Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అక్కడ ఈటల రాజేందర్ మరో సువేందు అధికారి అవుతాడా..?

November 10, 2023 by M S R

శీర్షిక చూసి… ఎవరు ఆ సువేందు అధికారి..? ఏమా కథ అనుకోకండి… సువేందు అధికారి పశ్చిమబెంగాల్ నాాయకుడు… మొదట్లో కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రస్థానం ఆరంభించినా తరువాత తృణమూల్ కాంగ్రెస్‌లో చేరాడు… ఎమ్మెల్యే, తరువాత మంత్రి… ఆ తరువాత బీజేపీ అధికారంలోకి వస్తుందని భ్రమపడి, బీజేపీలో చేరాడు… మమతను బీజేపీ అధికారం నుంచి కొట్టలేకపోయింది కానీ సువేందు మాత్రం  ఏకంగా మమత బెనర్జీనే ఓడించాడు… దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించాడు… ప్రస్తుతం బెంగాల్ ప్రతిపక్ష నేత ఆయన…

మరి ఆయనకు ఈటలతో ఏం పోలిక..? ఉంది, చర్చల్లోకి వస్తోంది… ఓ మిత్రుడి వ్యాఖ్య ఏమిటంటే… ‘‘తెలంగాణ రాజకీయాల్లో మరో సువేందు అధికారి కనిపించే చాన్స్ ఉంది’’ అని..! అక్కడ మమత ప్లేసులో ఇక్కడ కేసీయార్… తను పోటీచేసేది రెండు స్థానాలు గజ్వెల్, కామారెడ్డి… గజ్వెల్ తన ఒరిజినల్ సీట్… కామారెడ్డి కూడా పోటీచేస్తున్నాడు… గజ్వెల్‌లో గెలుపు మీద సందేహమేనా..? అక్కడ ఫీల్డ్ సర్వేలకు వెళ్లివచ్చినవాళ్లు చెప్పేది మాత్రం అదే…

అక్కడ కేసీయార్ మీద పోటీచేస్తున్నది ఈటల… తను కేసీయార్‌ను ఓడించబోతున్నాడా..? అంటే మరో సువేందు అధికారి కాబోతున్నాడా అనేది చర్చ… ఏమో… గజ్వెల్‌లో కేసీయార్ మీద వ్యతిరేకత కనిపిస్తున్నదంటే ఆశ్చర్యమే… తన సొంత స్థానం కాబట్టి ఎక్కడా లేనన్ని నిధులు ఇచ్చాడు… గజ్వెల్ రూపురేఖలే మారిపోయాయి… రాజీవ్ రహదారి పక్కనే కావడం, హైదరాబాద్‌కు దగ్గరలో ఉండటంతో రియల్ ఎస్టేట్ హవా కూడా విపరీతం…

ఐనా సరే, వ్యతిరేకత ఏమిటి అనేదే ఆశ్చర్యం… ఓడిపోయేంత వ్యతిరేకత ఉందా అనే విస్మయం… వోటరు నాడిని చెప్పలేం కదా… అక్కడ ముదిరాజ్ వోట్లు ఎక్కువ… ఈటల సామాజికవర్గం అదే… పైగా ఒక కసితో అక్కడ పోటీచేస్తున్నాడు… సువేందు అధికారి మమతపై పోటీచేయడం రాజకీయం… కానీ ఈటల బాధితుడు… కేసీయార్ కక్షగట్టి వేధించాడు… భూకబ్జాదారుడిగా ముద్రవేశాడు… బదనాం చేశాడు… కేసులు పెట్టాడు… అందుకే ఒక సువేందులో కనిపించని బాధతో కూడిన కోపం ఈటలలో ఉంది… ముదిరాజులను ప్రసన్నం చేసుకోవడానికి ఒక రాజేందర్, ఒక కాసాని, చివరకు బిత్తిరి సత్తి కూడా కావల్సి వచ్చాడు కేసీయార్‌కు… ఎవరికీ దొరకని దొరవారు కదా… ఇకపై నెలకోసారి వస్తానని ప్రామిస్ చేయాల్సి వచ్చింది తను…

Ads

ఈటల(ఇది అప్పట్లో ఈటల మీద కేసీయార్ క్యాంప్ ఉధృతంగా నడిపించిన వ్యతిరేక ప్రచారంలో భాగంగా నమస్తే తెలంగాణ ప్రచురించిన కార్టూన్ ఇమేజ్)

ఎస్, ఈటల గెలిస్తే తెలంగాణ రాజకీయాల్లో ఓ రికార్డు అవుతుంది… ఇప్పుడైతే ఈటల ఎడ్జ్‌లో ఉన్నాడంటున్నారు… తెలంగాణలో బీజేపీ చేజేతులా తన జోష్ చెడగొట్టుకుని చేతులు కాల్చుకుంది గానీ ఆ జోష్ కంటిన్యూ అయి ఉంటే ఈటలకు ఇంకా ఉపయోగపడేది… 15 రోజుల క్రితం వరకూ రాష్ట్రంలో ఓ ఫీలింగ్ వినిపించేది… కేసీయార్ మీద వ్యతిరేకత ఉన్నా సరే, ఎలాగోలా గెలుస్తాడు అని… తరువాత అది మారిపోయి హంగ్ అనే ప్రచారం వినిపించింది… ఇప్పుడు కాంగ్రెస్ ఎడ్జ్ స్పష్టంగా కనిపిస్తున్నదే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి… బహుశా పోలింగ్ నాటికి ఇంకా పెరగవచ్చు కూడా…

కేటీఆర్

కొన్ని తప్పులు జరిగి ఉండవచ్చు, దిద్దుకుంటాం అనే సన్నాయి నొక్కులు కేసీయార్, హరీష్, కేటీయార్‌ల నుంచి వినిపిస్తున్నాయంటేనే పరిస్థితి అర్థమవుతోంది… ప్రతిచోటా నా మొహం చూసి వోటేయండి అని కేసీయార్ అడుగుతున్నాడంటేనే సిట్టింగుల మీద వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందే అర్థం చేసుకోవచ్చు… గులుగుడు గులుగుడే, గుద్దుడు గుద్దుడే అనే మాటలూ అందుకే వస్తున్నాయి… నిజానికి బీజేపీ ఈ బీఆర్ఎస్ వ్యతిరేకతను అంచనా వేసినట్టు లేదు… లేదా కేసీయార్‌తో ఏ ‘క్విడ్ ప్రోకో’ ఒప్పందాలు ఉన్నాయో తెలియదు…

బండి సంజయ్ తొలగింపు, కేసీయార్ దోస్తుగా భావించబడే కిషన్‌రెడ్డికి పగ్గాలు, కవిత అరెస్టుకు నో… వంటివన్నీ కేసీయార్‌కు ఉపయోగపడి, బీజేపి దూకుడుని తొక్కేశాయి… అసలే అది కుంట స్థాయిలో ఉండేది… ఈ పరిణామాలతో కుంటలోకి కొత్త నీళ్లు రాలేదు, ఉన్న నీళ్లు వెళ్లిపోతున్నయ్… వెరసి బీజేపీ కుంట మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లాగా ఖాళీ… ఇప్పుడు బీజేపీ దాదాపు హోరాహోరీ బరిలో లేనట్టే… ఐనాసరే, ఈటల కేసు వేరు… దాన్ని విడిగా చూడాలి…

బీసీ సీఎం, ఆత్మగౌరవ సభ, ఎస్సీ వర్గీకరణకు సుముఖం, మంద కృష్ణకు తోడుగా నిలబడబోయే మోడీ… ఇలాంటివన్నీ అయిదారు నెలల ముందే చేసి ఉంటే బాగుండేది అనే అభిప్రాయం బీజేపీ కేడర్‌లోనే ఉంది… ఏమో, కాంగ్రెస్ వైపు మాదిగల వోట్లు మళ్లకుండా బీజేపీ కేసీయార్ కోసమే ఈ కొత్త వ్యూహాల్ని తెర మీదకు తీసుకొస్తున్నదేమోననే సందేహం కూడా చాలామందిలో ఉంది… సో, ఇన్ని సమీకరణాల నేపథ్యంలో ఈటల గెలిస్తే, కేసీయార్‌ను ఓడిస్తే… నిజంగా ఓ రికార్డే… ఓ చరిత్రే అవుతుంది… ఈటల మరో సువేందు అధికారి అవుతాడా అనే శీర్షిక అందుకే…!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions