Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిర్మాతలు, హీరోలు దర్శకుల్ని పేద్ద కాక్రోచ్‌లను చేస్తే… ‘పెద్ది’లు పుడతారు…

June 7, 2026 by M S R

.

Gurram Seetaramulu …. వర్తమాన క్రీడారంగం ఆధునిక మహాభారతం. ఇక్కడ లక్షలాది ద్రోణాచార్యులు కోట్లాది మంది ఏకలవ్యులు ఉన్నారు . నేర్పని విద్యకు బొటనవేలు కోసుకోవడం ప్రాచీన విద్య. విద్య పూర్వాపరాలు ఎరిగిన వర్తమాన ఏకలవ్యులు ఏటికి ఎదురీదటం నేర్చుకున్నారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారు. తమని తాము చాటింపు వేసుకుంటున్నారు.

ఇప్పుడు భారతంలో బొమ్మలు తిరగబడ్డాయి. ఆధునిక ఏకలవ్యులు ఇప్పుడు ద్రోణాచార్యున్ని ప్రశ్నిస్తున్నారు.
‘ ఒరే అబ్బాయీ మేము నీకు ఎందుకు బొటనవేలు ఇవ్వాలిరా ?  మా తాతలు ముత్తాతలు ఈ భూమికి మూలవాసులు, విలు విద్య మేము ఒకరిదగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు, బహుశా ఈ అడవిలో మీ పూర్వీకులే (ద్రోణాచార్య) మా దగ్గర విలువిద్య నేర్చుకుని ఉంటారు. ఇక బొటనవేలు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటోంది వర్తమాన చైతన్యం.

Ads

కానీ తెలుగు సినిమా బొటన వేలే కాదు అడిగినా అడగకున్నా తొడ కాదు మెడ అయినా కోసుకుంటాం అంటున్నారు. సానా బుచ్చిబాబు ‘పెద్ది’ సినిమా చూశాక ఆధునిక ద్రోణులు బుచ్చిబాబు రూపంలో ఉంటారులే అనిపించింది. ఈ బుచ్చిబాబు నాలుగేళ్ల కింద ‘ఉప్పెన’ అనే సినిమా తీశాడు.

హిల్లరీ జోర్డాన్ అనే అమెరికా అమ్మాయి కొలంబియాలో సృజనాత్మక సాహిత్యం చదువుకొని నేటికి సరిగ్గా పదిహేడు ఏళ్ళ కింద ‘మడ్ బాండ్’ అనే నవల రాసుకుంది. డెబ్బై ఎనభై ఏళ్ళ కింద మిస్సిసిపి డెల్టా పత్తి క్షేత్రంలో అమానవీయమైన జాతివివక్ష నేపథ్యం లో రెండు విభిన్నమైన జాతుల మధ్య జరిగిన ఒక అంతర్యుద్దం కథ. ఈ కథను చక్కగా కాపీ కొట్టాడు . ఆ కథ ‘మడ్ బాండ్’ పేరుతో Netflix లో చూడొచ్చు.

ఇక పోతే పెద్ది సినిమా కథ మంచిదే, నటుడు సమర్ధుడు. ఆ సమర్ధతను మరింత పెద్దగా తీయాలి అనే ఆశ పెద్దిని వెన్నెముక లేని కథగా మార్చింది. కధనం పరమ జుగుప్స . అన్నిటికన్నా హీరోయిన్ అనేవాళ్లూ వాళ్ళు వీళ్ళకు ఆటబొమ్మలు. తెలుగు సమాజం ఆట కూలీని సహిస్తదేమో గానీ ఆడపిల్లను ఆట బొమ్మగా చూపడం తప్పు అనే మాట అనలేక పోతోంది. పాపం శ్రీదేవి బిడ్డ.

ఇక కథలోకి వెళితే ఒక్కటే నాకు నచ్చిన అంశం, కొండ జనాలకీ (అ)నాగరిక జనాలకీ మధ్య అగాథంలా పేరుకుని పోయిన దూరాన్ని తగ్గించడం, దానికోసం శ్రీకాకుళ పోరాట అప్పలస్వామి అవసరం వచ్చింది. కానీ వూరు ఉనికీ అస్తిత్వం లేని ఆ కొండ జనాల దగ్గర ఓటు కోసం వచ్చిన కథ, అదే జనం తమకు కనీస గుర్తింపు కార్డు లేదు అని పోరాడడం, ఈ రెండు వైరుధ్యాలు మోకాలిలో మెదడు ఉన్న సానా బుచ్చిబాబు ఒక్కడే తియ్యగలడు, తెలుగు అలగా జనం మాత్రమే చూడగలరు.

దేశానికి నాగరిక సమాజానికి దూరంగా బ్రతుకుతున్న ఒక కూలీ కొండ నా కొడుకు తన ఉనికి అస్తిత్వం కాపాడుకోవడం కోసం తనకు వచ్చిన అన్ని ఆటలూ ఆడేసి మన అందరికీ మిక్సర్ పొట్లం అందించాడు. ఆట ద్వారానే తనకొక అస్తిత్వం ఉంది అనే ఎరుక కలిగాక మర మనిషిలా అన్ని ఆటలూ ఆడడం మొదలు పెట్టి. చివరికి తానే ఒక వికలాంగుడిగా అవతారం ఎత్తి పారా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలిచాడు. ఈ కథను ఒలింపిక్ పానెల్ లో ఉన్నవాడికే చెప్పి అందరినీ ఫూల్స్ ని చేశాడు.

ఒక పల్లెటూరి వాడు ఒలింపిక్ సెలెక్షన్ బోర్డ్ మెంబర్ కి ఒలింపిక్స్ లో పథకం పొందిన వాడి గురించి చెప్పడం అంతా కామెడీ ఇంకొకటి లేదు. ఇలాంటి అసత్యాలు, అబద్దాలు కేవలం తెలుగు తెర మీదనే చూడగలం. దానికి కారణం తెలుగు సినిమా దర్శకులను నిర్మాతలు, హీరోలు శాసిస్తున్నారు. వాళ్ళను వెన్నెముక లేని బొద్దింకలలాగా తయారు చేశారు.

ఒక కల్పిత గాథను సృష్టించి, ఒక కృత్రిమ ఒలింపిక్ సంఘాన్ని పెట్టి, వాడికి తెలియకుండానే ఒలింపిక్ పథకం ఎలా పొందాడో చెప్పడం చూస్తే… చూసేవాడు అయినా తీసిన వాడు అయినా ప్రేక్షకులను వెర్రి పుష్పాలను చేయడమే దర్శకుడి ప్రతిభ.

ఇంతకూ పెద్ది అనే క్రీడాకారుడు కులం మూలంగా లేదా ప్రాంతం మూలంగా లేదా ఆర్ధిక వెనకబాటు తనం మూలంగా వెనకబడ్డాడా అని చెప్పే సాహసం చేయలేక పోయాడు. ఎందుకంటే తెలుగు తెరకు కులం అంటరానిది. అది కొన్ని ఉద్దారక కులాలకు మాత్రమే అంటదగినది.

అసలు కథ ఏమిటి కథకు అనుగుణంగా హీరో ఎలా ఉండాలి అనే చర్చ ఇక్కడ ఉండదు. మా హీరో అవతార పురుషుడు, వెయ్యిమందిని ఒక్క కత్తి వేటుతో నరకగలడు అనిచెప్పడమే . పచ్చిగా మాట్లాడుకుంటే ఏపాటి అవగాహన లేని మనుషులు దర్శకులుగా తెలుగు తెరను యేలుతున్నారు.

వాళ్ళకు కొద్దిపాటి కాల స్పృహ ఉండదు. భూత, వర్తమానాలు కలిపి భవిష్యత్తులో కాకటైల్ లాగా తాగగలరు. మార్లిన్ మన్రోను జబర్దస్త్ షకలక శంకర్ తో రొమాన్స్ చేపించగల తెంపరితనం తెలుగు తెర మీదనే చూడగలం.

తెలుగు సినిమా కు కొత్తగా జాతి, సనాతన ధర్మం అంటుకుంది. ఇక ఆరు పూలు అరవై ఆరు గెటప్ లతో వర్దిల్లే కాలం దరిదాపులోనే ఉంది కాబట్టి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అందాకా పెద్ది సినిమాకు వచ్చిన ఆదాయం లెక్కలు వేసుకుందాం…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సీజేపీ ధర్నా… బొద్దింకల పేరిట ‘యాంటీ మోడీ’ సెక్షన్ హంగామా…
  • … అలా నెమ్మ‌దిగా ఇళ‌య‌రాజా అనేవాడి మీద కాస్త ఇంట్ర‌స్టు మొద‌లైంది’
  • నిర్మాతలు, హీరోలు దర్శకుల్ని పేద్ద కాక్రోచ్‌లను చేస్తే… ‘పెద్ది’లు పుడతారు…
  • రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌పై కాక్రోచ్ మీడియా తప్పుడు వాదనలు ఇలా..!!
  • అసలు తప్పు జాన్వీదే..! ఇదే ధోరణి ఉంటే కెరీర్‌ ప్రశ్నార్థకమే..!!
  • ఏ మొహమాటాల్లేవ్… కొత్త T20 జట్టు ఎంపికపై డిఫరెంట్ రివ్యూ…
  • వాళ్లు బాల్యాన్ని అనుభవించనివ్వండర్రా… రొంపిలోకి అప్పుడే ఎందుకు..?!
  • ‘ పెద్ది సినిమా చూడకపోతే చంపుతా ఒక్కొక్కడినీ’… ఓ మానసిక వైకల్యం..!!
  • I Love Hyderabad … ఇది ప్రేమించదగిన నగరం కాబట్టి…
  • మా వాణిశ్రీని చంపేస్తాడా..? అందుకే ఈ దర్శకుడి మీద నాకెప్పుడూ కోపమే..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions