.
సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఏదో ఒక అంశం ట్రెండ్ అవుతూనే ఉంటుంది. రాజకీయాల నుంచి సినిమాల వరకు, క్రీడల నుంచి వంటకాల వరకు… ప్రతి విషయంపైనా వాదోపవాదాలు జరుగుతుంటాయి. కానీ ఇటీవల ఒక సాధారణ అల్పాహారం — దక్షిణ భారతీయుల ఆత్మగా భావించే “ఇడ్లీ” — చుట్టూ మొదలైన చర్చ మాత్రం ఊహించని స్థాయికి చేరింది. కారణం? ఆ చర్చలోకి ఎంట్రీ ఇచ్చింది మాటల మాంత్రికుడు, Shashi Tharoor.
ఓ ఎక్స్ (ట్విట్టర్) యూజర్ బెంగాలీ ప్రసిద్ధ స్వీట్ “రసగుల్లా”ను ఎద్దేవా చేస్తూ… “రసగుల్లా అంటే ఇంకేమీ కాదు… చక్కెర పాకంలో ముంచిన ఇడ్లీ మాత్రమే. కానీ దీనికి అవసరానికి మించిన హైప్ ఇచ్చారు” అని పోస్ట్ చేశాడు. ఈ ఒక్క వాక్యం చాలు… సోషల్ మీడియాలో ఫుడ్ వార్ మొదలవ్వడానికి!
Ads
కొంతమంది నవ్వుకున్నారు. కొందరు రసగుల్లా అభిమానులు ఫైర్ అయ్యారు. మరికొందరు దక్షిణాది వంటకాల గౌరవం గురించి మాట్లాడారు. ఇదే సమయంలో మరో నెటిజన్ సరదాగా… “ఈ పోస్ట్ కనుక శశి థరూర్ దృష్టికి వెళితే… ఇక ఇంగ్లీష్ డిక్షనరీనే వణికించే స్థాయి ‘లింగ్విస్టిక్ అస్సాసినేషన్’ చూడొచ్చు!” అంటూ కామెంట్ చేశాడు.
నెటిజన్ల అంచనా నిజమైంది. ఆ పోస్ట్ నిజంగానే శశి థరూర్ కంటపడింది. అక్కడి నుంచే అసలు షో మొదలైంది. సాధారణంగా చాలామంది ఇలాంటి కామెంట్లకు రెండు లైన్ల సెటైర్‌తో రిప్లై ఇస్తారు. కానీ థరూర్ మాత్రం తనదైన శైలిలో… ఒక చిన్న ఫుడ్ డిబేట్‌ను తాత్విక స్థాయికి తీసుకెళ్లారు. రసగుల్లా, ఇడ్లీ మధ్య పోలికను పూర్తిగా తిరస్కరిస్తూ ఆయన రాసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
“ఒక రసగుల్లాను ఇడ్లీతో పోల్చడం అనేది కేవలం వంటకాలపై చేసిన తప్పు కాదు… అది విశ్వసృష్టి మీదున్న ఒక తీవ్రమైన అపార్థం” అంటూ ఆయన ప్రారంభించిన తీరు చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు. ఇక్కడే థరూర్ ప్రత్యేకత కనిపిస్తుంది.
సాధారణంగా “అది వేరు, ఇది వేరు” అని ముగించాల్సిన విషయాన్ని ఆయన భాషా చమత్కారంతో, శాస్త్రీయ వివరణతో, సాహిత్య శైలితో అద్భుతంగా మలిచారు. రసగుల్లా తయారీలో ఉపయోగించే “ఛేనా” (పాలు విరగ్గొట్టి తయారుచేసే పదార్థం) గురించి చెబుతూ… అది ఎంతో సున్నితమైన నిర్మాణం కలిగినదని వివరించాడు. అదే సమయంలో ఇడ్లీ పిండిని “పులియబెట్టిన బియ్యం- మినప్పప్పుల సమన్వయం”గా వర్ణిస్తూ, అది ఒక జీవరసాయన ప్రక్రియ ఫలితమని చెప్పాడు.
అక్కడితో ఆగకుండా… “రసగుల్లా అనేది చక్కెర పాకాన్ని తనలో ఇముడ్చుకునే మృదువైన నిర్మాణం. కానీ ఇడ్లీ అనేది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు కలిసిన ఆవిరి వంట కళాఖండం” అని ఆయన చెప్పిన తీరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అసలు ఇడ్లీ గురించి ఆయన చెప్పిన ఒక లైన్ అయితే దక్షిణ భారతీయులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది.
ఇడ్లీని ఆయన “culinary engineering marvel” — అంటే “వంటల ప్రపంచంలో అత్యంత గొప్ప ఇంజనీరింగ్ అద్భుతం”గా అభివర్ణించారు. నిజానికి ఆ మాటలో అతిశయోక్తి కూడా లేదు అంటున్నారు చాలామంది ఫుడ్ లవర్స్. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చూసినా…
- తక్కువ నూనెతో తయారయ్యే,
- సులభంగా జీర్ణమయ్యే,
- ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు సమతుల్యంగా ఉండే,
- ఫెర్మెంటేషన్ వల్ల ఆరోగ్యానికి మేలు చేసే
అల్పాహారాల్లో ఇడ్లీకి ప్రత్యేక స్థానం ఉంది.
అందుకే దక్షిణ భారతీయులకు ఇడ్లీ అనేది కేవలం ఒక టిఫిన్ కాదు… ఒక భావోద్వేగం. ఇక శశి థరూర్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. క్లిష్టమైన, గొట్టు ఇంగ్లీష్ పదాలను సరదాగా ఉపయోగించడం, సాధారణ విషయాన్నికూడా సాహిత్య స్థాయికి తీసుకెళ్లడం ఆయన ప్రత్యేకత. ఈసారి కూడా అదే జరిగింది.
ఒక సాధారణ ఫుడ్ మీమ్‌ను ఆయన ఒక సాంస్కృతిక చర్చగా మార్చేశారు. రసగుల్లాను అవమానించకుండా… ఇడ్లీ గౌరవాన్ని తగ్గించకుండా… రెండింటి ప్రత్యేకతను కాపాడుతూ స్పందించడం నెటిజన్లను ఆకట్టుకుంది. ఇందుకే చాలామంది ఇప్పుడు ఒకే మాట అంటున్నారు —
“శశి థరూర్ ట్వీట్ చదివితే… ఇడ్లీ కూడా ఒక ఇంటెలెక్చువల్ డిష్‌లా అనిపిస్తుంది!”

అన్నట్టు మీకు గుర్తుందా..? ఇడ్లీని శశిథరూర్ ఇలాగే వెనకేసుకొచ్చిన తీరు… అది 2020 అక్టోబర్… బ్రిటన్‌కు చెందిన ప్రొఫెసర్, చరిత్రకారుడు అయిన ఎడ్వర్డ్ ఆండర్సన్ “ఇడ్లీ అనేది ప్రపంచంలోనే అత్యంత విసుగు పుట్టించే ఆహారం” (Idli is the most boring thing in the world) అంటూ ఒక ట్వీట్ చేశాడు.
శశిథరూర్ దానిపై జరిగిన డిబేట్‌లోకి తనదైన శైలిలో ఎంటరయ్యాడు… అసలే తను కదిలే డిక్షనరీ కదా… అద్భుతమైన ఇంగ్లీష్ పదజాలంతో ఆ ప్రొఫెసర్‌కు గట్టి కౌంటర్ ఇచ్చాడు…
“నిజ జీవితంలో ఎదురయ్యే కొన్ని సవాళ్లను అర్థం చేసుకోవడానికి కొందరికి మేధస్సు చాలదు నాయనా. నాగరికతకు పరాకాష్ట అయిన ఇడ్లీని కించపరచడం అంటే… రుచి లేని ప్రపంచంలో శూన్యతను ఆస్వాదించడమే. ఉదయాన్నే చట్నీ, సాంబార్‌తో కలిపి తినే వేడివేడి ఇడ్లీ విశిష్టతను అర్థం చేసుకోవడం అందరి వల్ల కాదు!”
(అసలు ట్వీట్‌లో ఆయన ‘Civilisation’s pinnacle’, ‘incomprehension of worldly gifts’ లాంటి భారీ ఇంగ్లీష్ పదాలను ఉపయోగించి ఇడ్లీ గొప్పతనాన్ని వర్ణించాడు).
ఆ ప్రొఫెసర్ వెనక్కి తగ్గాడు… తర్వాతి రోజే ఒక సౌత్ ఇండియన్ రెస్టారెంట్‌కు వెళ్లి, ఇడ్లీ ఆర్డర్ చేసి తింటున్న ఫోటోను షేర్ చేశాడు…
-
“నాకు ఇడ్లీ నచ్చకపోవచ్చు, కానీ దాన్ని తయారు చేసే విధానం, దాని వెనుక ఉన్న సంస్కృతి గొప్పది” అని ఒప్పుకుంటూ, మళ్లీ ఎప్పుడూ ఇడ్లీ జోలికి వెళ్లనంటూ సరదాగా లెంపలేసుకున్నాడు…
Share this Article