అసలు జర్నలిస్టు అంటే ఎవరు..? పత్రికలు, టీవీల్లో పనిచేసే సిబ్బంది మాత్రమేనా..? లేక ఇతర మీడియా, అంటే సోషల్ మీడియా, యూట్యూబ్ తదితర ప్రసార సాధనాల్లో పనిచేసే సిబ్బంది కూడా జర్నలిస్టుల కేటగిరీలో వస్తారా..? డిజిటల్ మీడియా కూడా ఉంది… అంటే వెబ్ పత్రికలు… ఈ-పేపర్లు, వాట్సప్ ఎడిషన్లు అన్నమాట…
ఒక వ్యక్తి తనను పోషిస్తున్న పార్టీ బాసు ప్రయోజనాల కోసం యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో వర్క్ చేస్తుంటాడు… తనను జర్నలిస్టు అనాలా..? యాక్టివిస్టు అనాలా..? ఓ పార్టీ క్యాంపులో, క్యాంపెయిన్‌లో భాగస్వామి అనాలా..? తనపై ప్రభుత్వ ప్రోద్బలంతో లేదా ప్రైవేటు వ్యక్తుల వల్లనో జరిగే దాడినో, ట్రోలింగునో జర్నలిస్టుపై దాడి అనొచ్చా..? పార్టీల నడుమ ఘర్షణగా భావించాలా..?
ఈ డౌటనుమానం ఎందుకొచ్చిందంటే… నిన్న ఓ వార్త కనిపించింది… ప్రభుత్వ ప్రోద్బలంతో జరిగే వేధింపుల్లో తెలంగాణ ప్రథమస్థానం అనేది ఈ వార్త సారాంశం… నిజంగానే తెలంగాణ ప్రభుత్వానికి జర్నలిస్టులంటే చిన్నచూపు… మీడియా యాజమాన్యాలే పాలకుడి పాదాలపై పారాడుతుంటే ఆఫ్టరాల్ జర్నలిస్టుతో ఏముందిలే అనే ధోరణి… ఎప్పుడో వైఎస్ హయాంలో జర్నలిస్టులు కొనుక్కున్న భూముల్ని సుప్రీం కోర్టు చెప్పినా కేసీయార్ ఖాతరు చేయడం లేదు… అసలు ఒక్క ముక్క కూడా మాట్లాడటం లేదు… సరే, ఇది నిర్బంధాలు, అరెస్టుల జాబితాలోకి రాదు, కానీ జర్నలిస్టుల పట్ల కేసీయార్ ధోరణికి అద్దం పట్టే ఓ ఉదాహరణ…
Ads
రైట్స్ అండ్ రిస్క్స్ అనాలిసిస్ గ్రూపు (ఆర్ఆర్ఏజీ) ఓ సర్వే చేసిందట… అందులో ప్రభుత్వ ప్రోద్బలంతో జర్నలిస్టులపై జరిగిన దాడుల సంఖ్యలో తెలంగాణ ఎక్కువట… హెడింగులు, డెక్కులు చూస్తే… యూపీ, కాశ్మీర్‌లను మించి జర్నలిస్టులకు తెలంగాణలో వేధింపులు, ఆంక్షలు, కేసులు, అరెస్టులు ఉన్నాయా అని ఆశ్చర్యమేసింది… తీరా కంటెంటులోకి వెళ్తే… జర్నలిస్టులపై దాడుల విషయంలో కాశ్మీర్ మొదటిస్థానంలో ఉందట, కానీ ప్రభుత్వ ప్రోద్బలంతో జరిగే దాడులు మాత్రం తెలంగాణలోనే ఎక్కువట…
అదీ చదివితే… జర్నలిస్టులతో పాటు యూట్యూబ్ కంటెంట్ రైటర్లను కూడా ఈ సంఖ్యలో కలిపేశారు… డిజిటల్, యూట్యూబ్, వెబ్ కంటెంట్ రైటర్లు లేదా ఆయా సంస్థల స్టాఫ్ జర్నలిస్టులుగా పరిగణనలోకి వస్తారా అనేది బేసిక్ ప్రశ్న… వీళ్లకు పాత్రికేయంలో ప్రవేశం-శిక్షణ ఉండదు, విలువలు ఉండవు, ఏదో పార్టీకి సపోర్ట్ చేసే సోషల్ యాక్టివిస్టులు మాత్రమే అనేవాళ్లు ఉన్నారు… కానీ ప్రింట్, టీవీ మీడియా దుర్గతి కూడా అదే కదా… ఫీల్డులో మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులుగా చెలామణీ అయ్యే వాళ్లలో ఎంతమందికి ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉంది..? వాళ్లు కూడా తమ పత్రిక బాసుల పార్టీలను బట్టి అడ్డదిడ్డంగా ‘‘ప్రయోజనకర వార్తలు’’ రాసేవాళ్లే కదా…
ఠాట్.., ఆర్ఆర్ఏజీ సర్వే బోగస్, తెలంగాణ రాష్ట్రాన్ని బదనాం చేసే కుట్ర, ప్రయత్నం అని అనడం లేదిక్కడ… వాళ్ల సర్వే ప్రాతిపదికలు కూడా అస్పష్టం… జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టుల నడుమ ఓ రేఖ అవసరం లేదా..? ఉందంటే అదెలా ఉండాలి..? ఈ మౌలిక ప్రశ్నలకు జవాబులు కాస్త కష్టమే… కానీ ఎవరు జర్నలిస్టులు అనే విషయంలో ఓ క్లారిటీ అవసరం… ప్రభుత్వం ఇచ్చే అక్రెడిటేషన్ ప్రాతిపదికలకు కూడా ఓ నిర్దిష్టత లేదు… నిజానికి ఆ అక్రెడిటేషన్లతో పెద్దగా ఉపయోగం కూడా లేదు..!!
ఎలాగూ మోడీ భాయ్ రైళ్లలో జర్నలిస్టులకు ఇచ్చే రాయితీ ఎత్తిపారేశాడు… ఆర్టీసీ బస్సుల్లో మూడో వంతు ఛార్జీలకు మాత్రం ఈ పాసులు యూజ్‌ఫుల్… ఇళ్ల స్థలాలకూ అక్రెడిటేషన్లకూ సంబంధం లేదు, అది వేరే ప్రక్రియ… ‘‘ప్రభుత్వం గుర్తించిన జర్నలిస్టు’’ అనే హోదాతో ఒరిగేదేమీ లేదు… పైగా మరో బేసిక్ ప్రశ్న… ప్రైవేటు సంస్థల ఉద్యోగుల్ని ప్రభుత్వం ఎందుకు గుర్తించాలి..? ఈ ప్రభుత్వం చివరకు జర్నలిస్టులను భవన నిర్మాణ కూలీలు, హమాలీల జాబితాలో చేర్చి మరీ ప్రభుత్వ బీమా పథకం కిందకు తీసుకొచ్చింది అప్పట్లో, గుర్తుంది కదా…!! ఇప్పుడు అది కూడా ఉందో లేదో తెలియదు..!!
చివరగా… జర్నలిస్టులపై దాడులు పత్రికా స్వేచ్ఛకు విఘాతం అనే స్పష్టత అన్నిసార్లూ వర్తించదు… అలాగని దాడులను సమర్థించడం లేదు ఇక్కడ… పత్రికా స్వేచ్ఛ అనేది యాజమాన్యాల స్వేచ్ఛ… అంతే తప్ప ఆయా మీడియా సంస్థల్లో ఉద్యోగుల స్వేచ్ఛ కాదు… స్వేచ్ఛకూ పరిమితులు ఉంటాయి… ఉదాహరణకు… మొన్నీమధ్య ఏదో మండలంలో డజను మంది విలేకరులపై కేసులు పెట్టారు… అదేమంటే బలవంతపు వసూళ్లపై కేసులు పెట్టామన్నారు పోలీసులు… అవి కూడా జర్నలిస్టులపై దాడుల జాబితాలోకి వస్తాయా యువరానర్..!!
Share this Article