పర్సులు గుల్ల చేసుకుని, థియేటర్లకు వెళ్లి, సినిమా చూసే ఆసక్తి లేనివాళ్లు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో పుష్ప సినిమాను చూడటానికి నిన్న, మొన్న ఎగబడ్డారు… అచ్చంగా సినిమా అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో… ఇరగ్గొట్టేశాడు… అనేక పాత్రలు వస్తుంటయ్, పోతుంటయ్… ఇక ఏపాత్రకూ ఏమాత్రం ప్రయారిటీ ఉండదు… రావురమేష్, అనసూయ, సునీల్ తదితరులు కూడా..! సినిమా చూస్తుంటే సునీల్ మీద జాలేస్తుంది… ఆ మంగళం సీను పాత్ర మీద కాదు, సునీల్ అనే నటుడి మీద..!! అయిపోయింది… ఎవరైనా చిన్న నిర్మాతలకు సునీల్‌ను తీసుకుని, హీరోగా సినిమా చేస్తే బాగుండు అని ఉండి ఉంటే, ఇక ఆ అవకాశాలూ ఆరిపోయినట్టే… ఎందుకు..?
ఈరోజుకూ టీవీల్లో పాత కామెడీ బిట్స్ వస్తుంటే, వాటిల్లో సునీల్ కామెడీ చూస్తుంటే ఆహ్లాదంగా ఉంటుంది… తన టైమింగ్, డైలాగ్ డెలివరీ తీరు అలాంటిది… కానీ హీరో కావాలనే బలమైన కోరిక… తప్పులేదు, లేనిది ఎవరికి..? డాన్సులు చేయగలడు, నటించగలడు, కానీ బరువొక్కటే అడ్డంకి… ఎవరు తప్పు సలహా ఇచ్చారో గానీ ‘బరువు కత్తిరించుకునే’ చికిత్సలకు వెళ్లాడు… తగ్గాడు… రాజమౌళి మర్యాదరామన్న సహా పలు సినిమాలు చేశాడు… కానీ కథల ఎంపికలో పొరపాట్లతో క్రమేపీ పరాజయాల బాటపట్టాడు… చాన్సులు మళ్లీ ఇచ్చినవాళ్లు లేరు… తప్పు తెలిసి, తప్పనిసరై కేరక్టర్ ఆర్టిస్టుగా మారిపోయాడు…
ప్చ్, కథ మారడం లేదు… ఇప్పుడు పుష్పలోని బోలెడు మంది విలన్లలో తను ఒక విలన్… కొన్ని సీన్లు… ఆ లుక్కు కూడా విలనీకి తగినట్టుగా ఉందనేది తప్పుడు భావన… దర్శకుడు సుకుమార్ సునీల్‌కు తీవ్ర నష్టం చేకూర్చినట్టే… సునీల్ ఆ పాత్రను ఎంచుకోవడం కూడా స్వీయతప్పిదమే… ఇవ్వాళ్రేపు స్మార్ట్ విలన్లు అనే కాన్సెప్ట్ నడుస్తుందనే సోయి సునీల్‌కు లోపించినట్టుంది… కొన్ని సీన్లలో సునీల్‌ను చూస్తుంటే అందుకే జాలేసింది… ఊడిపోయిన జుత్తు, సగం కట్టయిపోయిన శోభన్‌బాబు రింగు, బండ పెదాలు, మొహమంతా పొక్కిలి గుంటలు, పైగా ఓ పొడుగు చెడ్డీ తొడిగి ఒకటీరెండు సీన్లలో అర్ధనగ్నంగా చూపించారు… ఆ బాడీ ఎప్పుడో అదుపు తప్పిపోయింది… నిజానికి ‘‘బరువు కట్టింగ్’’ చేయించుకునేవాళ్లు జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాలి, లేకపోతే బాడీ షేపులే మారిపోతయ్, సునీల్‌ను చూస్తే అదే గుర్తొచ్చింది…
Ads
పోనీ, ఆ పాత్ర తన కెరీర్‌కు ఏమైనా ఉపయోగమా అంటే అదీ కాదు… ఓ బడా డాన్ అన్నట్టుగా బిల్డప్ ఇచ్చినా ఆ రేంజ్ సీన్లు లేవు… చివరకు ఎప్పుడూ పాన్ నములుతూ, కంపెనీ ఓనర్‌లా కనిపించే అనసూయ కూడా హఠాత్తుగా నోట్లో నుంచి రేజర్ బ్లేడ్స్ ఆడిస్తూ ఈ విలన్ మీద పడి కట్ చేస్తుంది… విచిత్రమైన కేరక్టరైజేషన్లు… సుకుమార్ గతంలో ఎప్పుడైనా తెలుగు టీవీ సీరియళ్లను కూడా డైరెక్ట్ చేసి ఉంటాడని డౌట్… వాట్ నెక్స్ట్ సునీల్..? చిన్నాచితకా దొరికిన పాత్రలతో, అంటే ఏ పాత్ర దొరికితే ఆ పాత్రలతో ఇక కెరీర్ కథ నడిపించేయడమేనా..? అంతేనా..? సరే, నీ ఇష్టంలే గానీ ఓ సూచన… సీనియర్ నరేష్ సెకండ్ ఇన్నింగ్స్ చూస్తుంటావు కదా… భలే పాత్రలు పట్టుకుంటున్నాడు, వాటిని ఆవాహన చేసుకుంటూ భలే ఆకట్టుకుంటున్నాడు… మరోసారి సీరియస్‌గా గమనించు..!!
Share this Article