టీవీ ప్రేక్షకులకు… అసలు ఓ లెక్కకొస్తే, హీరోయిన్లు, హీరోలు, ఇతర ఆర్టిస్టులందరికన్నా ప్రతి ఇంటికీ చేరేది యాంకర్లు… తెల్లారిలేస్తే పలకరిస్తారు, ఏదో ఓ ప్రోగ్రాం ద్వారా ప్రతి ఇంటి మనిషితోనూ ముచ్చట్లు పెడతారు… ఇంటిమనిషిగా కలిసిపోతారు… బట్, ఆ యాంకర్‌కు కాస్త స్పాంటేనిటీ, కాస్త సభ్యత, సరైన ఉచ్ఛరణ, కాస్త కలివిడితనం ఉంటేనే సుమా…! కొన్నేళ్లుగా టీవీ యాంకర్ అంటే సుమ… టీవీ హోస్ట్ అంటే సుమ… సినిమా ఫంక్షన్ అంటే సుమ… వెకిలి ధోరణులకు దూరంగా ఉంటుంది కాబట్టి, స్పాంటేనియస్‌గా చెణుకులు విసురుతూ అందరినీ ఆకట్టుకుంటుంది… అందుకే ఓ సగటు హీరోయిన్‌కన్నా ఆమె పాపులారిటీ చాలా ఎక్కువ… సంపాదన మరీ ఎక్కువ…
అలాంటి సుమ, తమ కేరళలో జరిగిన జీతెలుగు వాడి ఓ పండుగ స్పెషల్ షోలో… ప్రేక్షకుల్లో కూర్చుని ఉంటే, మరో యాంకర్ స్టేజీని తన కంట్రోల్‌లోకి తెచ్చేసుకుని, షో నడిపించడం… ఆహా, చూస్తుంటేనే భలే అనిపించింది… తమ సీరియల్ నటీనటుల్ని తీసుకెళ్లి, కేరళలో జీవాడు కేరళలో సంక్రాంతి అల్లుళ్లు అని ఓ దిక్కుమాలిన, చెత్త, బోరింగ్ షో రెండు రోజులు చేశాడు కదా… పనిలోపనిగా బంగార్రాజు ప్రమోషన్, నాగార్జున భజన సరేసరి… ఆ ప్రమోషన్ ప్రోగ్రాంలో ఉదయభాను యాంకరింగ్…
ఎన్నాళ్లకెన్నాళ్లకు..? నిజానికి తెలుగు టీవీ యాంకరింగు అంటేనే భాను… అప్పుడెప్పుడో 30 ఏళ్ల క్రితం సినిమాల్లో ఎంట్రీ, తరువాత కెరీర్ ప్లానింగ్ సరిగ్గా లేక, సంపాదన కక్కుర్తి వేషాలు ఎక్కువై, కొన్ని సినిమాల్లో ఐటమ్ నంబర్లు చేసి, పెళ్లయి, పిల్లలు పుట్టి, చాలాకాలంపాటు తెరకు దూరంగా ఉండిపోయింది… మధ్యలో ఏవేవో వివాదాలు, తగాదాలు కూడా…! ఈమధ్య అప్పుడప్పుడూ కనిపిస్తోంది… ఇప్పుడిక మళ్లీ యాంకర్‌గా కనిపించింది… వయస్సు మీదపడ్డట్టు కనిపిస్తోంది… కానీ టీవీ యాంకరింగుకు అదేమీ అనర్హత కాదు… సుమ వయస్సు కూడా దాదాపు ఉదయభాను వయస్సే… ఇద్దరికీ ఇద్దరేసి పిల్లలు…
Ads
అంతెందుకు..? మరో పాపులర్ యాంకరిణి అనసూయ కూడా అంతే కదా… తనూ ఏజ్ బారే… (అఫ్ కోర్స్, సుమ, భానుతో పోలిస్తే పదేళ్లు చిన్న)… అనసూయ కూడా ఐటమ్ నంబర్లు చేస్తుంటుంది… సుమ భాను తరువాత చాన్నాళ్లకు వచ్చింది తెర మీదకు… ఇద్దరికీ భాషలో ఫ్లుయెన్సీ ఎక్కువే… కాకపోతే సుమలో కాస్త కేరళరికం కనిపించి, తెలంగాణతనం అస్సలు కనిపించదు… ఆ యాస కూడా పలకలేదు… జీరో… భాను తెలంగాణ యాసలో కుమ్మేయగలదు… అనసూయకూ తెలంగాణ యాస రాదు, పలకలేదు, ప్రయత్నించదు, అదేదో వేరేవాళ్ల భాష అనుకుంటుంది… భాను మట్టిమనిషిలా కనిపించగలదు… కలిసిపోగలదు… సుమ, అనసూయలకు అది చేతకాదు…
నిజానికి భాను అంటేనే తెలుగు టీవీ యాంకరింగు… అంతేకాదు, రకరకాల భిన్నమైన ప్రోగ్రాముల్ని సరదాగా, సజావుగా నడిపించేది… కిట్టీ పార్టీల వంటి షోలతో పాటు రేలారే వంటి జానపద గీతాల షో దాకా… మంచి కమాండ్‌తో టాకిల్ చేసేది… తను డాన్సర్, తను సింగర్, తను యాక్టర్… ఇంకేం..? ఇప్పుడు సుమను ప్రేక్షకుల్లో కూర్చోబెట్టి ఉదయభాను ఆలీ, నాగార్జున, చైతూ తదితరులను షో మీద ఆడించిందీ అంటే… అదీ భాను… తన సీనియారిటీ, తన కాన్ఫిడెన్స్, తన కమాండ్… మళ్లీ రెగ్యులర్‌గా యాంకరింగ్ చేస్తుందా..? టీవీలు ఆ చాన్సులిస్తాయా అనేది వేరే ప్రశ్న… కానీ భాను రీఎంట్రీయే విశేషంగా కనిపించింది… తప్పనిసరి ఓవర్ మేకప్ తప్ప, ముప్ఫయ్ ఏళ్ల క్రితం భానే మళ్లీ కనిపించింది… అదే ఎనర్జీ, అదే నవ్వు, అదే స్పీడ్… మరీ సుమ మోనోపలీ ఎక్కువైంది, మొనాటనీ వచ్చేసింది… డిమాండ్ పెరిగింది… భానూ, కాస్త రెగ్యులర్‌గా కనిపించొచ్చుగా…!!
Share this Article