ప్రయాణాలకు కూడా ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్… అఫ్‌కోర్స్, సౌకర్యానికే ఫస్ట్ ప్రయారిటీ… దూరాన్ని బట్టి ప్రయాణాల రకాలు… ఇప్పుడు ప్రయాణంలో వేగాన్ని, త్వరగా డెస్టినేషన్ చేరాలనే ఆతృతను కనబరుస్తున్నాం… కానీ కాస్త వెనక్కి వెళ్తే ప్రయాణం అంటే ఓ అనుభవం, ఓ తృప్తి, ఓ సరదా, ఓ థ్రిల్… అదేసమయంలో కాస్త అసౌకర్యం, ఆలస్యం కూడా…
యాభైలు, అరవైలలో ఢిల్లీ నుంచి మద్రాస్ గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌లో నా జర్నీని గుర్తుచేసుకుంటుంటే మళ్లీ మళ్లీ ఆనందమే… మొత్తం 2200 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి అప్పట్లో పట్టిన టైమ్ 48 గంటలు… ఇప్పుడంటే వందే భారత్‌లు, కాదంటే ఫ్లయిట్స్… ఒంటికన్ను బ్లాక్ బ్యూటీలాగా కెనెడియన్ స్టీమ్ ఇంజన్లు 12కు పైగా ఉండే బోగీలను లాగుతుండేవి….
మైళ్ల దూరం దాకా వినిపించే రైలు కూత… రైలు సిలిండర్ల నుంచి వెలువడే హిస్స్ అనే సౌండ్… రైలు ఇంజన్ నుంచి పైన చిమ్నీ నుంచి దట్టంగా, ధారాళంగా వెలువడే పొగ… పట్టాల మీద చక్రాల రిథమిక్ చప్పుడు… ఆ ఇంజన్లకు బొగ్గు ఆహారం, నీళ్లు… అవి కడుపులో పడితేనే స్టీమ్ ఇంజన్‌కు పరుగు…
Ads
అప్పట్లో రిజర్వేషన్లు, ముందుస్తు సీట్ల కేటాయింపులు గట్రా ఏమీ ఉండేవి కావు కదా… ఎవరు ముందుగా బోగీలోకి దూకితే వారికే మంచి సీట్లు… ఎక్కువ మంది కిటికీల పక్క సీట్లు కోరుకునేవాళ్లు… ఢిల్లీలోని కరోల్ బాగ్ ఏరియాలో మా మద్రాసీలు ఎక్కువగా ఉండేవాళ్లు… సమ్మర్ వెకేషన్‌కు వెళ్లడం అంటే దానికి ముందస్తుగా పెద్ద ప్లానే ఉండేది… కనీసం ఏడెనిమిది ఫ్యామిలీస్ ఉమ్మడిగా జర్నీ చేసేవి… రైలు స్టేషన్‌లోకి రాగానే చురుకైన పురుషులు బోగీల్లోకి దూకేసి ఆక్రమించుకునేవాళ్లు…
కొన్ని సీట్లలో బ్యాగులను పెట్టేసేవాళ్లు… వేరే వాళ్లు ఆ సీట్లలో కూర్చోకుండా… కిటికీల పక్క సీట్లు మా పిల్లలకు… అప్పట్లో కిటికీలకు అడ్డంగా ఇనుప రాడ్లు ఉండేవి కావు… ఇక ఒక్కసారి రైలు కదిలాక, స్టేషన్ వదిలాక… మేం తలలు నిక్కించి బయటకు పెట్టి అటూ ఇటూ చూడటం, మా పెద్దలు మా కాలర్లు పట్టి వెనక్కి లాగడం సాధారణ ప్రక్రియ…
పెద్ద మలుపుల వద్ద… ఏదైనా డార్క్ టన్నెల్లోకి రైలు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా తలలు కిటికీల నుంచి బయటపెట్టి చూడాల్సిందే… అసలు లంచ్, డిన్నర్, నిద్ర సమయాల్లో తప్ప మా పిల్లల తలలు కిటికీలకే అంటిపెట్టుకుని ఉండేవి… అప్పట్లో రైళ్లు అంతే… అది వదిలే పొగ కారణంగా రైలు బోగీలకు ఒకవైపు నల్లగా అంటుకునేది… అంతేకాదు, చిన్న చిన్న బొగ్గు రేణువులు ఎగిరొచ్చి, బయటకు తలలు పెట్టి చూస్తున్న మా మొహాలపై, కళ్లల్లో పడేవి…
కళ్లల్లో అవి పడగానే అసంకల్పిత ప్రతీకార చర్యలాగా కళ్లు నులుముకునేవాళ్లం… దాంతో నొప్పి మరింత పెరిగేది… పెద్దలు కళ్లను బాగా తెరిపించి, కనురెప్పలు వాలకుండా చేత్తో పట్టుకుని, కళ్లల్లోకి గట్టిగా ఊదేవాళ్లు… అలా రెండుమూడుసార్లు చేశాక కన్నీళ్లతోపాటు ఆ బొగ్గు రేణువులు బయటపడేవి… అప్పటికే కళ్లు ఎర్రబారేవి…
దాంతో మనం పాఠం నేర్చుకుంటే కదా… మళ్లీ మళ్లీ బయటకి చూడటం, మళ్లీ మళ్లీ బొగ్గు రేణువులు, మొహాన్ని తాకే పొగ… మద్రాస్ సెంట్రల్ స్టేషన్‌లోకి దిగేసరికి పిల్లల మొహాలకు నల్లని మరకలు, ఎర్రబారిన కళ్లు… రిటర్న్ జర్నీలోనూ సేమ్ సేమ్… అసలు కిటికీల నుంచి బయటికి చూడటం పిల్లల ప్రివిలేజ్… అదొక సరదా… చివరకు ఆ రైలు కూత కూడా కర్ణపేయంగా అనిపించేది… మళ్లీ కాలంలో కాస్త వెనక్కి వెళ్లి, మళ్లీ ఒకసారి ఆ పాత స్టీమ్ ఇంజన్ రైలులో జర్నీ చేసొస్తే ఎంత బాగుండు..!!
Share this Article