అవి గోవా మాజీ ముఖ్యమంత్రి, మాజీ రక్షణ మంత్రి మనోహర్ పర్రీకర్ మరణించినప్పటి రోజులు… తన నిజాయితీ, తన నిరాడంబరత, తన నాయకత్వ లక్షణాలు, స్థూలంగా పర్రీకర్ అంటే అభిమానించనివాళ్లు లేరు… గోవాలో అయితే మతానికి, కులానికి అతీతంగా తన పట్ల విశేషమైన ఆదరణ ఉండేది… గ్రేట్ పర్సనాలిటీ… తను మరణించిన తరువాత ఓ విలేకరి పర్రీకర్ కొడుకు ఉత్పల్‌ను అడిగాడు… ‘‘మీరేనా పర్రీకర్ రాజకీయ వారసులు..?’’ ఇదీ సూటి ప్రశ్న… నిజానికి పర్రీకర్ తను బతికినన్నిరోజులూ కొడుకులిద్దరినీ రాజకీయాలకు దూరంగానే ఉంచాడు…
జనంతో కనెక్ట్ కావాలి, జనంలో ఉండాలి, ఫలితాన్ని ఆశించకుండా రాజకీయాల్లో వర్క్ కొనసాగించాలి, లేదంటే వాటికి దూరంగా ఉండాలి, ఇదీ పర్రీకర్ చెప్పింది, తను నమ్మింది, తను ఆచరించి చూపింది… ఉత్పల్ కూడా ఆ ప్రశ్న అడిగిన విలేకరికి చెప్పాడిలా… ‘‘రాజకీయపరమైన పోస్టుల్ని కష్టపడి సంపాదించుకోవాలే తప్ప అవి రాజకీయ వారసత్వం కారాదు…’’ అలాంటి ఉత్పల్ ఇప్పుడు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు… పర్రీకర్ జీవితమంతా ఆచరించింది వేరు, కొడుకు ఉత్పల్ దానికి పూర్తి కంట్రాస్టుగా ఉన్నాడు…
పర్రీకర్‌కు ఇద్దరు కొడుకులు, ఒకరు ఉత్పల్, మరొకరు అభిజిత్… ఉత్పల్‌కు రాజకీయ లక్ష్యాలున్నయ్… కానీ జనంలోకి వెళ్లడు… కనెక్ట్ కాలేడు… తను మిచిగాన్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేట్… భార్య పేరు ఉమా సర్దేశాయ్… ఆమె కాలిఫోర్నియా యూనివర్శిటీ గ్రాడ్యుయేట్… ఇక అభిజిత్ స్వతహాగా వ్యాపారి… భార్య పేరు సాయి… చిన్నప్పటి దోస్త్, ఆమె ఫార్మసిస్ట్… ఇద్దరు కొడుకులవీ ప్రేమ వివాహాలే… పర్రీకర్ చిన్న అభ్యంతరం కూడా వ్యక్తీకరించలేదు, అక్షింతలు వేసి ఆశీర్వదించాడు… పోతూ పోతూ ఆరు కోట్ల వారసత్వ సంపదను కూడా ఇచ్చాడు, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ…
Ads
వీళ్లది సారస్వత్ కమ్యూనిటీ… (కొంకణి బ్రాహ్మలు)… బ్రాహ్మణుల్లోనే ఉపకులం… గోవాలో వీళ్లది ప్రభావశీలమైన సామాజికవర్గం… పర్రీకర్ కుటుంబానికి గనుక ఈసారి టికెట్టు ఇవ్వకపోతే వాళ్లకు కోపం వస్తుంది కాబట్టి ఉత్పల్‌కు టికెట్టు ఇవ్వాలని ఓ వాదన… కానీ తను టికెట్టు కోరుతున్న పనాజీలో ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే… పేరు బాబుష్ మాన్సరేట్… కాంగ్రెస్ నుంచి తమ పార్టీలోకి వచ్చిచేరిన తనను దూరం చేసుకోలేదు బీజేపీ… పైగా ఉత్పల్‌కు ఎంతసేపూ తండ్రి వారసత్వం, ఆ పేరును వాడుకోవడం మీదే శ్రద్ధ తప్ప రాజకీయపరమైన కమిట్మెంట్, వర్క్ తక్కువ… అందుకే గోవా టికెట్ల విషయంలో నిర్ణయాత్మకంగా ఉన్న మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఉత్పల్ పట్ల విముఖంగా ఉన్నారు… బీజేపీ మొదటి లిస్టులో తన పేరు లేదు… హైకమాండ్ వేరే ఆల్టర్నేట్స్ చూస్తుందని ప్రమోద్ సావంత్ చెబుతూనే ఉన్నాడు…
కానీ… ఉత్పల్ అడమెంటుగా వ్యవహరిస్తున్నాడు… పనాజీ సీటే కావాలంటున్నాడు… ఎందుకు ఉత్పల్ పట్టుదలగా ఉన్నాడు…? అటు శివసేన-ఎన్సీపీ కూటమి, ఇటు ఆప్… బీజేపీ కాదంటే మేం టికెట్టు ఇస్తామంటూ ముందుకొస్తున్నయ్… తన మీద ప్రేమ కాదు, బీజేపీని ఇరుకునపెట్టడం కోసం… గెలిస్తే ఉంటాడు, ఓడిపోతే తన్ని తరిమేస్తారు… ఆ పార్టీలకు పోయిందేముంది..? వాడుకోవడానికి రెడీ… మీ కులానికి ప్రయారిటీ ఇచ్చాం అని సారస్వత్ కులంలో ప్రచారం కూడా చేసుకుంటారు… ఎవడి రాజకీయం వాడిది… పావుగా వాడుకోబడేది ఉత్పల్…!! లేటుగానైనా ఈ సోయి కలిగినట్టుంది, అందుకే ఏ పార్టీ టికెట్టుపై గాకుండా ఇండిపెండెంటుగా చేస్తాను అంటున్నాడు, బీజేపీకి రాజీనామా చేశాడు… నామీద ప్రేమ ఉంటే ఇప్పుడు సపోర్ట్ చేయండి అని బాల్ వాళ్ల కోర్టుల్లోకే తోసేశాడు…!!
Share this Article