Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

PTG Colony – అరకు ​హైవే మెరిసింది… కనీస గౌరవం మరిచింది!

August 13, 2026 by M S R

.

అరకు ​హైవే మెరిసింది…కనీస గౌరవం మరిచింది! …  Srinivas Ganjivarapu …
అల్లూరి జిల్లాలోని అరకు NH-516E హైవేపై తారు ఇంకా కొత్త వాసన వేస్తూనే ఉంది. ప్రయాణాన్ని వేగవంతం చేసే బ్లాక్‌ టాప్ రోడ్డు, మలుపుల్లో మెరిసే రేడియం స్టిక్కర్లు, కొండల మధ్య ఆధునిక సాంకేతికతతో వెలిసిన సైన్ బోర్డులు… మన నాగరికత ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిందనే భ్రమలో పడేస్తాయి.

కానీ, అదే హైవే పక్కన అరకు సమీపంలో అకస్మాత్తుగా కంటపడే ఓ బోర్డు – “PTG కాలనీ”.. కంటబంసుగూడా ఊరు. ఆ బోర్డును చూడగానే గుండె లోతుల్లో ఏదో సన్నని చురుక్కు! పాతబడిన పదాలను, మూస ఆలోచనలను తెచ్చి కొత్త రోడ్డు పక్కన పాతేసిన సగం సగం అజ్ఞానానికి అది నిలువెత్తు నిదర్శనం.

Ads

ఆదివాసీ తెగల్లో అత్యంత వెనుకబడిన వారిని దశాబ్దాల క్రితం “Primitive Tribal Groups” (PTG) అని పిలిచేవారు. ఆంగ్లంలో ‘Primitive’ అంటే ప్రాచీనమైన లేదా “అనాగరికులు” అనే అర్థం వచ్చేలా, వలస పాలక దృక్పథంతో కూడిన ఒక రకమైన చులకన భావం అందులో దాగి ఉంది. ప్రపంచదేశాల ఐక్యరాజ్యసమితి కూడా మూలవాసుల స్వయం ప్రతిపత్తిని, వారి ఆత్మగౌరవాన్ని గుర్తించే క్రమంలో ఇలాంటి హేళనకరమైన ముద్రలను తొలగించాలని స్పష్టం చేసింది.

అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలు, ఐరాస సూచనలను పరిగణనలోకి తీసుకుంటూ, భారత ప్రభుత్వం 2006లోనే ఈ పదాన్ని మార్చింది. వారి సంస్కృతిని, ఉనికిని గౌరవిస్తూ “Particularly Vulnerable Tribal Groups” (PVTG) అని మార్పు చేసింది. అంటే తెలుగులో “ప్రత్యేక రక్షణ అవసరమైన గిరిజన సమూహాలు” అని అర్థం.

ఆ పదంలో ఒక ఆప్యాయత ఉంది, బాధ్యత ఉంది, గౌరవం ఉంది. కానీ, స్థానిక సమూహాల రక్షణ కోసం వచ్చిన పెసా (PESA 1996) వంటి చట్టాల ద్వారా ఏర్పడే గ్రామసభలతో కనీస సంప్రదింపులు కూడా జరపకుండా… అభివృద్ధి మంత్రం వల్లించే అధికార యంత్రాంగానికి ఈ వ్యత్యాసం అర్థమవుతుందా?

అభివృద్ధి పేరుతో వేల కోట్ల రూపాయల బడ్జెట్‌తో నల్లటి హైవేలు వేయగలరు. కొండలను తొలిచి రోడ్లు నిర్మించగలరు. కానీ, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన మానవ హక్కుల విలువలను గానీ, కనీసం సొంత ప్రభుత్వం మార్చిన సాంకేతిక పదజాలాన్ని గానీ అర్థం చేసుకునే శ్రద్ధ అధికార వ్యవస్థలకు లేకపోవడం విచారకరం.

ptg

ప్రభుత్వ రికార్డుల్లో కాగితాలు మారుతాయి, జీవోలు వస్తాయి. కానీ, ఒక అక్షరాన్ని మార్చడానికి కావలసిన మానవీయ స్పర్శ, సంవేదన అధికారుల భావజాలంలో లేకపోవడం దేనికి సంకేతం.. వారి దృష్టిలో అదొక బోర్డు మాత్రమే… కొన్ని ఇనుప రేకులు, కొంచెం పెయింట్!

