RRR… వాయిదా పడింది… చాలా సినిమాల రిలీజ్ డేట్లు డిస్టర్బ్ అయ్యాయి… మార్చో, ఏప్రిలో తెలియదు… అంతా ఒమిక్రాన్ దయ… ఈలోపు దేశమంతా మస్తు ప్రమోషన్ చేసుకున్నారు… కన్నడ, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ప్రధానంగా… జూనియర్, రాజమౌళి, రాంచరణ్ స్వయంగా హిందీ బిగ్‌బాస్ షోకు వెళ్లారు, కపిల్ శర్మ కామెడీ షో వెళ్లారు… అంతా పెయిడ్ ప్రమోషనే… ఈ భారీ సినిమా విడుదల వాయిదా పడ్డాక చర్చ ఇప్పుడు జూనియర్ ఎన్టీయార్ మీదకు మళ్లింది… తను అనవసరంగా మూడేళ్లు టైం వేస్ట్ చేశాడా..? ఇదీ ప్రశ్న…
మంచి వారసత్వం, నటనలో మెరిట్… ఐనా సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోతున్నాడా..? ఎందుకంటే..? రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాకు తీసుకున్న టైం చాలా ఎక్కువ… ఎస్, గతంలో జూనియర్‌కు లైఫ్ ఇచ్చినవి రాజమౌళి సినిమాలే… రాంచరణ్‌కూ రాజమౌళికి కూడా అనుబంధం ఉంది… సో, ముగ్గురి కలయిక, కోఆర్డినేషన్ బాగానే ఉంది… కానీ..? అసలు ఆర్ఆర్ఆర్ ఔట్‌పుట్ మీద రాజమౌళి సంతృప్తిగా ఉన్నాడా..? ఈ చర్చ సాగుతోంది ఫిలిమ్ సర్కిళ్లలో… బాహుబలి కథ వేరు… అదొక జానపదం, ఫాంటసీ, చందమామ కథ… అది భాషలకు అతీతంగా కనెక్టవుతుంది… పైగా పాటలు హిట్… అనుష్క, తమన్నా సరేసరి… కానీ ఆర్ఆర్ఆర్ వేరు…
గిరిజనులు దేవుళ్లుగా ఆరాధించే ఇద్దరు లీడర్ల మీద అల్లబడిన ఓ ఫిక్షనల్ స్టోరీ… అంటే ఇతర భాషల ప్రేక్షకులకు ఏమేరకు కనెక్టవుతుంది..? పోనీ, వివాదాస్పదంగా రెండు వేర్వేరు కాలాలకు చెందిన ఇద్దరు నాయకులు కలిసినట్టుగా… మరీ తెల్ల సైనికుల గుండెల్లో నిద్రించిన అల్లూరిని ఏకంగా ఆ సైన్యంలో మనిషిగా చూపించడం ఏమేరకు తెలుగువాళ్లకు నచ్చుతుందో చూడాలిక… పైగా ఇద్దరికీ విపరీతమైన హీరోయిజాన్ని అద్ది, కమర్షియల్ హంగుల్ని రుద్దారు…
Ads
బాహుబలి అయిపోగానే ప్రభాస్ ‘థింక్ బిగ్’ ఫార్ములాకు కట్టుబడ్డాడు… సాహో… ఇప్పుడు రాధేశ్యాం… ఇవేనా..? తన చేతిలో నాలుగైదు భారీ ప్రాజెక్టులు ఉన్నయ్… ఇప్పుడు తను సినిమాకు వంద కోట్ల దాకా తీసుకునే పాన్ ఇండియా స్టార్… కానీ అదే సినిమాలో ప్రభాస్‌తోపాటు నటించిన రానా అరణ్య, విరాటపర్వం గట్రా చేస్తున్నాడు… ఇక్కడే ఉండిపోయాడు… ప్లానింగ్‌లో ఫెయిల్యూర్ అనుకోవాలేమో… రాంచరణ్ ఆర్ఆర్ఆర్ షూట్ అయిపోగానే ఎంచక్కా ఆచార్య పూర్తి చేసేసుకున్నాడు… రాంచరణ్ రూట్ వేరు, తను హీరోగా చేయడం వరకూ వోకే, కానీ వీలును బట్టి సొంతంగా సినిమా నిర్మించుకుంటాడు… ఈ పాన్ ఇండియా భ్రమల్లో ఏమీ లేడు… కానీ జూనియర్ ఏం చేశాడు..?
అఫ్‌కోర్స్, తనకు ఆర్ఆర్ఆర్ నిర్మాతలు 50 కోట్ల దాకా ఇచ్చి ఉండవచ్చుగాక… కానీ వాట్ నెక్స్ట్..? ఇది ఓ పెద్ద ప్రశ్న..! ఆర్ఆర్ఆర్ షూటింగ్ గట్రా అయిపోయాక తను జెమినిటీవీలో ఎవరు మీలో కోటీశ్వరుడు షో హోస్గింగ్ చేయడం ఓ పెద్ద బ్లండర్… అది పెద్ద ఫ్లాప్… రాంచరణ్‌లాగే ఓ సినిమా చేస్తే వర్కవుట్ అయ్యేది… అంతెందుకు ఆర్ఆర్ఆర్ సినిమా కోసం వెచ్చించిన మూడేళ్లలో ఆరు సినిమాలు చేసుకున్నా 150-200 కోట్ల దాకా వచ్చి ఉండేవి… అసలు ఎన్నేళ్లయింది జూనియర్ రేంజ్‌కు తగిన పాత్రను తెరమీద చూసి..! రాజమౌళి సినిమాలు బిగ్‌బాస్ చాన్సుల్లాంటివి, అందరికీ యూజ్ కావాలనేమీ లేదు… బాహుబలి తరువాత అనుష్క, రానా, తమన్నాలకు ఏం ఒరిగిందని..?!
సో, జూనియర్ ఎన్టీయార్ ఓ కంటింజెన్సీ ప్లాన్ కూడా ఆలోచించుకోలేదా..? ఒకవైపు మహేష్, మరోవైపు బన్నీ… ఎంచక్కా ప్లాన్డ్‌గా ఫీల్డ్ దున్నేస్తున్నారు… జూనియర్ స్టామినా, రేంజ్ కూడా అదే… ఎటొచ్చీ ఎక్కడో ‘కాటకలిసినట్టుంది’..! అనగా ‘చిక్కుబడిపోయింది’..!! ఏపీ రాజకీయాలు రారమ్మని పిలుస్తున్నయ్… కానీ ఇప్పుడే వెళ్లే పరిస్థితి లేదు, ఆ ఆలోచనలో కూడా లేడు, ఆల్‌రెడీ చంద్రబాబు వాడుకుని వదిలేస్తే, తత్వం బాగా బోధపడి తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు, రాజకీయాలకు దూరదూరంగా ఉంటున్నాడు… ప్రజారాజ్యం, పవన్‌కల్యాణ్ అనుభవాలు, సాధించిన ఫలితాలు చూస్తూ జూనియర్ సొంత పార్టీ పెట్టే సాహసం కూడా ఇప్పట్లో చేయకపోవచ్చు… సో, ఓ భారీ నిర్మాతను వెతుక్కుని, ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుకు సై అనడమే జూనియర్ ప్రస్తుత కర్తవ్యం..!!
Share this Article