.
పదవిలో ఉన్న రాజకీయ నాయకుడు… 99 రోజులపాటు అధికార యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధులను తరిమి, ప్రజల ఎదుట నిలబెట్టే కార్యాచరణను సంకల్పించడంటే… అల్లాటప్పా ఆలోచన కాదు, దాని వెనుక కొన్ని నిర్దిష్ట లక్ష్యాలుంటాయి… రేవంత్ రెడ్డి వచ్చే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ముందు 99 రోజులపాటు నిర్వహించతలబెట్టిన ‘‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’’ అనే యాక్షన్ ప్లాన్ వెనుక ఆయన అసలు ఉద్దేశాలేమిటి..? పలు కోణాల్లో తనకు లభించే ఫాయిదా ఏమిటి..? ఇదీ కాస్త డిబేటబుల్…
వచ్చే సమస్య ఉన్నతాధికారులతోనే… జనానికి అర్థమయ్యేట్టు ఏదీ చెప్పరు… ఏవో పడికట్టు పదాలతో వాక్యాలు పేర్చి గందరగోళం చేస్తారు… ఆమధ్య విజన్-2047 కూడా అంతే… నిజానికి తెలంగాణ సమాజంలో బాగా చర్చనీయాంశం కావల్సిన సబ్జెక్టు అది… కానీ తూతూమంత్రంలా కానిచ్చేశారు… ఇప్పుడూ అంతే, సీఎం తలపెట్టిన ఈ 99 ప్లాన్ ఏమిటో ఎవరూ సరిగ్గా (చివరకు మీడియా కూడా) చెప్పలేని పరిస్థితి…
Ads
సరే, సరళంగా మనకు అర్థమైంది ఏమిటో చెప్పుకుందాం… కాదు, ఇది జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో లబ్ధికి, ప్రచారానికి ఉద్దేశించిన రాజకీయ కార్యక్రమం మాత్రం కాదు… ఇవేవీ లేకుండానే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో జెండాలు ఎగరేయలేదా..? పైగా రాజకీయ కార్యక్రమం అయితే అధికార యంత్రాంగాన్ని ఎందుకు పరుగులు పెట్టిస్తారు..? సో, అది కాదు… మరేమిటి..?
ఒక్క ముక్కలో చెప్పాలంటే… ఇది ఒక జన్మభూమి, ఒక ప్రజలవద్దకుపాలన, ఒక క్లీన్ అండ్ గ్రీన్ కలిపి మిక్సీ చేసి, వడబోసి, కొత్తగా రూపకల్పన చేసిన ఓ ప్రోగ్రామ్… పరిపాలన కోణంలో ఎందుకు మంచిది అంటే..? ఇప్పటికీ తెలంగాణ స్తబ్దుగా, ఇంకా కేసీయార్ కాలంలోనే ఉన్నామనుకుంటున్నారు… వాళ్లను జనంలోకి పంపాలి, సమస్యలపై సమీక్షలు జరగాలి, జనం అడగాలి, పెండింగ్ కోరికలు, పనులకు పరిష్కారం దొరకాలి, మోక్షం కావాలి… ప్రతి పల్లె, ప్రతి వార్డులో గవర్నమెంట్ యాక్టివిటీ కనిపించాలి… మొత్తంగా జనంలోకి ప్రభుత్వం, ఇది మంచి ఆలోచన…
అంతేకాదు… ప్రభుత్వం అత్యంత వ్యయప్రయాసలతో చేపట్టిన పలు పథకాల్ని పార్టీపరంగా గానీ, ప్రభుత్వపరంగా గానీ సరిగ్గా ప్రచారం చేసుకుని, ప్రజల్లో ఆలోచనల్ని, చర్చల్ని రేకెత్తించే సోయి కనిపించడం లేదు… ప్రత్యేకించి సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఫ్రీ బస్సు, సబ్సిడీ సిలిండర్, ఫ్రీ కరెంటు, రైతు భరోసా, బోనస్ ధర వంటిపై జనంలో ఇంకా పాజిటివ్ ప్రచారం జరగాలి… దాన్ని ఈ 99 యాక్షన్ ప్లాన్ కొంత నెరవేర్చగలదు… (ప్రభుత్వంపై ఎంతోకొంత ఏర్పడే నెగెటివిటీని బ్రేక్ చేయడానికి కూడా ఉపయోగకరం)…

అంతేకాదు, ఇంకా గ్రౌండ్ కాని పనులేమైనా ఉంటే వాటిల్లో కదలిక వస్తుంది… ఊరూరా ప్రభుత్వ కార్యక్రమాలు మరింత యాక్టివేటవుతాయి… జనం ఎదుట యంత్రాంగాన్ని ప్రవేశపెట్టడం ఎప్పుడూ పాలనకోణంలో మంచి చర్యే… కానీ ఏమీ లేనప్పుడే గాలి నుంచి ఏదో క్రియేట్ చేసి రచ్చ చేసే బీఆర్ఎస్ ఇప్పుడు ఊరుకుంటుందా అనేది ఓ ప్రశ్న… కానీ రాజకీయాలకు భయపడితే ప్రభుత్వం ఇంకేం చేయగలదు..? నిజానిజాలేమిటో జనాలకు కూడా తెలిసేలా, ఎవరేం రచ్చ చేస్తున్నారో తెలిసేలా… జనంలోనే ఉండి మాట్లాడితేనే కదా అసలు కథ..?!