కానీ ఆ దారి వెంట నడిచివెళ్లే ఒక ఆదివాసీకి అదొక ముద్ర. “మీరు ఇంకా ప్రాచీన కాలంలోనే ఉండిపోయారు” అని వ్యవస్థ చేసే నిరంతర హేళన. అభివృద్ధి అంటే కేవలం సిమెంటు, కాంక్రీటు, తారు రోడ్లు మాత్రమే కాదు; ప్రతి మనిషి నామోషి లేకుండా ఆత్మగౌరవంతో బతికే వాతావరణాన్ని కల్పించడం. ప్రపంచ వేదికలు సైతం అంగీకరించిన అనేక తెగల ఆత్మగౌరవాన్ని, వారి గుర్తింపును గౌరవించలేని అభివృద్ధి ఎంత వేగంగా దూసుకుపోతేనేం?

కొండల్లో వేసిన కొత్త హైవేలపై ఆధునిక కార్లతో గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. కానీ, పాతబడిన ఆలోచనలతో నిలబెట్టిన ఆ బోర్డు దగ్గర మన నాగరికత వేగం సున్నాకి పడిపోతుంది. అభివృద్ధి చుట్టూ ఉన్న కాంక్రీటు గోడలకు యంత్రాల శబ్దం మాత్రమే వినబడుతుందనే చేదు వాస్తవాన్ని ఇలాంటి పొరపాట్లు స్పష్టం చేస్తున్నాయి.

ఈ యంత్రాల ఘోషలో సిసలు గిరిజనుల ఆత్మగౌరవ శబ్దం, వారి అంతరంగ వేదన ఎప్పటికి వినబడతాయి? అంతటి సంస్కారాన్ని నేర్పే చదువు మన సమాజంలోకి ఎప్పుడు వస్తుంది అనేదే మన ముందున్న ప్రధాన ప్రశ్న!

#అరకు #Araku #ArakuValley #ArakuHighway #NH516E #AlluriSitaramaRajuDistrict #PVTG #IndigenousRights #AdivasiSelfRespect

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • PTG Colony – అరకు ​హైవే మెరిసింది… కనీస గౌరవం మరిచింది!
  • చంద్రముఖి ! హీరోలు, భాషలు మారేకొద్దీ అష్టవంకర్లు పోయిన అసలు కథ !
  • గైర్హాజరీ టీచర్లపై ఇకపై కఠిన చర్యలు! ఉత్తర్వులు జారీ!
  • ఆయన కేరళలోని గంగ… ఈయన ఇక్కడే కిమ్స్… ఏమిటీ తేడా..?!
  • ఇది మరో తండ్రి శవం కథ..! అనుబంధం- ఆత్మీయత అంతా ఒక బూటకం !!
  • FCRA – అసలు ఏమిటి ఈ నియంత్రణ చట్టం ? ఎందుకోసం ?
  • హీరోతో హీరోయిన్ రొమాన్స్ – కెమిస్ట్రీ – ఇదే మీడియా ప్రయారిటీ !!
  • ఢాకాలో ఏదో జరుగుతోంది – మళ్లీ రాజకీయ పరిణామాలు ?!
  • సన్నాసి ? సన్యాసి ? నదిలో వదిలేసిన శవం బతికి తిరిగొచ్చిందా !?
  • Credit Theft Politics … హరీశ్ రావు నీటి రూటే సపరేటు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions