రాజకీయ సంస్కారం గురించి చాలా గొప్పలు చెబుతారు… నీతులు చెబుతారు… కానీ ఆ సంస్కారం కూడా అవసరాల పరిధిలో మాత్రమే ఉంటుంది… అది రాజకీయ నాయకుడి లక్షణం… అబ్బే, కేసీయార్ ఆరోగ్యంపై ప్రత్యర్థి కార్యకర్తల సోషల్ పోస్టుల వెటకారాల గురించి చెప్పడం లేదు… కేజ్రీవాల్‌కు ఇతర ప్రాంతీయ పార్టీల అధినేతల నుంచి దక్కని మర్యాద గురించి…!
కచ్చితంగా కేజ్రీవాల్ పంజాబ్‌లో సాధించిన విజయానికి ప్రాధాన్యం ఉంది… గోవాలో సీట్లు గెలిచింది పార్టీ… హర్యానాపై దృష్టి పెట్టింది… ఢిల్లీలో పాతుకుపోయింది… ఖలిస్థాన్ వేర్పాటువాదుల మద్దతు తీసుకున్నాడు వంటి విమర్శలు ఈ సందర్భంలో సరికాదు, అవన్నీ రాజకీయ అక్కసును ప్రదర్శించేవే… పంజాబ్ ప్రజలు కేజ్రీవాల్‌ను నమ్మారు… అనుకూలంగా తీర్పు చెప్పారు… అదీ అస్పష్టంగా కాదు, మిగతా రాజకీయ పార్టీలను ఛీకొడుతూ…! కేజ్రీవాల్ బలమైన ప్రత్యర్థి మోడీ తన విజయం పట్ల శుభాకాంక్షలు చెప్పాడు… కేజ్రీవాల్ థాంక్స్ చెప్పాడు…
మరి కేసీయార్ ఎందుకు కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు చెప్పలేదు… జగన్ ఎందుకు చెప్పలేదు..? వీళ్లే కాదు, స్టాలిన్, మమత, హేమంత్ సోరెన్, ఉద్దవ్ ఠాక్రే, పినరై విజయన్, నవీన్ పట్నాయక్… కాంగ్రెసేతర, బీజేపీయేతర ముఖ్యమంత్రులు ఎవరూ ఎందుకు చెప్పలేదు… ఖచ్చితంగా అభినందించాలని ఏమీలేదు… కానీ వీళ్లందరికీ ఎందుకు కేజ్రీవాల్ అంటరానివాడు అయ్యాడు..? తెల్లారిలేస్తే కాంగ్రెస్ ముక్త భారత్, బీజేపీ ముక్త భారత్ అని అగ్గిపెట్టి, గత్తరలేపే కేసీయార్ తను ప్రవచించే కాంగ్రెస్ ముక్త, బీజేపీ ముక్త భారతం సూత్రాల్లో కేజ్రీవాల్ ఇమడటం లేదా..?
Ads
సరే, తనకు శృతి కలవదు… కానీ పంజాబ్ వంటి రాష్ట్రంలో విజయఢంకా మోగించినందుకు కనీసం శుభాకాంక్షలు చెప్పే సంస్కారం ఏమైనట్టు వీళ్లందరికీ..? అర్జెంటుగా ప్రధాని కుర్చీపై కూర్చోవాలని తహతహలాడే మమత కూడా అంతే… ఓసారి కాంగ్రెస్‌తో కలిసి పోటీ తప్పదు అంటుంది, మరోసారి కాంగ్రెస్‌తో నో యూజ్ అని తేల్చిపారేస్తుంది, ఇంకోసారి ఈవీఎంలను తిట్టిపోస్తుంది… తనకు ఖచ్చితంగా ఏదో అయ్యింది… అవన్నీ ఎలా ఉన్నా… కేజ్రీవాల్ ఈ సోకాల్డ్ ‘‘బలమైన ప్రాంతీయ శక్తుల’’కు ఎందుకు అస్పృశ్యుడయ్యాడు…?
ఎందుకంటే… యోగీలాగే, మోడీలాగే, పట్నాయక్‌లాగే కేజ్రీ కూడా వ్యక్తిగతంగా రాజకీయ అవినీతికి దూరం… కుటుంబపాలన, నియంతృత్వం, కులవివక్ష, అబద్ధాలు వంటి పెడపోకడలకూ దూరం… అందుకే ఈ సోకాల్డ్ నాలుగో ఫ్రంటు, మూడో ఫ్రంటు, ఆల్టర్నేట్ ఫ్రంటు, ఫెడరల్ ఫ్రంటు, డెమొక్రటిక్ ఫ్రంటు వంటి ఏ టెంటులోనూ తను ఇమడడు… పైగా గోవా, పంజాబ్, ఢిల్లీల్లో ఉనికితో ఇప్పుడు తను ఓ జాతీయ పార్టీకి నాయకుడు… లెఫ్ట్ పార్టీలకన్నా చాలా బెటర్… ఈ ప్రాంతీయ పార్టీలన్నింటికన్నా బెటర్… ఇవేవీ వాటి సొంత రాష్ట్రాలు దాటి ఎదగవు…
అఫ్‌కోర్స్, ఇదే ఆప్‌కు ఈరోజు గెలిచిన సంబురం రేపు ఉండకపోవచ్చు, గెలుపూఓటములు రావచ్చు, పోవచ్చు, కానీ ఆప్ ఉంటుంది… బీజేపీతో, కాంగ్రెస్‌తో మాత్రం ఇప్పటికైతే అంటకాగదు… మరి ఆ ఏకైక సూత్రంతోనే మోడీ అధికారాన్ని ‘ఖతం’ చేస్తామంటూ పరుగులు తీస్తూ, బయల్దేరిన శక్తులు ఆప్‌ను ఎందుకు కలుపుకునే కనీస ప్రయత్నం చేయరు..? ఓ స్కూల్ డ్రాపవుట్ తేజస్వి యాదవ్‌కన్నా, ఓ రౌడీపార్టీ అఖిలేష్ యాదవ్‌కన్నా కేజ్రీవాల్ హీనమా..? రాజకీయ తెరమీద చూపించాల్సిన కనీససంస్కారం కూడా వీళ్లలో లోపిస్తే ఎలా..? యూపీలో అదే అఖిలేష్ గెలిస్తే ఇలాగే మౌనంగా ఉండేవాళ్లా..? అర్జెంటుగా లక్నోలో ఓ వంద హోర్డింగులు పెట్టేవాళ్లేమో…
స్టాలిన్, జగన్, కేసీయార్, ఠాక్రే, మమత… వీళ్లందరికీ సిద్ధాంతకర్త ప్రశాంత్ కిషోర్… అఫ్‌కోర్స్, ఈ దేశాన్ని తక్షణం ఉద్దరించేది నేనే అనే సోయిలో బతికే ప్రశాంత్ కిషోర్ సంస్కారం ఎక్కడ పోయింది..? Why Kejriwal is Untouchable..? ఓ మిత్రుడు చెప్పినట్టు… కేసీయార్ ఇకపై ‘‘కాంగ్రెస్ ముక్త, బీజేపీ ముక్త, ఆప్ ముక్త భారత్’’ అని నినాదాలు చేయాలేమో… అఫ్‌కోర్స్, ప్రస్తుతం అన్ని ఆవేశాలకు స్వస్తి… ఆరోగ్యం బాగాలేదు… లేదు…!!
Share this Article