ఏదో చింతామణి అనే నాటకాన్ని ఏపీ ప్రభుత్వం నిషేధించిందట… ఓహ్, అలాగా… దేనికి..? అందులో ఆర్య వైశ్య సామాజికవర్గంపై రీతిలేని కూతలు, అవమానించే వెకిలి రాతలు ఉన్నాయి కాబట్టి అట…! ఆ దిక్కుమాలిన నాటకాన్ని నిషేధించాలని సదరు సామాజికవర్గం కోరుతోంది కాబట్టి సకలకుల వల్లభుడైన జగన్మోహనుడు (ఆ ఒక్క కులం తప్ప) వెంటనే స్పందించి, ఠాట్, నా రాజ్యంలో మళ్లీ ఎవడూ ఆ నాటకాన్ని వేయకూడదనీ, వేస్తే మర్యాద దక్కదనీ అధికారికంగా హుకుం జారీ చేశాడుట… సరే, బాగుంది… తెలంగాణలో పెద్దగా ఆ నాటకాన్ని ఎవరూ వేయరు, వేసినా ఎవరూ చూడరు… అసలు అదొక నాటకం ఉందనీ, తెలంగాణలో ఆ కులంలోనే ఎవరికీ పెద్దగా తెలియదు… (అడపా దడపా సురభి వాళ్లు అక్కడక్కడా వేసి ఉండవచ్చుగాక…)
కావచ్చు, అదెప్పటిదో నాటకం కావచ్చుగాక… ఒరిజినల్‌లో అంతగా బూతు లేకపోయినా తరువాత ఈ నీచ నాటకసమాజాలు కొన్ని కావాలని బూతులు ఇరికించి, నాటకాన్ని భ్రష్టుపట్టించి, ఓ రోత నాటకంగా మార్చి సొమ్ముచేసుకుని ఉండవచ్చుగాక… ఈ వేషాలు, ఈ నాటకాలు చూస్తుంటే వైశ్యసమాజానికి చిర్రెత్తుతూ ఉండవచ్చుగాక… ప్రభుత్వ నిర్ణయం మంచో చెడో కాసేపు పక్కనపెడదాం… ఇదే ప్రభుత్వం కంచె ఐలయ్య రాసిన కోమటోళ్లు సామాజికస్మగ్లర్లు పుస్తకాన్ని నిషేధించమని కోరితే నిషేధిస్తుందా అనే ప్రశ్నను, చర్చను కూడా పక్కనపెడదాం… అసలు ఆ ఒరిజినల్ నాటకంలో ఏముంది..? పదండి, ఓసారి తెలుసుకుందాం…
*నూరేళ్ళ చింతామణి నాటకానికి గ్రహణం…!!
*ప్రజాస్వామ్యంలో కూడా ఫ్యూడల్ మనస్తత్వం..!!
*నాటకాన్ని నిషేధించినవారు.. కాళ్ళకూరివారి చింతామణిని అసలు చదివారా?
*నాటక ప్రదర్శనలో బలవంతంగా ‘జొప్పించిన’ బూతును నిషేధించాలా? లేక సందేశాత్మక నాటకాన్ని నిషేధించాలా?
*కాళ్ళకూరి వారి చింతామణిలో “బూతెక్కడ ” వుంది?
*సంస్కరణ వాదానికి అద్దంపట్టిన చింతామణిని నిషేధించి సమాజానికి మనం ఇచ్చే మెసేజ్ ఏమిటి?
*నేటి సినిమాలు, సీరియళ్ళలోని బూతులు, ద్వంద్వార్ధాలు కాళ్ళకూరి చింతామణిలో లేవు కదా?
*రోగం ఒకచోట .. వైద్యం ఇంకోచోటనా? నిషేధం అర్థంలేని నిర్ణయం కాదా?
నిజానికి చింతామణి నాటకంలో వున్నదేంటి..?
ఇక చదవండి… ఆలోచించండి..!!
*చింతామణి కూడా ఓ సంస్కర్త..!!
ఈతరం వారు మిస్సవుతున్న నాటకరాజం…. కాళ్ళకూరి వారి “చింతామణి “.!!
