.
అనంత శ్రీరాంలో కవిత్వం కొంతే, పైత్యం ఎంతో… ఈ మాట అనడానికి పెద్ద సందేహం అక్కర్లేదు…. రెండు నెలలు కష్టపడి, బ్రహ్మాండమైన బోలెడు అతి ఎక్కువ తాత్వికతను మాస్‌ను మేళవించి, రంగరించి మరీ రై రై అని రాశాడని చెప్పుకున్న ఆ రాయ్ రాయ్ పాట లిరిక్స్ చదివితే చాలు…
అదేదో పెద్ది అనే సినిమా వస్తోంది కదా రాంచరణ్‌ది… దానికి రెహమాన్ సంగీత దర్శకుడట… ఎవరో కంపోజ్ చేసి ఉంటారు, తన బ్రాండ్ పేరుతోనే కదా రిలీజయ్యేది… ట్యూన్ ఏదో బాగున్నట్టే ఉంది కానీ… ప్రాస కోసం అనంతుడు పడిన కష్టం నవ్వు పుట్టించింది…
‘‘నేనూ బుచ్చిబాబు (సినిమా దర్శకుడు) చాలా రాత్రులు రింగ్ రోడ్ మీద ప్రయాణం చేస్తూ కాఫీ షాపులలో కూర్చుని చర్చించాం… రెండు నెలల మథనం తరువాత ఈ పాట పుట్టింది… నేటి తరంతో పాటు భవిష్యత్ తరానికి గొప్ప సందేశాన్ని ఇచ్చే మాస్ పాట ఇది…. ” అంటున్నాడు తను…
Ads
ఏవో తెలుగుతనం పుష్టిగా ఉన్న పాట కదా, అందుకే కష్టపడ్డాను అన్నాడు కానీ, అది తెలుగులాగే వినిపిస్తోంది గానీ తెలుగువాళ్లకే అర్థమయ్యేట్టు లేవు కొన్ని పదాలు… సోషల్ మీడియాలో తన మీద ప్రశంసలు కూడా వస్తున్నాయట…
రాయ్ రాయ్ రా రా… రాయ్ రాయ్ రా రా… అడ్డే లేని ధారై రా రా… రాయ్ రాయ్ రా రా…
- అడ్డే లేని ధారై అన్నాడా, దారై అన్నాడా… ధార అంటే ప్రవాహం, దారి అంటే బాట… సర్లె, ఏదో ఒకటి…
హద్దే లేని తిరై రా రా, దూకేటి జోరై రా, పోరరేటి పోరై రా. నీలో ఆరు నూరై రా…
- హద్దే లేని తీరై ? ఓహో, హద్దు అంటూ లేని పోకడ, తీరు, పద్ధతి అనుకోవాలా, సరే సరే… దూకేటి జోరై అంటే దూకే వేగమా… అంటే వేగంగా దూకడమా… స్పీడ్ దూకుడా… ఇవన్నీ వోకే, పోరరేటి పోరై అంటే..? ఇది అర్థం కావాలంటే మినిమం డిగ్రీ చదివి ఉండాలి, అదీ తెలుగు సాహిత్య సృష్టిలో… నీలో ఆరు నూరై రా… ఓహో, నీలోని ఆరును నూరు చేసుకుని, అంటే అంత హెచ్చించుకుని రావాలా… సరే, వోకే…
మందళ్లొంచి వేరై రా, భయ్యం పీకి పారేయ్ రా, సిగ్గుంటే సీరై రా, జై కొట్టేటి పేరై రా…
- మందలలో నుంచి వేరుపడి, ఒంటరి రావాలా..? సరే, భయాన్ని పీకిపారేసి రావాలా..? సరే, మరి సిగ్గుంటే సీరై రా… అంటే చీరగా రావాలా..? మరిక్కడ మగమనిషి కదా ఆడ చీరగా ఎలా వస్తాడు..? లేదా చీరెయ్ రా అంటున్నావా..? జై కొట్టేటి పేరై రా… ఓహో, జైకొట్టేంత పెద్ద పేరు సంపాదించాలి రా అంటున్నావా..? చాలా మార్మిక, గాంభీర్య, లోతైన మాస్ తాత్వికత ఇదేనా మాస్టారూ..?
