ప ఇప్పుడు అర్జెన్సీ సడలింది కాబట్టి మరిన్ని ప్రయోగపరీక్షలు చేయించాలి కదా…
సరే, వృత్తిపరమైన ఒత్తిళ్లు గుండెల్ని బలహీనం చేస్తున్నాయి… మారుతున్న జీవనశైలులు కూడా గుండెల ఆరోగ్యాన్ని బలిగొంటున్నాయి అనే వాదనలు కూడా ఉన్నాయి… కాకినాడ ప్రజావైద్యుడు యనమదల మురళీకృష్ణ వంటి డాక్టర్లు ‘‘ఓ నిర్ధారిత డోస్‌లో ఆస్పిరిన్ వంటివి రోజూ తీసుకుంటే రక్తం గడ్డలు, చిక్కబారడం వంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు…’’ అని పదే పదే చెబుతున్నారు… మరి ఈ కేసులో డాక్టర్ గౌరవ్ గాంధీ వంటి కార్డియాలజిస్టులు సైతం ఇవి పాటించకపోవడం ఏమిటి..? పాటించినా ముంచుకొచ్చిన ఉపద్రవం ఆగలేదా..? ఇలాంటివే డాక్టర్ల సర్కిళ్లు మరింత నిర్మాణాత్మక చర్చకు దారితీస్తే సమాజానికి మంచిది…
Share this Article