“చింతామణి“ పేరు వినగానే నొసలు చిట్లించుకుంటాం. రామ ! రామ ! అంటూ చెవులు మూసుకుంటాం. ఆ పేరు వింటేనే ఏదో పాపం చేసినట్లు ఫీలవుతాం. వాస్తవానికి చింతామణి ఓ సంస్కర్త. వేశ్యాకులంలో పుట్టి వేశ్యావృత్తిని స్వీకరించినా చివరకు తప్పును తెలుసుకొని తన్నుతాను
సంస్కరించుకుంటుంది. వేశ్యాలోలత్వం మంచిది కాదని సమాజాన్ని మేల్కొలుపుతుంది. వేశ్యగా తాను సంపాదించిన ధనరాశుల్ని తిరిగి వాపసు చేస్తుంది. యోగినిగా మారిపోయి భగవధ్యానంలో తరిస్తుంది.
*ఎవరీ చింతామణి ?
కాళ్ళకూరు నారాయణరావు రాసిన “చింతామణి”నాటకంలోని నాయిక పేరే చింతామణి. సమాజసంస్కరణ కోసం ప్రధానంగా వేశ్య పాత్రను సృష్టించడం ఆరోజుల్లో కొత్తేం కాదు. గురజాడ అప్పారావు గారితో నాటకాల్లో ఈ ధోరణి అలవడింది. కన్యాశుల్కంలో జగమెరిగిన జాణ “మధురవాణి” పాత్రను సృజించి అప్పట్లో ఓ కొత్త ట్రెండ్ ను ప్రవేశ పెట్టారు గురజాడ. అప్పటినుండి వేశ్య పాత్రల్ని జొప్పించి నాటకాలు రాయడం అలవాటుగా మారింది. కాళ్ళకూరి వారు కూడా గురజాడ వారి బాటలో మరో అడుగు ముందుకేసి “చింతామణి“ పాత్రను ఓ సంస్కర్తగా, ఆదర్శ నారిగా తీర్చిదిద్దారు. అప్పట్లో సమాజంలో వేళ్ళూనుకున్న వ్యభిచార దురాచారాన్ని ‘ కాంతాసమ్మితంగా‘ రక్తికట్టించి ప్రేక్షకులపై బలమైన ముద్ర వేశారు. జనాన్ని ఆలోచించేలా చేశారు.
కాళ్ళకూరు వారి చింతామణి ఏ సంఘ సంస్కర్త కంటే .. తక్కువ కాదు. చింతామణి తమ వృత్తిని స్వీకరించినా, చివరకు బుద్ధి వికసించి, బురదలోని పద్మంలా ప్రకాశించింది. ఒక మంచి నాటకం ప్రజల ఆలోచనా విధానంలో మార్పు తెస్తుందనడానికి చింతామణి నాటకం ఓ చక్కని ఉదాహరణ. మనుషుల్లో సహజంగా వుండే వేశ్యా వ్యామోహం పట్ల కళ్ళు తెరిపిస్తుందీ నాటకం. అంతే కాదు వేశ్యా సంపర్కం పట్ల జుగుప్సను, విముఖతను కూడా కలిగిస్తుందీ నాటకం!
“జీవితమే ఓ నాటక రంగం… మనమంతా పాత్రధారులం“ అని ప్రముఖ నాటక కర్త షేక్స్పియర్ అన్నమాట చింతామణి నాటకానికి బాగా వర్తిస్తుంది. జీవితమనే నాటక రంగంలో చింతామణి ఒక పాత్ర మాత్రమే. ఆ పాత్ర ద్వారా సమాజంలో పాతుకుపోయిన ఓ దురాచారానికి చరమగీతం పాడాలని ఆశించాడు ఈ నాటక రచయిత కాళ్ళకూరి .
చింతామణి నాటకం అనేసరికి బూతుల బుంగ, ముతక హాస్యం అన్న ఓ అపప్రథ వుంది. నిజానికి ఈ నాటకం ఆద్యంతం ఎక్కడా బూతు లేదు. అర్వపల్లి సుబ్బారావు, గండికోట జగన్నాథం లాంటి వృత్తి కళాకారులు కొందరు సందర్భాన్ని బట్టి, ప్రదర్శన ప్రాంతాన్ని బట్టి మూలంలో లేని బూతు సంభాషణల్ని, ముతక హాస్య, సన్నివేశాల్ని జొప్పించారు. దీంతో చింతామణి అంటే ఓ చవకబారు నాటకం, సంస్కారవంతులెవరూ చూడకూడదన్న అపోహ నెలకొంది. నిజానికి కాళ్ళకూరి వారి చింతామణి నాటకం ప్రదర్శన యోగ్యమైంది. పండిత, పామర జనరంజకమైందనడంలో ఎటువంటి సందేహం లేదు.
*ఇతివృత్తం…!!
బిల్వమంగళుడు, రాధ ఆదర్శ దంపతులు. దామోదరుడు బిల్వమంగళుడి మిత్రుడు. తండ్రి వార్థక్యంవల్ల బిళ్వ మంగళుడు వ్యాపారభారాన్ని నెత్తినేసుకుంటాడు. అదే నగరంలో చింతామణి అనే వేశ్య వుంటుంది! ఆమె తల్లి శ్రీహరికి డబ్బు పిచ్చి. చింతామణి అందచందాల్ని వలగా విసిరి విటుల్నిఆకర్షించి వారివద్ద నుంచి డబ్బు గుంజేది. భవానీ శంకరం, సుబ్బిశెట్టి వంటి వారు ఇలా చింతామణి మోజులో పడి తమ సర్వస్వం కోల్పోతారు.
వ్యాపారంలో లక్షలు గడిస్తుప్న బిల్వమంగళుడిపై చింతామణి దృష్టిపడుతుంది. బిల్వ మంగళుడు సదాచార సంపన్నుడు. నగరంలో మర్యాదస్తుడు. పెద్దమనిషి. బిల్వమంగళుడ్ని ఎలాగో అలాగు తన దగ్గరకు తీసుకువస్తే కొంత సొమ్ము ముట్టజెబుతానంటూ చింతామణి భవానీ శంకరాన్ని ప్రలోభ పెడుతుంది. భవానీ శంకరం మొత్తానికి బిల్వమంగళుడ్ని తీసుకువచ్చి చింతామణి కి పరిచయం చేస్తాడు. చింతామణి అందచందాలు, నాట్య విన్యాసాలు చూసి ముగ్ధుడైపోతాడు… కట్ చేస్తే.. చింతామణి మాయలో పడి ఉన్నదంతా సమర్పించుకుంటాడు బిల్వమంగళుడు. సమాజంలో పరువు ప్రతిష్టలు దిగజారిపోతాయి. పండంటి కాపురం కూలి పోతుంది. భార్య రాధ పరిస్థితి అత్యంత దయనీయంగా తయారవుతుంది.
డబ్బులేదని తమ ఇంటికి రావద్దంటుంది చింతామణి తల్లి శ్రీహరి. ఉన్నదంతా మీకే ఊడ్చి ఇచ్చానుగా అంటాడు బిల్వమంగళుడు. అయినా డబ్బులేకుండా రావడానికి వీల్లేదంటూ తెగేసి చెబుతుంది శ్రీహరి. ఇక చేసేది లేక డబ్బుకోసం ఇంటికొస్తాడు బిల్వమంగళుడు. వేశ్యా వ్యామోహం వదులుకోమంటాడు తండ్రి. బిల్వమంగళుడు తండ్రి మాటల్ని పెడచెవిన పెడతాడు. దీంతో మిగిలిన ఆస్తుల్ని కోడలు రాధ పేర రాసి మరణిస్తాడు బిల్వమంగళుడి తండ్రి. చివరకు తన పేర వున్న ఆస్తిని కూడా భర్తకే రాసి ఇచ్చేస్తుంది రాధ.
*కామాతురాణాం…..!!
తన తండ్రి ఇంట్లో శవంగా పడివున్నా పట్టించుకోడు. దహన సంస్కారాలను చేయకుండా ఆస్తిపత్రాలను తీసుకొని అంత రాత్రి పూట చింతామణి దగ్గరకు బయలుదేరుతాడు. వర్షం జోరుగా కురుస్తుంటుంది. నది ఒడ్డున వున్న చింతామణిని చేరాలంటే నావ అవసరం వుంటుంది. అయితే అంత రాత్రి నావ ఎక్కడ దొరుకుతుంది? అందుకే నదిలో దూకి ఈదటం మొదలుపెడతాడు. ప్రవాహవేగం ఎక్కువగా వుండి కొట్టుకుపోయే పరిస్థితి కలుగుతుంది. ఇంతలో ఓ ఆధారం దొరుకుతుంది. దాన్ని పట్టుకొని ఒడ్డుకు చేరతాడు. తీరా చూస్తే తాను పట్టుకున్న ఆధారం ‘శవం‘ అని తెలుస్తుంది. ”కామాతురాణాం.. న భయం.. న లజ్జ “ అని ఊరికే అన్నారా? బిల్వమంగళుడి పరిస్థితీ అదే.
