అవును, టీవీ సీరియళ్ల గురించి కదా మనం అప్పుడప్పుడూ చెప్పుకుంటున్నది… ఏ సీరియల్ చూసినా ఏమున్నది గర్వకారణం… వేల అవలక్షణ భరితం… దుర్గంధపూరితం… కానీ అవి లేక టీవీలు లేవు, టీవీలు లేక వినోదం లేదు, వినోదం లేక జీవితం లేదు… ఇదంతా ఓ పిచ్చి సర్కిల్… వేల కోట్ల యాడ్స్ డబ్బు… మన జేబుల్లో నుంచి కాజేసేదే… అందుకని అప్పుడప్పుడూ మాట్లాడుకోవాలి… ఈ సీరియళ్లు జీడిపాకం బాపతు కదా… ఏళ్ల తరబడీ, వేల ఎపిసోడ్లు సాగుతూ ఉంటయ్… రైటర్ దయ, ప్రేక్షకుడి ప్రాప్తం, డైరెక్టర్ ఇష్టం, ప్రొడ్యూసర్ కరుణ, సదరు టీవీ చానెల్ ఔదార్యం… ఆ కథల జోలికి వెళ్తే, ఆ పెంటలో పడి ఇప్పట్లో పైకి లేవలేం గానీ… ఓ విషయం చెప్పుకుందాం…
ఈ సుదీర్ఘ ఎపిసోడ్ల కారణంగా అప్పుడప్పుడూ కొందరు నటులు హఠాత్తుగా మానేస్తారు… లేదా వెళ్లగొట్టబడతారు… రెమ్యునరేషన్ ఎక్కువ అడిగితే, లేదా వేరే డబ్బొచ్చే సీరియళ్ల వైపు షిఫ్లయిపోతే, ఇంకేమైనా సమస్యలు తలెత్తితే నటీనటుల్ని మాన్పించేస్తారు… ఆ తేడా ప్రేక్షకుడికి తెలియకుండా కథలో ఆ పాత్రను ఏ తీర్థయాత్రలకో పంపించేస్తారు… లేదా పాత్రల్నే మాయం చేస్తారు… అడిగేవాడెవ్వడు..? తీసేవాడికి చూసేవాడు లోకువ… లేదంటే కొన్నిసార్లు హఠాత్తుగా ఆ నటీనటుల బదులు కొత్తవాళ్లను పెట్టేస్తారు… ఓహో, యాక్టర్స్ మారిపోయారా అని ప్రేక్షకుడే తన జ్ఞానం కొద్దీ గుర్తించి, అడ్జస్ట్ అయిపోవాలి తప్ప ఆ సీరియల్ వాడేమీ చెప్పడు…
Ads
జీతెలుగులో ప్రేమ ఎంత మధురం అని ఓ సీరియల్ వస్తుంది… అప్పట్లో టాప్ ఫస్ట్, సెకండ్ రేటింగ్స్ వచ్చేవి… అఫ్ కోర్స్, అన్ని సీరియళ్లలాగే ఇదీ చెత్త సరుకే… ఓ లెక్కకొస్తే చెత్తలో కూడా మరీ నాసిరకం చెత్త… అదీ దర్శకుడి ప్రతిభ… కానీ ఏమాటకామాట సీరియల్‌లో నటించే ఆ హీరో శ్రీరాం మినహా మిగతావాళ్లంతా మంచి మెరిట్ ఉన్న నటులు… ప్రత్యేకించి మీరా, జిండే, అనూరాధ, అనూ తండ్రి, తల్లి, అనూ ఫ్రెండ్స్, చివరకు రఘుపతి పాత్ర సహా అందరూ బాగా చేస్తున్నారు… కథనలోపాలు, ఇతర దరిద్రాల చర్చలోకి మనం వెళ్లడం లేదు సుమా…
మామిండ్లా, బ్రోఇండ్లా అంటూ పిచ్చి సంబోధనలతో ఓ కేరక్టర్ ఉంటుంది… అది మాన్సి పాత్ర… దాన్ని వర్ష అనే ఓ బక్కపలుచని అమ్మాయి పోషించేది… బాగా చేసేది… అదొక పిచ్చి కేరక్టర్… కానీ ఆ కేరక్టర్‌కు తగినట్టు ఈ పిల్ల భలే నటించేది… హఠాత్తుగా ఆమె మాయం… కానీ పాత్ర ప్రాధాన్యం దృష్ట్యా పాత్రనే మాయం చేయలేరు… అందుకని అప్పటిప్పుడు ఇంకెవరో అనూషను తెచ్చిపెట్టేశారు… సరే, కామనే కదా… కానీ వర్షకు ఏమైంది..? జీతం సరిపోవడం లేదా..? ఆమె తన సొంత చానెల్ వీడియోలో ‘‘నాకు షూటింగ్స్ ఎక్కువై, టైమింగ్స్ కుదరక ఆరోగ్యం సహకరించడం లేదు, అందుకే మానేశాను’’ అని చెప్పుకొచ్చింది… అబ్బ ఛా…
ఒకవైపు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షూటింగులతో బిజీ… ఒకటీరెండు సినిమాల్లో కూడా చేస్తుందట… వాటికి ఆరోగ్యం సహకరిస్తుంది కానీ ఈ సీరియల్‌కు మాత్రం కుదరడం లేదట… భలే సాకులు చెబుతారబ్బా… మరి ఈమె గురించి ఎందుకు చెప్పుకోవాలి మనం అంటారా..? ఏముంది..? ప్రస్తుత అనూష కూడా జీతం కాస్త పెంచమంటే, ఆమెను కూడా తీసిపారేసి, ఇంకెవరో మంజూషనో, ప్రత్యూషనో పట్టుకొస్తారు… ముందే చెప్పుకున్నాం కదా… తీసేవాడికి చూసేవాడు లోకువ… రాజనందిని పాత్ర చేయాల్సిన మానస మనోహర్ అనబడే కన్నడ నటి మళ్లీ కనిపించలేదు… కథ కదిలితే కదా ఆమె వచ్చేదీ రానిదీ తేలేది… ఏమో, ఆమెను కూడా మార్చిపారేశారేమో… మెల్లిగా మరో నటిని వెతికి ప్రవేశపెడతారేమో..!! ఈ వేషాలకే జనం ఛీకొట్టి సీరియల్‌ను మరీ తొక్కేశారు రేటింగుల్లో…!!
Share this Article