.
బహిరంగంగా… ఒక ప్రధాని ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి… కమాన్, చేతులు కలుపు, నువ్వు ఆశించిన స్థాయికి చేరుస్తాను అన్నాడు… గుర్తుంది కదా… మోదీని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఇచ్చిన పిలుపు… శుష్క వాగ్దానం… అందులో రాజకీయం తప్ప చిత్తశుద్ధి లేదు…
అంటే, రేవంత్ రెడ్డిని బీజేపీతో చేతులు కలపమని అడగలేదు… డెవలప్‌మెంట్ విషయంలో కలిసి నడుద్దాం అన్నాడు… గుడ్, కానీ జనంలోకి వేరేగా వెళ్లింది… మోదీ కోరుకున్నది కూడా అదే… “కాంగ్రెస్ ముఖ్యమంత్రితో కూడా మేము సఖ్యతగా ఉంటాం” అనే ఒక ఉదారవాద ఇమేజ్ ప్రొజెక్ట్ చేసుకోవడం ఒకెత్తు… తెలంగాణకు నిజంగానే సహకరిస్తాడా..? సహకరించడు… ప్రతిదీ రాజకీయంతోనే ముడిపడి… చిక్కుపడి…
Ads
కాళేశ్వరం తీసుకుందాం, తనే అన్నాడు, కేసీయార్ ఏటీఎం అని… తెలంగాణ బీజేపీ నేతలు ప్రగల్భాలు పలికారు, ఆ కేసు సీబీఐకి ఇస్తే తెల్లారేసరికల్లా కేసీయార్‌ను జైలులో పెడతాం అని… ఆ శుష్క వ్యాఖ్యలు తెలిసినవే కదా… ఈరోజుకూ సీబీఐ కదల్లేదు, కదలదు… కేసీయార్ మీద ఈగ కూడా వాలదు… మోదీ గ్యారంటీ…
ఒకవైపు కేంద్ర మంత్రే చెబుతాడు సభలో, లక్ష కోట్ల గంగార్పణం అని… మరెందుకు ఆ అక్రమాల బాగోతాల్ని తేల్చి, బాధ్యులను శిక్షించరు..? రాజకీయం… కేసీయార్ కావాలి, తనతో పొత్తు కావాలి, వీలయితే బీజేపీలో తన పార్టీని నిమజ్జనం చేయాలి… అందుకని కేసీయార్ కావాలి… అంటే, తనను కాపాడుకోవాలి… సేమ్, విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణాలు, చత్తీస్‌గఢ్ కరెంటు కొనుగోళ్లలోనూ బోలెడు అక్రమాలు… కమిషన్ కూడా అదే తేల్చింది…
అన్నీ అంతర్రాష్ట్ర వ్యవహారాలు, నిధుల యవ్వారాలున్న కేసు కాబట్టి… బాగా తవ్వాలి కాబట్టి, దాన్నీ కేంద్రానికి, అంటే, సీబీఐకి అప్పగిస్తోంది రేవంత్ ప్రభుత్వం… అదీ కాళేశ్వరం గతే… తప్పదు… ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా వన్ ఎట్సెట్రా ఏ కేసుల్లోనూ కేంద్రం కన్ను లేదు, ఆరాల్లేవు… ఇవన్నీ ఒకెత్తు… తుమ్మిడిహెట్టి మరో ఎత్తు…
అప్పట్లో తుమ్మిడిహెట్టి దగ్గర బరాజ్ ఎత్తు 148 మీటర్లకు అంగీకరించాడని, దేవేంద్ర ఫడ్నవీస్‌ను కేసీయార్ పొగిడాడు, కాళేశ్వరం ప్రారంభానికి పిలిచాడు… అక్కడికి మహారాష్ట్ర ఏదో తెలంగాణ పట్ల అంతులేని ఔదార్యం చూపించినట్టు..! అదేమీ లేదు… తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలు కూడా కేసీయార్ ఏది చెబితే అది సై అనడమే…
తీరా ఏమైంది.,.? ఆ 148 మీటర్ల ఎత్తు ఒప్పందం పక్కన పారేసి, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల అన్నాడు కేసీయార్… అవి కాస్తా తస్కి, పనికిరాకుండా పోయాయి బరాజులు… ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం అదే తుమ్మడిహెట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తుతో బరాజ్ కట్టుకుంటాం, అనుమతి ఇవ్వండి అని మహారాష్ట్ర సీఎంకు లేఖ రాసింది… (అప్పుడూ ఇప్పుడూ సేమ్ సీఎం)… అపాయింట్‌మెంట్ ఇస్తే మా ఇరిగేషన్ మంత్రి సహా పెద్ద టీమ్ వస్తుంది, ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది అని రాశారు…
కనీసం 150 మీటర్లకు అంగీకరించినా, ఉమ్మడి ఆదిలాబాద్‌కు ఆ ప్రాణహిత నీళ్లతో ప్రయోజనం.., ఎక్కువ టీఎంసీల నీటిని ఎల్లంపల్లికి తరలించొచ్చు… ఎన్ని ఎకరాలు ముంపుకి గురైనా అడిగిన పరిహారం ఇస్తామని కూడా తెలంగాణ సిద్ధంగా ఉంది… కానీ, అంతర్రాష్ట్ర నదీజలాల విషయంలో మహారాష్ట్రకు ‘పరస్పర సహకార’ ధోరణి లేదు… రాజకీయ కోణాలు తప్ప..!!
అందుకే ఈరోజుకూ స్పందన లేదు… రేవంత్ గతంలోనే కిషన్ రెడ్డి ఈ విషయంలో చొరవ తీసుకోవాలని, తెలంగాణకు మంచి చేయాలని కోరాడు, కిషన్ రెడ్డి కూడా సైలెంట్, నువ్వు ఏదడిగితే అదిస్తాను అని చెప్పిన మోదీ సైలంట్, బండి సంజయ్ సైలంట్… ఎందుకు..?
కాంగ్రెస్ ప్రభుత్వం… దానికి పేరు రాకూడదు… ఇదొక్కటే… మరి తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కదా అనే సోయి తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలకు లేదు… ఇదే నిన్న రేవంత్ రెడ్డి మీడియా ఇష్టాగోష్టిలో చేసిన విమర్శ కూడా… ఐనా సరే… తెలంగాణ బీజేపీ నేతల నుంచి ఒక్క మాట లేదు, స్పందన లేదు… తెలంగాణ సమాజం దీన్ని వ్యతిరేకంగా తీసుకుంటుందనే సోయి కూడా లేదు…
ఐనా వాళ్లలో వాళ్లు తన్నుకోవడానికే సమయం సరిపోవడం లేదు… ఇంకా తెలంగాణ ప్రయోజనాలు, విశాల దృక్పథం వంటి మాటలు ఎందుకు అంటారా..? అవును, అదీ నిజమే..!!
ఓ మిత్రుడి వ్యాఖ్య… ‘‘ఏపీ పోలవరం, బనకచర్ల వంటి ప్రాజెక్టులపై తెలంగాణ ఇంకొన్ని మడతపేచీలు పెట్టాలి… చంద్రబాబు మీద ఎన్డీయే ప్రభుత్వ మనుగడ కదా, తనకు ఒకటోరెండో ఏటీఎంలు కావాలి కదా, తను మోదీపై ఒత్తిడి తెచ్చి, ఫడ్నవీస్ మీద ఒత్తిడి తెప్పించగలిగితే… తుమ్మిడిహెట్టి 150 మీటర్లు కాదు, 152 మీటర్లకూ ఒప్పందం కుదురుతుంది… కేంద్ర జలశాఖను కూడా తెలంగాణ ఇన్వాల్వ్ చేయాలి… నిజంగా ఆ ఎత్తుతో బరాజు కట్టగలిగితే కాళేశ్వరం నెట్‌వర్క్‌కు జవజీవాలు’’… కానీ సంకుచిత రాజకీయాలు కుదరనివ్వవు కదా..!!
- నిన్న రేవంత్ రెడ్డి తన టోన్ మరింత పెంచాడు… ఓ హెచ్చరిక జారీ… ‘‘మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నా… ఆదిలాబాద్ జిల్లా ఉప్పెనై కదులుతుంది… రైతులు ఉప్పెనై కదిలితే మహారాష్ట్రకు ఇబ్బందులు తప్పవు… మా బాధను, అవసరాన్ని మీరు అర్థం చేసుకోవాలి… పోలవరం కోసం ఏడు మండలాలను ఇచ్చిన మోదీ ప్రభుత్వం తెలంగాణ కోసం మహారాష్ట్ర నుంచి రెండు వేల ఎకరాలు ఇప్పించలేదా?’’

Share this Article