నిజానికి ఇది చాలా చిన్న వార్త… సైజులో… పత్రికలో నిలువునా సింగిల్ కాలమ్‌లో వేస్తే సరిగ్గా కనిపించదు కూడా… కానీ ఎంత పెద్ద పాజిటివిటీ… అరె, మనం ఇండియాలోనే ఉన్నామా..? మన ప్రభుత్వ ఆఫీసులు ఇలా కూడా పనిచేస్తాయా అనే ఆశ్చర్యాన్ని, అభినందనను మోసుకొచ్చే వార్త… కనీసం డిజిటల్ మీడియా గుర్తించి, చప్పట్లు కొట్టకపోతే ఎలా…?
గతంలో పాస్‌పోర్టు పొందడం అంటే గగనం… పెద్ద ప్రయాస… ఖర్చు… తిప్పట, ఆయాసం, బ్రోకర్లు… పైరవీలు… ఐనా మోసాలు… కానీ దేశం వదిలి వెళ్లాలంటే అది తప్పదు… లక్షల మంది మనవాళ్లు పొట్ట చేత్తోపట్టుకుని దేశదేశాలూ వెళ్లి బతుకుతున్నారు… మరి పాస్‌పోర్ట్ లేకపోతే ఎలా..? సో, పాస్‌పోర్టులకై డిమాండ్ విపరీతంగా పెరిగింది…
సుష్మాస్వరాజ్ విదేశాంగ మంత్రిగా ఉన్న హయాంలో మొదలైన సంస్కరణలు పాస్‌పోర్ట్ ఆఫీసులను గణనీయంగా సంస్కరించాయి… అబద్ధం కాదు, నిజమే… ప్రైవేటు సేవల్ని అనుసంధానం చేసుకున్నారు… నిబంధనల్ని విపరీతంగా సరళీకృతం చేశారు… ప్రతి దశనూ డిజిటలీకరించారు… స్పీడ్, నంబర్, క్వాలిటీ… ఇవే టార్గెట్లుగా పాస్‌పోర్ట్ ఆఫీస్ కథే మారిపోయింది… ముచ్చట ఇదే నెలలో పబ్లిష్ చేసిన ఒక స్టోరీ లింక్ ఇది…
Ads
భేష్… పాస్‌పోర్టు సేవల తీరే మారిపోయింది… నమ్మశక్యం కానంతగా…!!
ఇక మనం చెప్పుకుంటున్న చిన్న వార్త దగ్గరికి వద్దాం… అహ్మదాబాద్‌కు చెందిన శ్రేయ్ అమెరికాలో ఎంఎస్ చేయడానికి వెళ్లాడు… మంచు కారణంగా యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు కోల్పోయాడు… వయస్సు 23 ఏళ్లు… తండ్రి జతిన్, తల్లి బిజాల్ వెళ్లి కొడుకు అంత్యక్రియల్ని అక్కడే చేయాలని సంకల్పించారు… తీరా పాస్‌పోర్టులు చెక్ చేసుకుంటే ఆమె పాస్‌పోర్టు వేలిడిటీ ఎప్పుడో గడువు ముగిసిపోయింది… తండ్రి పాస్‌పోర్టు వేలిడిటీ వచ్చే జూలై వరకూ ఉంది…
ఆయన వరకూ వోకే… ఇంకా ఏడు నెలల గడువుంది, ఎక్కడికైనా వెళ్లి రావచ్చు… కానీ ఆమె పాస్‌పోర్టు..? ఒక ప్రయత్నంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు… రీఇష్యూ కోసం… తీరా చూస్తే ఫిబ్రవరి 13న స్లాట్ దొరికింది… నిజమే, దేశంలో ప్రతిచోటా విపరీతమైన రద్దీ ఉంటోంది… ఆ రీజనల్ పాస్‌పోర్టు అధికారిని రిక్వెస్ట్ చేశారు… సీనియర్ సూపరింటిండెంట్ హరీష్ మలానీ దీన్నొక ప్రత్యేక కేసుగా తీసుకుని, జస్ట్ రెండే రెండు గంటల్లో కొత్త పాస్‌పోర్టు చేతికందించాడు… ఎస్, మనం ఇండియాలోనే ఉన్నాం…
మానవతా కోణంలో అంత వేగంగా స్పందించినందుకు బాధ్యులైన వారిని ఖచ్చితంగా అభినందించాలి… ప్రతి రాష్ట్రం ఇలాంటి సందర్భాల్లో అత్యవసరంగా స్పందించి, సాయం చేయడానికి వీలుగా ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేస్తే ఇంకా బెటర్… కొడుకును పోగొట్టుకున్న జతిన్, బిజాల్‌లకు ఆ బిడ్డ ప్రాణాలు తెచ్చి ఇవ్వలేం, కానీ కన్నీళ్లయినా తుడవగలం కదా…!!
ఈ వార్తలో అమెరికా వీసాల ప్రస్తావన లేదు, యూపీ మీడియా దాన్ని టచ్ చేయలేదు…
Share this Article