ఈలోగా….,
ఈలోగా అక్కడ చింతామణికి జ్ఞానోదయం అవుతుంది. వేశ్యావృత్తిని మానేస్తుంది. దైవారాధనలో కాలం గడుపుతుంటుంది. ఈ విషయం బిల్వమంగళుడికి తెలీదు!. ఆస్తిపత్రాలతో చింతామణి ఇంటికి చేరుకుంటాడు… బిల్వమంగళుడికి చింతామణి ఇంటి వాతావరణం వేరుగా కనిపిస్తుంది . గతంలో మాదిరిగా మల్లెలు, పన్నీరు, సుగంధాలు కనబడవు. అగరొత్తుల వాసన మాత్రం వస్తుంటుంది. రసిక, సంగీత నాట్యాలకు బదులు వైరాగ్య భరితమైన మీరా భజనలు వినిపిస్తుంటాయి. బిల్వమంగళుడికిదేం అర్థం కాదు. మతి పోతుంది. అసలు తానొచ్చింది చింతామణి ఇంటికేనా? అన్న అనుమానం కలుగుతుంది.
చింతామణి వుండే గదిలోకి వెళతాడు బిల్వమంగళుడు. అక్కడ చింతామణిని చూసి అవాక్కవుతాడు. పట్టు చీర కట్టుకొని ఒంటినిండా ఆభరణాల్ని ధరించి, సిగలో మల్లెచెండు తురిమి, సరస సల్లాపాలతో తనను కవ్విస్తూ, సుఖభోగాలతో అలరించే అపూర్వ అందాలరాసి… నారచీర కట్టి, నుదుట విభూతితో, ఏక్ తారను మీటుతూ మీరా భజన ఆలపిస్తుంటుంది. చింతామణిని ఇలా చూసి జీర్ణించుకోలేకపోతాడు బిల్వమంగళుడు. అయితే ….
బిల్వమంగళుడ్ని దగ్గరకు పిలిచి ఓదారుస్తుంది చింతామణి. తనలో కలిగిన ఈ ఆథ్యాత్మిక మార్పును తెలియజేస్తుంది! అశాశ్వతమైన శారీరక ఆనందం కంటే ఆత్మానందం గొప్పదనిచెబుతుంది. బిల్వ మంగళుడికి కనువిప్పు కలుగుతుంది. బిల్వమంగళుడికి సోమగిరి యోగితో పరిచయం కలుగుతుంది. ఆ యోగి దగ్గర శ్రీకృష్ణ మంత్రోపదేశాన్ని పొంది సన్యాసిగా మారిపోతాడు. ఆ యోగి వెంటే వెళ్ళిపోతాడు బిల్వమంగళుడు. ”దైవభక్తే మానవజీవితానికి మోక్ష సాధన“, అన్న సందేశంతో నాటకం ముగుస్తుంది. వే శ్యావ్యామోహం పట్ల ప్రేక్షకులకు / పాఠకులకు ఛీత్కారం కలుగుతుంది.
*చింతామణి వ్యక్తిత్వం..!
చింతామణి అందాల రాసి. సకల విద్యలు నేర్చిన నెరజాణ. సంగీత, సాహిత్యాల్లో నిష్ణాతురాలు. నాట్యంలో మయూరి. లోకానుభవానికి కొదవే లేదు. అయినా తమ వృత్తి రీత్యా సానికాక తప్పలేదు! కులవృత్తి లోకాచారమే కదా అని సరిపెట్టుకుంది. వేశ్యాకులంలో పుట్టినా సంస్కారవంతురాలు. కాబట్టే మంచీ చెడుల విచక్షణను గుర్తెరిగి ప్రవర్తించేది. తన వ్యామోహంలో పడి సర్వం సమర్పించుకొని, ఉత్త చేతులతో మిగిలిన భవానీ శంకరాన్ని బయటకు గెంటేయమంటుంది తల్లి శ్రీహరి. అయితే చింతామణి ఇందుకు ఓపట్టాన అంగీకరించదు. తల్లికి నచ్చజెప్పబోతుంది. అయినా భవానీ శంకరాన్ని ఇంటినుంచి బలవంతంగా గెంటేస్తుంది శ్రీహరి. నిజానికి చింతామణికి వేశ్యా కుల సహజ లక్షణాలు అంతగా ఒంటబట్టలేదు. వేశ్యకు కూడా నీతి వుంటుందని చింతామణి నిరూపించింది.
“తాతల నాటి క్షేత్రములెల్ల తెగనమ్మి నీకే సమర్పించుకున్నాను గదా… అని భవానీ శంకరం అన్నప్పుడు… “నేను మాత్రం నీకేం తక్కువ చేశాను ? నీకోసం నా చుట్టూ తిరిగే విటుల్ని పంపివేశాను. మా అమ్మ కసురుకుంటున్నా నీకే లోబడి వున్నాను కదా“ అంటుంది… “నీవు లోటు చేశావని యే ఛండాలుడన్నాడని” భవానీ శంకరం అంటాడు… తీసుకున్న డబ్బుకు న్యాయం చేయడం చింతామణికి వృత్తితో పెట్టిన విద్య. అందుకే చింతామణి ప్రియవస్య, సర్వాంగ సుందరి అంటాడు భవానీ శంకరం.
*పాండిత్యం..!!
చింతామణి పాండిత్యంలో కన్యాశుల్కం లోని మధురవాణి కంటే మిన్నగా కనిపిస్తుంది. బిల్వమంగళుడు చింతామణి కోసం సర్పం, సంపెంగ పూవు, శివుడు రాహువు రూపాలన్న దంతపు పెట్టెను తెచ్చి తెరవకుండా, వీటి ఆధారంగా లోపల ఏముందో కనిపట్టమంటూ ‘సవాలు విసురుతాడు. అలా తెలుసుకోగలిగితే మరో మంచి బహుమతి కూడా ఇస్తానంటాడు. చింతామణి ఈ సవాలును స్వీకరిస్తుంది. పెట్టెలపై వున్న గుర్తులను బట్టి లాజిక్ వెదుకుతుంది.
“దంతపు పెట్టెపై మొదట సర్పం వున్నది. సర్పం దేనినిని హరింపగలదు? మారుతమును…. మారుతము దేని కొరకు వచ్చును.? పరిమళము కొరకు వచ్చును.? పరిమళము దేనియందు వుండును? పుష్పాదుల యందు… అందువల్ల పెట్టెలోని వస్తువు పుష్పాదులలోనిది కావలెను.
ఇక రెండవ గుర్తు సంపెంగ పూవు. సంపెంగ దేనిని హరింపగలదు? తుమ్మెదను…… తుమ్మెద దేని కొరకు వచ్చును? మకరందము కొరకు. మకరందము దేనియందుండును? పుష్పమందు…. అందు వల్ల పెట్టెలోని వస్తువు పుష్పమగుట నిశ్చయము కానీ … ఏ పుష్పమో? తేలాలి…
మూడవ గుర్తు శివుడు. శివుడు ఎవరిని వారించును? మన్మథుని… మన్మథునికే పుష్పము కావలెను? అరవిందము, అశోకము, చూతము, మల్లిక, నీలోత్పలము, అందువల్ల పెట్టెలోనిది పుష్పమే కావలెను.
ఇక నాల్గవ గుర్తు రాహువు. రాహువు ఎవరికి శత్రువు? సూర్యునకు… సూర్యునికే పుష్పము ప్రియము? ఇంకేముంది? కమలమే. కావున పెట్టెలో వున్నది కమలమే“ అంటుంది చింతామణి….
చింతామణి పాండిత్యానికి అబ్బురపడతాడు బిల్వమంగళుడు! పెట్టె తెరచి అందులో వున్న వజ్రకమలాన్ని తీసుకోమని ఇస్తాడు. ఇక బహుమతిగా ఏం కావాలో కోరుకోమంటాడు. “నాకెప్పటి నుంచో కామ శాస్త్రం చదువుకోవాలని వుంది. ఇప్పటి దాకా సరైన బోధకులు నాకు దొరకలేదు. మీరది తీర్చిన చాలును“ అంటూ పీటముడి వేస్తుంది చింతామణి. నిజానికి బిల్వమంగళుడికి సమస్త శాస్త్రాలు తెలుసన్న విషయం చింతామణికి ముందే తెలుసు. అతన్ని లోబరుచుకోడానికే బహుమతి మిషతో కామశాస్త్రం నేర్పమంటుంది. దీనివల్ల ఎలాగూ బిల్వమంగళుడు తనకు కామదాసుడవుతాడు.
*జ్ఞానోదయం..!!
వేశ్యగా తన బతుకు పట్ల తనకే హేయభావం ఏర్పడుతుంది. దీంతో చింతామణికి జ్ఞానోదయం కలుగుతుంది. “పాపిని, భ్రష్టురాలను, నతిబానిసనై బహు నీచ వృత్తిలో లేపులు మావులుంబడి చరించిన మాటయె నిక్కువ, మింక పాపపు దారి త్రొక్కను. భవచ్చరణాబ్ది యుగంబు సాక్షిగా నా ప్రేమ నిల్పి యదునందన కృష్ణా తరింపజేయవే” అంటూ తనను తాను తిట్టుకుంటూ కష్ణారాధనకు అంకితమవుతుంది. చింతామణి సహజ సంస్కారం వల్ల ఆథ్యాత్మిక చింతన పొంది , తన వల్ల నష్టపోయిన వారందరికీ ధనాన్ని తిరిగి ఇచ్చివేస్తుంది. భవానీ శంకరం, బిల్వమంగళుడు, సుబ్బి శెట్టి వంటి వారిలో పరివర్తన కలుగజేస్తుంది.
*సంస్కరణ..!!
చింతామణి ముందుగా తన్ను తాను సంస్కరించుకుంటుంది. తన వల్ల కష్టాలు పడిన వారందరూ తనవలె పరివర్తన చెందాలని కోరుకుంటుంది వేశ్యా వ్యామోహం, వేశ్యా సంపర్కం వల్ల వాళ్ళకు కలిగిన కష్టాన్ని, నష్టాన్ని లోకంలో తిరిగి ఓ ఆర్నెల్లు ప్రచారం చేయాలని కోరుతుంది. చింతామణి మాటను మన్నించి సుబ్బిశెట్టి, భవానీ శంకరం, వేశ్యావ్యామోహ వ్యతిరేక ప్రచారానికి పూనుకుంటారు! బిల్వమంగుళుడు కృష్ణ దర్శనానికి మధురానగరానికి బయలుదేరి వెళ్తాడు.
కాళ్ళకూరి వారి చింతామణి పాత్ర ఉదాత్తమైంది. కేవలం జాతి వల్ల గాక, నీతి వల్ల మాత్రమే మనుషుల్ని, వారి మనస్తత్వాల్ని గ్రహించాలని చింతామణి పాత్ర ద్వారా లోకానికి చాటి చెప్పాడు రచయిత. ఈ నాటకం గొప్పదనమేమంటే.. తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ఓ మూల ఈ నాటకం నిరంతరం ప్రదర్శింపబడుతూనే వుంటుంది. ఈ నాటకంలోని *అత్తవారిచ్చిన అంటుమామిడి తోట…” *వగలును, వలపులు వర్షించి తొలినాడె తిరగని పిచ్చి యెత్తించినాను“ వంటి పద్యాలు ఎన్నిమార్లు విన్నా.. ‘వన్స్ మోర్లు” పడాల్సిందే. మరో మాట అర్వపల్లి సుబ్బారావు (సుబ్బిశెట్టి ) బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి (చింతామణి ) కనకం (శ్రీహరి ) షణ్ముఖ (బిల్వమంగళుడు )కాంబినేషన్లో చింతామణి నాటక ప్రదర్శనను తిలకించడం ఓ మధురానుభూతి. ఈ నాటక ప్రదర్శనను ఎన్నోమార్లు చూడటం నా అదృష్టం. రాత్రి 9 గం.లకు నాటకం మొదలైతే.. అది పూర్తయ్యేసరికి తెల్లారేది.. ఎన్నిసార్లు చూసినా తనివి తీరని నాటకం చింతామణి !!——— ఎ.రజాహుస్సేన్.. ! నంది వెలుగు.. !!
Share this Article