ఒక విభ్రమ ఆవరించింది… ఇదేం భాష..? ఇదేం భావజాలం..? ఎస్, ఆంధ్రజ్యోతి తెలుగుదేశం కరపత్రిక అని అందరికీ తెలుసు… అంతెందుకు, ఓనర్ రాధాకృష్ణే దాన్ని దాచుకోలేదు, దాచుకునే ప్రయత్నమూ చేయలేదు… ఈ విషయంలో ఈనాడు మరీ తలుపుచాటున నిలబడి పైటజార్చినా సరే, ఆంధ్రజ్యోతి అరుగు మీద నిలబడి కన్నుకొట్టే టైపే… ఆర్థికమో, సామాజికమో, జగన్ మీద ద్వేషమో… కారణాలు ఎన్నున్నా సరే, ఆంధ్రజ్యోతి తన పచ్చదనం మీద ఎప్పుడూ ముసుగు కప్పుకోలేదు… కానీ దేనికైనా ఓ లక్ష్మణరేఖ ఉంటుంది… రాధాకృష్ణ పోతురాజు తరహాలో ఎంతగా కొరడాతో చెళ్లుచెళ్లున కొట్టుకున్నా సరే, ఆ రేఖను దాటలేదు… కానీ మొదటిసారిగా సంయమనం కోల్పోయినట్టు కనిపించింది… తన కలానికి, తన గళానికి ఏదో సోకినట్టు అనిపించింది మొదటిసారి… లేకపోతే గెరిల్లా తరహా యుద్దం చేస్తాం, చేయకతప్పదు అనే రాతలేమిటి అసలు..? తన మిగతా వ్యాసం జోలికి పోవడం ఇక్కడ అప్రస్తుతం గానీ… ఈ వ్యాఖ్యలే మరీ విస్తుపోయేలా ఉన్నాయి… రాధాకృష్ణలోని టెంపర్మెంట్ ఇష్టపడేవాళ్లను కూడా స్తబ్దులను చేసే వాక్యాలివి…
తను స్వతహాగా వ్యాసరచయిత కాకపోవచ్చు… మంచి రాజకీయ విశ్లేషకుడు కాకపోవచ్చు… కానీ తనకు తెలిసిన విషయాల్ని ఏదోరకంగా పాఠకులతో షేర్ చేసుకుంటాడు… ఎంత పచ్చదనం అద్దినా సరే, తన రాతల్లో ఏదో మసాలా ఉంటుంది… కానీ ఇప్పుడది మాడిపోయిన ఉప్పుడుపిండిలా కనిపిస్తోంది… ఎస్, ఇక్కడ గెరిల్లా తరహా యుద్ధం అంటే… తెలుగుదేశం నాయకులంతా రాధాకృష్ణను, రామోజీరావును, టీవీ5 నాయుడిని వెంటేసుకుని, తపంచాలు పట్టుకుని, ఆలివ్ గ్రీన్ దుస్తులు వేసుకుని… జగన్ నివాసం మీదకు దాడికి దిగుతారని కాదు… సంప్రదాయేతర పోరాటం చేస్తాం, చేయాలి, చేయకతప్పదు అనేది రాధాకృష్ణ ఆంతరంగం, కవి హృదయం… కానీ అదే ఎందుకు అనేదే కీలకప్రశ్న…
Ads
పోయిన ఎన్నికల్లోనే కదా తెలుగు జనం కర్రు కాల్చి చంద్రబాబుకు వాతపెట్టింది… నేనేం తప్పుచేశాను, మీరే తప్పుచేశారు అని ఈరోజుకూ ప్రజల్ని నిందిస్తూనే ఉన్నాడు కదా చంద్రబాబు… మరీ 23 సీట్లకు కుదించేసి ప్రజలు ప్రకటించిన తీవ్ర అభిశంసనే కదా అది.,. అంటే ఏమిటర్థం… ఉద్దరించింది చాల్లేవయ్యా బాబూ, నాలుగురోజులు ఆ ప్రతిపక్షంలో ఉండు, ప్రజల్లో ఉండు, తప్పులు మార్చుకో అని ప్రత్యక్షంగానే చెప్పినట్టు కదా… మరి మీరు చేస్తున్నది ఏమిటి..? ప్రజలు చెప్పింది ఒకటైతే మీరు చేస్తున్నది మరొకటి… గెరిల్లా తరహా పోరాటంతో జగన్‌ను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు… అది మీరే అంగీకరిస్తున్నారు… అంటే..? రాజ్యాంగ వ్యవస్థల్ని వాడుకుని జగన్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని వైసీపీ పదే పదే ఆరోపిస్తున్నది కదా… అవున్నిజమే, మేం చేస్తున్న పని అదే అని రాధాకృష్ణ అంగీకరిస్తున్నట్టా..? అదెలా సమంజసం..?
లేక మా ప్లాన్ ఆఫ్ యాక్షన్‌లో ఇంకా చాలా మార్గాలున్నయ్… సంప్రదాయేతర పద్ధతుల్లో ఇంకా జగన్ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడతాం, బజారుకు ఈడుస్తాం అని చెబుతున్నట్టే అనుకోవాలా..? మరి వైసీపీ ఆరోపిస్తోంది గుళ్లపై దాడులు చంద్రబాబు పనే అని… అవన్నీ ఈ గెరిల్లా తరహా యుద్ధంలో భాగమే అని పరోక్షంగా తెలుగుదేశం అంగీకరిస్తున్నదని అనుకోవాలా ఇప్పుడు..? ప్రభుత్వంలో ఎవరున్నా సరే, ఏం చేస్తారు..? గెరిల్లా తరహా తిరుగుబాట్లను ఎన్కౌంటర్లతో ఎదురుకుంటారు, అణిచేస్తారు… సో, జగన్ మరింత కఠినంగా విరుచుకుపడాలా ఇప్పుడు..? అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలైనా చంద్రబాబు అండ్ బ్యాచ్‌ను ఏమీ చేయలేకపోయావ్, జగనూ, ఇదుగో యెల్లో గెరిల్లాల పోరాటమట, వింటున్నావా అని ప్రజలు వెక్కిరించాలా తనను..? అవునూ, 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే అమెరికా సైనికశక్తిలాగా కనిపిస్తున్నదా..? ఫాఫం… ఆర్కే పెన్… కాలం చెల్లి, కంట్రోల్ తప్పి సిరాను బయటకు కక్కుతున్నట్టున్నది…!!
Share this Article