ఎవరన్నారు మోహన్‌బాబు మౌనం చేతకానితనం అని… చేవలేనితనం అని… ఎవరయ్యా..? ఇలా ముందుకురండి ఓసారి… మనకెందుకు మనకెందుకు అని మౌనంగా ఉండే కేరక్టర్‌లా కనిపిస్తున్నాడా..? శ్రేయోభిలాషులు వద్దన్నా సరే మౌనంగా ఉండిపోయేరకం అనుకున్నారా..? నో, నెవ్వర్… సినిమాను బతికించడానికి ఏం చేయడానికైనా రెడీ… ఏం తనను పిలిచారా..? కలిసి వెళ్దాం- రమ్మన్నారా..? జగన్ మీ చుట్టమే కదా, మీరు వస్తే మన ప్రయత్నాలకు సానుకూలత వస్తుంది, జగన్ ప్రభుత్వం దగ్గర మీ మాటలకు బరువుంది, విలువుంది, మీరు ఓమాట చెబితే అయిపోతుంది అని అడిగారా..? అడగకపోతే వస్తాడా..? అసలే ఆత్మాభిమానం మహా ఎక్కువ… అందుకే రాలేదు…
ఆ చిరంజీవి అండ్ బ్యాచ్ నలుగురు వెళ్లి సంప్రదింపులు జరిపితే పనులు అయిపోతాయా..? ఇండస్ట్రీని బతికించాలనే కోరికతోనే ఈ సంప్రదింపులు సాగి ఉంటే, మోహన్‌బాబు ఎందుకు కనిపించలేదు..? ఎందుకు కలుపుకుని వెళ్లలేదు..? ఇండస్ట్రీ అంటే ఆ నలుగురేనా..? జస్ట్, ఒక్క మాట మోహన్‌బాబును అడిగి ఉంటే, ఆయన పెద్దరికాన్ని మీదేసుకుని, కండువా దులుపుకుని, పెదరాయుడిలా కదిలి ఉంటే ఈపాటికి థియేటర్లు, ఇండస్ట్రీ కళకళలాడేవి కాదా..?
Ads
మీరే సరిగ్గా ఉంటే, అసలు మోహన్‌బాబు ఇలా బహిరంగలేఖలు రాసి, ఆక్రోశం, ఉక్రోషం, ఆగ్రహం, ఆవేదన, ఆందోళన ఎట్సెట్రా ఎట్సెట్రా వ్యక్తీకరించే అవసరం కలిగేదా..? పోనీ, ఆ బాలయ్యను పిలవరు అంటే ఓ అర్థముంది… ఆయన ప్రతిపక్ష నేత బావమరిది, పైగా ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యే… తను రావాలన్నా, వెళ్లి మంత్రుల్నో, జగన్‌నో కలవాలన్నా కాస్త సెన్సిటివ్‌గా ఉంటుంది… పవన్ కూడా ప్రతిపక్షమేనాయె… ఎవరూ పిలవరు, కలిసిపోదాం- రమ్మనరు, ఇన్వాల్వ్ చేయరు, అసలు తనే ఇన్వాల్వ్ అయితే తాడోపేడో…! మరి మోహన్‌బాబుకేం..? జస్ట్, ఇలా పిలవండి, అలా దడదడమంటూ రైలు దూసుకొచ్చేస్తుంది… లాబీయింగ్ తెలియాలయ్యా… అందుకే ఇండస్ట్రీ మీద సర్కారు ఈ పెత్తనం సాగిస్తోంది…
చివరకు ఇప్పుడేమైంది..? తగుదునమ్మా అని మీదేసుకుని ఇండస్ట్రీని తాము రిప్రజెంట్ చేస్తున్న ఆ నలుగురితో ఏమైంది,.? ఏమీ కాలేదు… ఇప్పుడేమో నాకు పెద్దరికాలు వద్దు, పెత్తనాలు వద్దు, పంచాయితీలు చెప్పలేను అంటారా..? హమ్మా… ఇగోను చంపుకుని, బాబ్బాబు, మోహన్‌బాబ్బాబు గారూ, మీరు కాస్త జగన్‌కు ఓ ఫోన్ చేయాలి, ఓ మాట చెప్పాలి, లేకపోతే ఇండస్ట్రీ బతకదు అని ఒక్కరైనా అడిగారా..? ఇండస్ట్రీని బతికించే వైద్యం తెలిసినవాడు… అలా వదిలేస్తారా..? ఆయ్ఁ… బాబు గారికి మహా కోపమొచ్చేసింది… ఇక అనుభవించండి… నో, నో, వాళ్లోవీళ్లో ఎందుకు అడగాలి, తనొక్కడే వెళ్లి కార్యసాధకుడై, ఇండస్ట్రీని ఉద్దరించే నిర్ణయాలకు జగన్‌ను ఒప్పించవచ్చుకదా అంటారా..? నెవ్వర్… అడగనిది అమ్మయినా అన్నం పెట్టదు, అడగనిది మోహన్‌బాబైనా అడుగు వేయడు… అంతే…
Share this Article