ఊహించిందే… బ్రహ్మాస్త్ర ప్రిరిలీజ్ ఫంక్షన్‌కు తెలంగాణ ప్రభుత్వం అర్ధంతరంగా అనుమతులు రద్దు చేయడంతో సినిమా యూనిట్ షాక్ తిన్నది… సినిమా వ్యాపారం అంటేనే సున్నితమైన యవ్వారం, అందుకే పొలిటికల్ వివాదంలోకి వెళ్లలేదు… పోలీసుల నిర్ణయాన్ని గౌరవిస్తున్నామనీ, సహకరిస్తున్నామనీ చెప్పారు ప్రెస్‌మీట్‌లో… తప్పదు… ప్రతి విషయాన్ని పట్టుకుంటున్న బీజేపీ కూడా దీన్ని ఎందుకో లైట్ తీసుకుంది… దాంతో వివాదం సద్దుమణిగింది… కానీ..?
రామోజీ ఫిలిమ్ సిటీలో బ్రహ్మాండమైన సెట్టింగులతో, భారీ హంగామాతో శుక్రవారం సాయంత్రం నిర్వహించదలిచిన ప్రోగ్రామ్‌ను పోలీసులు జస్ట్, 2, 3 గంటల ముందు నిలిపివేశారు… నిజానికి ఇది నేషనల్ లెవల్ ఈవెంట్… అయితే ఈ రద్దుకు కారణం రాజకీయమేనా..? జూనియర్ ఎన్టీయార్ ముఖ్యఅతిథిగా వస్తున్నందుకేనా..? కేసీయార్ సినిమా పర్సనాలిటీలకు ఓ స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలని అనుకున్నాడా..? ఇది అంతిమంగా హైదరాబాద్ సిటీ ఇమేజీని దెబ్బ తీస్తుందా..? ఈ చర్చను నిన్న యూట్యూబ్ చానెళ్లు, మీడియా, సైట్లు లేవనెత్తాయి…
పోలీసులు ఏం చెబుతున్నారు..? గణపతి ఉత్సవాలు సాగుతున్నయ్, భద్రతకు పోలీస్ సిబ్బంది కొరత ఉంది, గతంలో ఇదే రామోజీ ఫిలిమ్ సిటీలో రాధేశ్యామ్, సాహో సినిమా ఫంక్షన్లు గతి తప్పి తొక్కిసలాట జరిగింది… పైకి చూస్తే ఇవన్నీ రీజనబులే… కానీ జస్ట్, 2, 3 వేల మంది, క్లోజ్డ్, సెక్యూర్డ్ వాతావరణంలో నిర్వహించుకునే ఓ సినిమా ఫంక్షన్ అది… ఒకసారి ఇన్సిడెంట్ జరిగితే ప్రతిసారీ జరుగుతుందా..? మరి పలు రాష్ట్రాలు నిషేధించిన మునావర్ ఫారూఖీ ప్రోగ్రామ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ, నగరం మధ్యలో బందోబస్తు నిర్వహించారు కదా… నగర శివారులో జరిగే ఈ బ్రహ్మాస్త్ర ప్రోగ్రామ్ ఎందుకు చేదయ్యింది..? ఈ ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది… నిన్నంతా చానెళ్లలో చాలాసేపు ఇదే చర్చ…
Ads
ఒక వాదన చూద్దాం… సినిమా కథలు రాసుకునే విజయేంద్రప్రసాద్‌కు బీజేపీ ఈమధ్య రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది… ఆయన కొడుకు రాజమౌళి… బ్రహ్మాస్త్రం సినిమాకు సౌత్ ఇండియా సమర్పకుడు రాజమౌళి… తను ఇప్పుడు దర్శకుడు మాత్రమే కాదు, సినిమా వ్యాపారి… అందుకే అగ్రెసివ్ మార్కెటింగ్ చేసుకుంటున్నాడు… తన దోస్త్ జూనియర్ ఎన్టీయార్‌ను ముఖ్యఅతిథిగా రమ్మన్నాడు… తను వోకే అన్నాడు… కానీ ఇదే జూనియర్ ఈమధ్య అమిత్ షాను కలిసి పొలిటికల్ చర్చలు జరిపాడు… అసలు తను అమితంగా ద్వేషించే అమిత్ షాను కలిసి చర్చలు జరుపుతాడా..? ఓసారి స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తే సినిమా వాళ్లంతా భయభక్తుల్లో పడి ఉంటారుగా అనుకున్నట్టేనా కేసీయార్..?
