Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అక్షరధామ్! స్వామి నారాయణుడితో నేనెందుకు కనెక్ట్ కాలేకపోయాను?!

October 4, 2026 by M S R

.

అనేక దేశాల్లో అబ్బురపడే వాస్తుశిల్పంతో అక్షరధామ్ గుళ్లున్నాయి… ప్రపంచవ్యాప్తంగా హిందూమతస్థులకు అవి ‘లైట్‌హౌజులు’ అనీ చెబుతుంటారు… పదేళ్లు, వందల మంది రాజస్థానీ శిల్పులు అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో చెక్కిన పాలరాతి బొమ్మలు, ఆ భారీ వెలుతురు చమక్కుల న్యూజెర్సీ అక్షరధామ్ గుడి నిజంగానే కన్నులపండువ… కానీ ఎందుకు కనెక్ట్ కాలేకపోయాను..?

ఆర్జిత సేవల వ్యాపారాలు, ప్రత్యేక దర్శనాల దోపిడీలు, ప్రసాదాల విక్రయాలు వంటి ఏ దుర్వాసనలూ లేవు… బాగుంది… వేల కోట్ల విరాళాలు కదా, శుభ్రంగా మెయింటెయిన్ చేస్తున్నారు… (ఇక్కడ కేవలం దర్శనమే, మరే అర్చన ఉండదు…) ఫోటోలు, వీడియోలు, ఫోజులు… ఓ టూరిస్ట్ పాయింట్‌గా తప్ప ఓ స్పిరిట్యుయల్ సెంటర్ అనిపించుకోలేకపోతోంది ఎందుకు..?

Ads

మన అణువంత ఆధ్యాత్మిక జ్ఞానం సరైన అవగాహనను కల్పించలేకపోవచ్చు, సోకాల్డ్ తెలుగు ప్రవచనకారులకూ ఇది చెప్పదగిన విశేషంగా అనిపించకపోవచ్చు… కానీ ఓ సగటు విశ్వాసిగా, హిందూ భక్తుడిగా… ఆ అపురూపం నాలో ఏమాత్రం ఆధ్యాత్మిక కంపనల్ని ఎందుకు క్రియేట్ చేయలేకపోయింది..? స్పిరిట్యుయల్ వైబ్స్‌కు అడ్డుపడిన నా మీమాంస ఏమిటి..?

ఈమధ్య ఈఫిల్ టవర్- బీఏపీఎస్ సాధకులు- మహిళలకు ఆంక్షలు వివాదం ప్రపంచవ్యాప్తంగా చర్చను రేకెత్తించింది కదా… అందుకని తొలిసారి ఓ అక్షరధామ్ గుడిని సందర్శించడానికి, తెలుసుకోవడానికి ఓ ఆసక్తి కలిగించింది… అక్కడ ఆ గర్భగుడిలో స్వామి నారాయణుడు… మిగతా సంప్రదాయ దేవుళ్లు రామ, కృష్ణ, శివ, వెంకటేశ్వరులు పూర్తిగా సైడ్ లైన్ చేయబడ్డారు… స్వామి నారాయణ (బీఏపీఎస్) పరంపరలోని వారస గురువుల బొమ్మలతో సమానంగా…

అక్షరధామ్

మనం ఆది దేవుళ్లుగా పూజించే దేవుళ్లను మించిన దేవుడా స్వామి నారాయణుడు..? ఇక్కడ అసలు ఆదిశక్తి స్వరూపం, ప్రస్తావన కూడా లేదు… అదెలా సాధ్యం..? గురువు వేరు… తను ఆధ్యాత్మిక బోధలతో మనల్ని ధార్మికమార్గంలో ఉంచడానికి ప్రయత్నిస్తాడు… గురుదేవోభవ… అంతే తప్ప, గురువు పరమాత్మ కాదు, పరబ్రహ్మ అసలే కాడు…

ఆది శంకరాచార్యుల దగ్గర నుంచి చిన్నాచితకా బాబాల దాకా… జస్ట్, గురువులే… వాళ్లు ఏర్పాటు చేసుకున్న భక్తిమార్గం, ఆ పరంపర, ఆ ఆశ్రమాలు, ఆ భక్తితత్వాలు వేర్వేరు అయినా సరే, స్థూలంగా మన ఆదిదేవుళ్లను పూజింపచేసేవే… మరేమిటి ఇక్కడ గురువే దేవుడయ్యాడు..? కాదు, ఆదిదేవుళ్లను ‘మించిన’ ఉన్నత దేవుడయ్యాడెలా..?

అక్కడ స్పష్టంగానే చెప్పబడుతోంది… స్వామి నారాయణుడు సుప్రీంగాడ్ అని… పరబ్రహ్మ అని… ఇదేదో బ్రహ్మపదార్థంగా తోచింది, కాదు, పరబ్రహ్మపదార్థంగా తోచింది… కావచ్చు, బహుశా మనలో జీర్ణించుకున్న ‘దేవుళ్ల భావన’లకు ఈ స్వామి నారాయణ పరబ్రహ్మ తత్వం హఠాత్తుగా జీర్ణం కాకపోవడమే నన్ను గుడితో కనెక్ట్ చేయలేదేమో…

విష్ణువు అవతారాలున్నాయి… అవి అవసరార్థం మనిషిగా పుట్టినవి… స్వామి నారాయణుడు ఏ అవతారమూ కాదు… ఒక గురుపరంపర వేరు, ఒక భక్తిమార్గం వేరు, ఒక ఆధ్యాత్మిక తత్వం వేరు… ద్వైతమో, అద్వైతమో, విశిష్ట అద్వైతమో… రకరకాల తత్వాలు… స్థూలంగా, అంతిమంగా హిందూ మతమార్గమే… కానీ ఇక్కడ ఆదిదేవుళ్లు అప్రధాన విగ్రహాలైపోయి, వాళ్లను మించి ఒక మనిషి (?) పరబ్రహ్మస్వరూపుడిగా కొలువు దీరడం వెనుక సరైన, కన్విన్సింగ్ వాదనలు బహుశా నేను చదివి ఉండకపోవడం వల్ల ఈ మీమాంస తొలుస్తూ ఉన్నదేమో…

అక్షరధామ్

సరే… ఓ నాస్తికుడంటాడు… దేవుడు, మనిషి ఇద్దరూ ఎదురైతే… ఆహా నా సృష్టి ఎంత బాగుంది అనుకుంటారట ఇద్దరూ…!  మనిషి మరో మనిషిని దేవుడిని చేయడం చూస్తున్నదే… ఒక షిర్డి సాయిబాబా కావచ్చు, తనకు పేరడీ పుట్టపర్తి కావచ్చు… మరొకరు కావచ్చు… దేవుళ్లయిపోయారు… ఆ విశ్వాసుల మాటెలా ఉన్నా… వాళ్లు ఆదిదేవుళ్లను మించిన దేవుళ్లు మాత్రం కాలేదు… థాంక్ గాడ్… (ఇక్కడ సబ్‌కా మాలిక్ ఏక్ అనే సాయి నినాదం గురించి చర్చించదలుచుకోలేదు…)

గుడి నిర్మాణం గురించి 8 నిమిషాల వీడియో అక్కడ ప్రదర్శిస్తున్నారు, గుడి నిర్మాణంలో పాలుపంచుకున్న నిపుణుల ఫోటోలు కూడా ప్రముఖంగా ఉన్నాయి, కానీ స్వామి నారాయణ ‘భిన్న పరబ్రహ్మ తత్వం’ నేరుగా, అర్థమయ్యేలా చెప్పే ఏ ఏర్పాటూ లేదు…

నిజానికి… ఇది కేవలం ఒక వ్యక్తిని దేవుడిగా మార్చిన వ్యవహారం కాదు… Swaminarayan సంప్రదాయం తనకు ప్రత్యేకమైన వేదాంత-తాత్విక నిర్మాణం ఏర్పరచుకుంది… ఈ సంప్రదాయంలోని Akshar-Purushottam Darshan ప్రకారం, Purushottama అంటే సర్వోన్నత పరబ్రహ్మ. స్వామినారాయణుడినే ఆ పరబ్రహ్మ, పురుషోత్తముడిగా వారు గుర్తిస్తారు… వారి తాత్విక క్రమంలో స్వామినారాయణుడిది అత్యున్నత స్థానం…

అక్కడ వాస్తుశిల్పం మాత్రమే కాదు, ఒక theological statement కూడా నిర్మించబడి ఉంటుంది. “ఇక్కడికి వచ్చిన భక్తుడు ఈ వ్యక్తిని కేవలం గురువుగా చూడకూడదు; సర్వోన్నత దైవంగా దర్శించాలి” అన్న భావనను ఆలయ నిర్మాణం, విగ్రహ స్థానం, పూజా విధానం అన్నీ కలసి వ్యక్తం చేస్తాయి…

సనాతన హిందూ తత్వంలోని అన్ని సంప్రదాయాలకు ఒకే సమాధానం లేదు. అద్వైతం చెబుతుంది—చివరికి జీవాత్మ, బ్రహ్మం మధ్య ద్వైతం లేదు. ద్వైతం చెబుతుంది—జీవుడు, పరమాత్మ శాశ్వతంగా వేరు. విశిష్టాద్వైతం జీవుడు పరమాత్మతో ప్రత్యేకమైన సంబంధంలో ఉన్నాడని చెబుతుంది. భక్తి సంప్రదాయాలు తమ తమ ఇష్టదైవాన్ని పరమోన్నతంగా చూస్తాయి. ఈ స్వామినారాయణ సంప్రదాయం ఏ సంప్రదాయ హిందూ ధార్మిక, ఆధ్యాత్మిక తత్వంలోనూ ఇమడటం లేదు, ఇది పూర్తిగా ఓ డిఫరెంట్ ప్రవాహం..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అక్షరధామ్! స్వామి నారాయణుడితో నేనెందుకు కనెక్ట్ కాలేకపోయాను?!
  • అమిత్ షా పర్యటనలు రెండుసార్లు రద్దు! ఏదో అడ్డుపడుతోంది, ఏమిటది?!
  • ప్యారడైజ్ … సినిమా కాదు, బిర్యానీ కాదు… ఓ సినిమా టాకీసు !!
  • సింగీతం అంటే ఓ పేరు కాదు… తెలుగు సినిమా ప్రయోగాల జాబితా !!
  • Fly dubai – ఎన్నెన్నో కుట్ర కథనాల వ్యాప్తి ! అసలు నిజాలు ఇవీ !!
  • శాస్త్రంతోపాటే విశ్వాసం! అంతరిక్షమైనా.. ఆకాశమైనా.. భగవన్నామ స్మరణే!
  • ఈ ఉగ్ర పైలట్‌ను ఫ్లయ్ దుబాయ్ ఎందుకు నియమించింది?!
  • ఈ పార్వతి పాట… ఇప్పుడు ప్రపంచ చార్ట్‌లో నంబర్ 2 పాట !
  • విక్స్ ! దీని పుట్టుక వెనుక ఓ తండ్రి వేదన- పరిశోధన !!
  • అనగనగా ఓ దొరైస్వామి అనబడు ఓ పాత నటుడి కథ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions