Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తప్పులు చేసి జైలుకు వెళ్లొచ్చినా… ఇంకా దిగినట్టు లేదు ఈ *విలన్‌కు..?!

October 5, 2026 by M S R

.

దేశంలో శాంతి లేదా? సంజయ్ దత్‌కు ఒక ప్రశ్న … “భారత్‌లో నాకు మునుపటిలా ప్రశాంతత అనిపించడం లేదు” అంటూ సంజయ్ దత్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శేఖర్ సుమన్ నిర్వహించే Shekhar Tonite కార్యక్రమంలో మాట్లాడిన సంజయ్ దత్.. గతంలో భారత్‌లో తాను అనుభవించినంత ప్రశాంతత ఇప్పుడు అనిపించడం లేదని అన్నారు.

భారతీయులు గొప్ప మనసున్నవారని, అతిథులను ఆదరించే స్వభావం ఉన్నవారని ప్రశంసిస్తూ, మళ్లీ ఆ నాటి రోజులు రావాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. అయితే సంజయ్ దత్ గారూ.. అసలు మీకు ఏం కావాలి? దేశంలో శాంతి లేదని మీకు ఎందుకు అనిపిస్తోంది? శాంతి లేకపోతే ఇదే దేశంలో మీరు ఇంత ధైర్యంగా సినిమాలు ఎలా చేస్తున్నారు? ఇక్కడే కోట్ల రూపాయలు ఎలా సంపాదిస్తున్నారు? ఇక్కడి ప్రజల అభిమానాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు? దేశంలో ఏం జరుగుతుందో స్పష్టంగా చెప్పకుండా “శాంతి లేదు” అని చెప్పడం వల్ల ఉపయోగం ఏమిటి? నీ తండ్రి సునీల్ దత్, నీ తల్లి నర్గీస్‌కు ఈ దేశం ఏం తక్కువ చేసింది..?

Ads

అవును.. ఈ దేశంలో సమస్యలు ఉన్నాయి. నేరాలు ఉన్నాయి, రాజకీయ విభేదాలు ఉన్నాయి, సామాజిక సమస్యలు ఉన్నాయి. ఏ దేశంలో లేనంత సమస్యలు మన దేశంలోనే ఉన్నాయని చెప్పలేం. అమెరికాలోనూ సమస్యలున్నాయి, బ్రిటన్‌లోనూ ఉన్నాయి, ఆస్ట్రేలియాలోనూ ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశం కూడా సమస్యలు లేని దేశం కాదు.

సంజయ్ దత్

ఈ మధ్య సెలబ్రిటీలకు దేశం గురించి కామెంట్ చేయడం ఒక ఫ్యాషన్ అయిపోయిందా అనే ప్రశ్న కూడా వస్తోంది. దేశం మీకు నచ్చకపోతే, ఇక్కడ ప్రశాంతత లేదనిపిస్తే ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. అక్కడికి వెళ్లి హ్యాపీగా ఉండొచ్చు. విదేశాల్లో స్థిరపడుతున్న భారతీయులు చాలామందే ఉన్నారు. కొందరు ఇతర దేశాల పౌరసత్వాలు కూడా తీసుకున్నారు. అది తప్పు అని ఎవరూ అనడం లేదు. కానీ ఒక దేశంలో ఉంటూ, అదే దేశం మీకు ఇచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ, అదే దేశంపై ఇలాంటి పెద్ద వ్యాఖ్యలు చేసేటప్పుడు దానికి కారణం కూడా చెప్పాలి.

సంజయ్ దత్ జీవితంలో కూడా ఎన్నో చూశారు. కేసులు, అరెస్టులు, జైలు జీవితం, కెరీర్‌లో ఎదురైన ఇబ్బందులు… అక్రమ ఆయుధాలు, టెర్రర్ లింక్స్… ఇవన్నీ ఆయన జీవితంలో భాగమే. ఆ రోజుల్లో ఆయన ఎంతటి బాధను అనుభవించారో అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి ఇప్పుడు “మళ్లీ ఆ నాటి రోజులు రావాలి” అంటుంటే.. అసలు ఏ రోజులు రావాలి? మీ వ్యక్తిగత జీవితంలోని పాత రోజులా? లేక దేశంలో గతంలో ఉన్న పరిస్థితులా?

దేశాన్ని విమర్శించడం తప్పు కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ఆ హక్కు ఉంది. కానీ విమర్శకు ఒక కారణం ఉండాలి. “దేశంలో శాంతి లేదు” అని చెప్పడం చాలా సులభం. కానీ ఎక్కడ శాంతి లేదు? ఎందుకు లేదు? ఏ సమస్య గురించి మాట్లాడుతున్నారు? ఏం మారాలి? ఇవి కూడా చెప్పాలి.

భారత్ పరిపూర్ణమైన దేశం కాదు. తప్పులు జరుగుతాయి. ప్రభుత్వాలను ప్రశ్నించాలి. వ్యవస్థలను ప్రశ్నించాలి. అవసరమైతే సెలబ్రిటీలు కూడా ప్రశ్నించాలి. కానీ కోట్లాది మంది ప్రజలు నివసిస్తున్న దేశాన్ని ఒక మాటలో “శాంతి లేని దేశం”గా చూపించడం మాత్రం సరైన పద్ధతి కాదు.

సంజయ్ దత్ గారూ.. మీకు నిజంగా దేశంలో ఏదైనా సమస్య కనిపిస్తే దాన్ని చెప్పండి. ఏం తప్పు జరుగుతుందో చెప్పండి. ఏం మారాలో చెప్పండి. దేశాన్ని విమర్శించడం కంటే దేశం కోసం ఏం చేయాలో చెప్పండి. అదే మీ మాటకు విలువను పెంచుతుంది.

ఎందుకంటే ఈ దేశం మీకు కూడా ఎంతో ఇచ్చింది. మీకు స్టార్‌డమ్ ఇచ్చింది. మీకు కోట్లాది అభిమానులను ఇచ్చింది. మీకు కోట్ల రూపాయలు సంపాదించే అవకాశాన్ని ఇచ్చింది. అదే దేశం గురించి మాట్లాడేటప్పుడు.. విమర్శతో పాటు బాధ్యత కూడా ఉండాలి.

కాబట్టి అసలు ప్రశ్న ఒక్కటే.. సంజయ్ దత్ గారూ, భారత్‌లో మీకు ప్రశాంతత ఎందుకు అనిపించడం లేదు? కారణం ఏంటో చెప్పండి… అశోక్ వేములపల్లి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తప్పులు చేసి జైలుకు వెళ్లొచ్చినా… ఇంకా దిగినట్టు లేదు ఈ *విలన్‌కు..?!
  • అది చదివితే ‘కాశీయాత్ర’ చేసినంత పుణ్యం- జ్ఞానం- విలువ !!
  • ఉత్త స్క్రాప్! ఈ సంతను యాణ్నుంచి పట్టుకొచ్చావురా బిగ్‌బాస్..!
  • సింగీతంకు తెలుగు సమాజం నుంచి సముచిత గౌరవం దక్కిందా?!
  • అక్షరధామ్! స్వామి నారాయణుడితో నేనెందుకు కనెక్ట్ కాలేకపోయాను?!
  • అమిత్ షా పర్యటనలు రెండుసార్లు రద్దు! ఏదో అడ్డుపడుతోంది, ఏమిటది?!
  • ప్యారడైజ్ … సినిమా కాదు, బిర్యానీ కాదు… ఓ సినిమా టాకీసు !!
  • సింగీతం అంటే ఓ పేరు కాదు… తెలుగు సినిమా ప్రయోగాల జాబితా !!
  • Fly dubai – ఎన్నెన్నో కుట్ర కథనాల వ్యాప్తి ! అసలు నిజాలు ఇవీ !!
  • శాస్త్రంతోపాటే విశ్వాసం! అంతరిక్షమైనా.. ఆకాశమైనా.. భగవన్నామ స్మరణే!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions