.
బ్లండర్స్, ఫెయిల్యూర్స్, స్కాండల్స్ బీఆర్ఎస్ వంతు… తీరా ఏదైనా సమస్య వస్తే చాలు, పాపాల భైరవుడిగా రేవంత్ రెడ్డి కనిపిస్తాడు… తన మెడలో వేసేస్తుంది బీఆర్ఎస్ క్యాంపు… ఆరితేరిపోయింది ఈ క్రీడలో..! ఎటొచ్చీ ట్రాజెడీ ఏమిటంటే..? నిజం ఇదీ అని బలంగా చెప్పుకునే యంత్రాంగం రేవంత్ రెడ్డికి లేకపోవడం..! మేం ఏది కూసినా జనం నమ్మేస్తారని బీఆర్ఎస్ నమ్మడం..!!
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిలిపేస్తూ, అంటే 8 జీవోల మీద, అమలు మీద మధ్యంతర స్టే విధిస్తూ నిన్న హకోర్టు నిర్ణయం తీసుకుందని చదవగానే… అనుకున్నాం, రేప్పొద్దున దీన్ని కూడా రేవంత్ రెడ్డికి ముడిపెడతారని..! ఎస్, అదే జరిగింది… చూశాారా, కోర్టు 4 వారాల టైమ్ ఇచ్చినా సరే… రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదు… ఇదంతా ఆ రెండు పథకాల మీద కాంగ్రెస్ కుట్ర…
Ads
అందుకే కౌంటర్ దాఖలు చేయలేదు, అసలు ఆ పథకాలను నిలిపివేసే కుట్ర, దీనికితోడు తులం బంగారం అని హామీ ఇచ్చి, దాన్ని బుట్టదాఖలు చేసింది… అని కేసీయార్ ఏదేదో రాసుకున్నాడు నమస్తే తెలంగాణలో..! పాపం, ఒక్క నిజాన్ని దాచుకున్నాడు…
నిజంగా ఆ రెండు పథకాల్ని నిలిపివేయాలనే ఆలోచన ఉంటే… ఆ సాయాన్ని లక్ష రూపాయలకు ఎందుకు పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వం..? కౌంటర్ వేయకపోవడానికి పథకాల్ని నిలిపివేసే కుట్రకూ ఏం లింక్..? ఇంకా నయం..? అసలు కేసు వేయించిందే రేవంత్ రెడ్డి అనలేదు… ఏమో, రాను రాను అదీ అంటారేమో…
అసలు ఆ రెండు పథకాల అమలు మీద కేసీయార్‌దే పూర్తి నిర్లక్ష్యం, నిర్వాకం… ఎందుకంటే, ఆ పథకాలపై 8 రకాల జీవోలు వచ్చాయి… కానీ పథకం ప్రారంభించేటప్పుడే చట్టం చేయాలని విస్మరించారు… అలా నడిపిస్తూ వెళ్లారు… ఆ చెక్కుల రిలీజు కోసం కూడా బ్రోకర్లు, కమీషన్లు, మన్నూమశానం, పెంట చేశారు పథకం అమలును…
అమలు దరిద్రంగా ఉన్నా కానీ ఉద్దేశం, సంకల్పం మంచిది… అందుకే కాంగ్రెస్ కొనసాగిస్తోంది ఆ పథకాలను… మొదట్లో కేసీయార్ 51 వేలే ఇచ్చేవాడు… ఇప్పుడు లక్ష ఇస్తున్నారు… నిజానికి కేసీయార్ అప్పట్లోనే చట్టం చేయాలని అనుకుంటే, బిల్లు పెట్టి అప్పటి అసెంబ్లీలో ఆమోదం పొందడం అయిదు నిమిషాల పని… కానీ చేయలేదు…
ఇప్పుడు ఈ పథకాల బాపతు 8 కీలక జీవోల (GOs) చెల్లుబాటును సవాలు చేస్తూ న్యాయవాది విజయ్‌గోపాల్ వ్యక్తిగత హోదాలో హైకోర్టులో పిటిషన్ వేశాడు… శాసనసభ ఆమోదం లేకుండా రాష్ట్ర సమైక్య నిధి (Consolidated Fund of the State) నుంచి భారీగా నిధులు ఖర్చు చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 202(3), 204(3), 266(3), 283(2)లకు విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఆదాయ పరిమితి, అర్హత ప్రమాణాలను కార్యనిర్వాహక శాఖ (Executive) తనంతట తానుగా నిర్ణయించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు…
దీంతో మధ్యంతర స్టే విధిస్తూ, చట్టపరమైన ఆమోదాలు, విధివిధానాలపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది కోర్టు… కోర్టు స్టే కారణంగా తదుపరి విచారణ (సెప్టెంబర్ 9) వచ్చే వరకు ప్రభుత్వం ఈ పథకాల కింద కొత్త చెల్లింపులను నిలిపివేయాల్సి ఉంటుంది… సో, ఈ పథకాల నిలిపివేతకు మూలకారణం ఎవరు..? ఇంకెవరు..? కేసీయార్..!!
ఇంతకీ సంక్షేమ పథకాలకు ఖచ్చితంగా చట్టసభ ఆమోదం అవసరమా..? ప్రభుత్వ ఉత్తర్వులతో అమలు చేయడం సరికాదా..? ఏమో, కోర్టు ఏం స్పష్టత ఇస్తుందో చూడాలి..!!
Share this Article