నీ రాక చూసి లోకం చేసే హోరై హోరై హోరై రా రా, బెరుగ్గా ఆ బెరుగ్గా, ఇరుగ్గా ఆ ఇరుగ్గా పాతేసుకో కోయలా నువ్వు నిన్నే నీ లోపల…
- నీ రాక చూసి లోకం హోరెత్తాలా, సరే… కానీ నీలో నువ్వే బెరుగ్గా, ఇరుగ్గా పాతేసుకోవడం, అదీ కోయలా అంటే..? ప్చ్, ఏదో తమిళ పాటో, కన్నడ పాటలో అర్థమయ్యీ కానట్టుగా ఉందోయ్ శ్రీరాముడూ…
హే పాతికేళ్లకే నువ్వు పాతబడిపోకురా, నిన్నటి లాగే రేపు ఉన్నదంటే ఈ రోజేం పీకావనే… నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వు ఏమి పొడిచావనే…
- పాతికేళ్లకే పాతబడిపోతే మంచిదేగా, పరిణతి వచ్చినట్టు… ముదిరిపోయినట్టు… మరి వద్దంటావేమిటి..? పాతికేళ్లు పైనబడినా ఇంకా బచ్చాగాడిలాగే ఉండమంటున్నావా..? అన్నట్టు ఈ పీకుడు భాషెలా వచ్చింది మధ్యలోకి… వెంటనే పొడుచుడు భాష… ఏమైనా అంటే, ఇదే తెలుగు భాషా ప్రాభవం అంటావేమో… (పోనీలే, మరీ పగులదె– ర్యాప్ భాషను ఎంచుకోలేదు యాటిట్యూడ్‌తో… అక్కడికి అదే ఆనందం)…
మొండెంలో తల దించేటట్టైతే… మొలతాడు ఎందుకు కట్టావ్ తెంచేసేయ్, నువ్వు మొత్తం రక్తం మార్చుకుని వచ్చేసేయ్
- మొండెంలో తల దించడంలోని కవి హృదయం అర్థం కాలేదు, కానీ దానికీ మొలతాడుకు లింక్ ఏమిటోయ్ కవివర్యా..? మొలతాడుకూ సాహసానికీ, ధీరత్వానికీ, తెలివికీ, వేగానికీ, దూకుడుకూ ఏమైన సంబంధ బాంధవ్యాలు ఉన్నాయా మనకు తెలియకుండా..?
ఆట అనుకోకోయ్, ఆటంటే బతుకోయ్, నీ ఆట బతకాలిరోయ్, మాట అనుకోకోయ్, గెలుపంటే వెలుగోయ్, గెలుపై నువ్వు వెలగాలిరోయ్
- హఠాత్తుగా రై రై ప్రాస తప్పిపోయింది ఫ్లోలో… పాటంటే మరీ ఆటయిపోయిందోయ్, పాట అనుకోకోయ్, పాటంటే వెలుగోయ్ అని ఎవరు గుర్తుచేయాలి ఈ అనంతుడికి..?
మండే గుండె నీలో లేదంటే… కాలు చేయి ఉన్నా లేనట్టే… నీకే నెగ్గే నైజం అర్థం కానట్టే.., ఈ చివరి పాదం మాత్రం పర్లేదోయ్… అన్నట్టు దీనికి అద్భుతమైన సంఖ్యలో లైకుల ప్రవాహం వస్తున్నదట కదా… నువ్వు లక్కీనోయ్ అనంత పెద్ది శ్రీరాముడూ…!!
Share this Article