అసలే కేసీయార్‌ను హిందూ వ్యతిరేకిగా ముద్ర వేస్తోంది బీజేపీ పదేపదే… ఈ నేపథ్యంలో మునావర్‌కు ఓ మర్యాద, హిందూ పురాణాల ఆధారిత సినిమా బ్రహ్మాస్త్రకు ఆంక్షలా అని బీజేపీ మరింత ప్రచారం చేయడానికి కేసీయారే ఆస్కారం కల్పించాడు… ఒకవైపు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని తహతహలాడుతున్న కేసీయార్ మరోవైపు తనే బదనాం అయ్యే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు..? మళ్లీ ఇదో చిక్కు ప్రశ్న… బ్రహ్మాస్త్ర విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఖచ్చితంగా బాలీవుడ్‌లో, తద్వారా నేషనల్ మీడియాలో చర్చకు దారితీస్తుంది… ఈ నిర్ణయం వెనుక రాజకీయ కారణాలు ఏమీ లేకపోయినా సరే, ఆ కోణంలో ఇప్పటికే విస్తృత ప్రచారం జరిగిపోయింది…
ఈ ఫంక్షన్‌కు 70 మంది వరకూ నేషనల్ మీడియా పర్సనాలిటీస్‌ను పిలిచారు… వరుసగా హిందీ సినిమాలు అన్నీ తన్నేస్తూ, తీవ్ర సంక్షోభంలో ఉంది బాలీవుడ్… తన ఆశలన్నీ ఈ బ్రహ్మాస్త్రపైనే పెట్టుకుంది… పైగా ఇది 400 కోట్లు పెట్టి తీసిన సినిమా… ఇది ఫస్ట్ పార్ట్… అందుకే ఈ ప్రిరిలీజ్‌కు ముంబై నుంచి ఆలియాభట్, రణబీర్‌కపూర్, కరణ్ జోహార్ తదితరులు వచ్చారు… రెండు రాష్ట్రాల నుంచి జూనియర్ అభిమానులు వచ్చారు… తీరా చూస్తే ఇక్కడ సీన్ ఫుల్ రివర్స్…
సరే, కేసీయార్ నిర్ణయం వెనుక ఏ పొలిటికల్ కారణమూ లేదనే అనుకుందాం… పోలీసులు తమంతట తాము ఇంతటి పెద్ద నిర్ణయం తీసుకుంటారా..? ఒకవేళ తీసుకుంటే, ఇది తమకు రాజకీయంగా నష్టం అని భావిస్తే ప్రభుత్వ ముఖ్యులు కలగజేసుకునేవారు కదా… సో, శివుడి ఆజ్ఞ లేనిది చీమ కదల్లేదనే కదా అర్థం… అయితే ఆ ఆజ్ఞల ఉద్దేశం ఏమిటో సంపూర్ణంగా తెలియదు… నిజానికి హైదరాబాద్ అంటే చాన్నాళ్లుగా వినోదానికి హబ్… సినిమా ఇండస్ట్రీకి సెంటర్… బ్రహ్మాండంగా సెటిలైంది ఇండస్ట్రీ… అనేక కంపెనీల ఉద్యోగులతో, ఓ గ్లోబల్ సిటీలా ఉంది…
ఆమధ్య ఏదో పబ్‌పై అర్ధరాత్రి దాడి చేసి, అందరినీ ఠాణాకు తీసుకెళ్లి చికాకుపెట్టారు… తీరా చూస్తే ఇప్పటికి తవ్వింది లేదు, ఎలుక తోలు దొరకలేదు…ఇప్పుడు ఈ బ్రహ్మాస్త్ర… ఇది అంతిమంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీకి నష్టదాయకం… రాజకీయాలు వేరు, సినిమా దందా వేరు… ఇన్నాళ్లూ సినిమా వాళ్లు ఏదడిగితే అది చేతికి ఎముక లేదన్నట్టుగా ఇచ్చేస్తున్నాడు కేసీయార్… ఏ స్థితిలోనూ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆంధ్రాకు పోవద్దనేది ఒక ఉద్దేశం… మరి హఠాత్తుగా ఈ వైఖరి ఏమిటి..? పైగా జూనియర్ బీజేపీ మనిషేమీ కాదు… అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలవడం తప్పేమీ కాదు… రాజమౌళి కూడా బీజేపీ మనిషి కాదు… అమితాబ్, ఆలియా, కరణ్‌జోహార్, నాగార్జున, రణబీర్‌కపూర్ కూడా బీజేపీవాళ్లు కాదు… ఐనాసరే బ్రహ్మాస్త్రానికి కేసీయార్ ఎందుకు ఎదురు వెళ్లినట్టు..?! తను వెళ్లలేదనే అనుకుందాం, కానీ వెళ్లినవాళ్లను ఎందుకు ఆపలేదు..?!
Share this Article