పంచాయతీల్లో కాంగ్రెస్ వాళ్లు, పట్టణాల్లో కాంగ్రెస్ వాళ్లు… గత ఎన్నికల ముందు నిస్తేజంగా, నిర్లిప్తంగా, డిమోరల్ అయి ఉన్న కాంగ్రెస్‌కు గ్రామం, వార్డు స్థాయిలోనూ ఇప్పుడు అధికారమున్న ప్రతినిధులున్నారు… వాళ్లందరినీ ఓసారి సెన్సిటైజ్ చేయాలి, పార్టీ పటిష్టం కావాలి… ఇది మరో లక్ష్యం… పార్టీ యంత్రాంగాన్ని సెన్సిటైజ్ చేయడం..!! ఇది ‘‘2028లోనూ మేమే’’ అనే రాజకీయ సంకల్పానికి పునాదులు వేయగలదు…
రేవంత్ రెడ్డి వ్యక్తిగత కోణం నుంచి చూస్తే… పార్టీ మీద మరింత పట్టు రావడానికి ఉపయోగకరం… ఊరూరా ముసలీముతకా, పిల్లాపీచు దాకా పర్సనల్ ఇమేజ్ పెరగడం, ఎస్టాబ్లిష్ అయిపోవడం… అది రాజకీయంగా ఉపయోగకరం తనకు… పార్టీలోని అసమ్మతి, అసంతృప్తి కేరక్టర్ల మీద కూడా అదుపు… ష్, హైకమాండ్‌కు కూడా తనే తెలంగాణ పార్టీకి దిక్కుగా క్లియర్ కట్‌గా చెప్పడం..!!
ఐతే పరిపాలన కోణంలో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే పడికట్టు పదాలతో, ఎవరికీ అర్థం కాని వివరణలతో జరగదు… కీలక శాఖల ఐఏఎస్ అధికారులు ప్లస్ జిల్లా కలెక్టర్లకు స్పష్టంగా ఓ మెసేజ్ అవసరం… ఈ ప్రోగ్రాంలో మీమీ పనితీరు ఆధారంగానే భావి పదోన్నతులు, మంచి శాఖల్లో పోస్టింగులకు మదింపు, మార్కులు అని..!! వాళ్లు సిన్సియర్‌గా ప్రోగ్రాంను అర్థం చేసుకుని ఉరికితే… ఎంతోకొంత తెలంగాణ సమాజానికి, ప్రజలకు మేలే కదా..!!
అన్నట్టు… ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక అనే టైటిల్ ఆప్ట్‌గా లేదు… లోగో ఇంకా ప్రిపేర్ అయినట్టు లేదు..!! అలాగే ఒక్కొక్క వారం ఒక్కో థీమ్ తో… రైతులు, మహిళలు, విద్యార్థులు… ఇలా సపరేట్ థిమాటిక్ వీక్స్ ప్లాన్ చేసినా ఇంకాస్త ఎక్కువ ఫోకస్ ఉంటుందేమో ఆలోచించాలి..!!
అసలు మొత్తం రేవంత్ ప్రభుత్వానికి పెద్ద థ్రెట్, మైనస్ ఎవరంటే, అందరూ అనుకున్నట్టు ఐఏఎస్ లు కాదు... పక్కాగా గ్రూపు-1 అధికారులు... ఐ డేర్ టు సే... మరీ కొందరు మహిళా అధికారులు మరీ దారుణం... డబ్బు తప్ప వేరే లోకం లేదు... ఓ ఎలపరం..!! ఫాఫం, రేవంత్ రెడ్డికీ తెలుసు, ఏం చేయాలో తెలియని క్రియాశూన్యత..!! కేసీయార్ హయాంలో దీర్ఘనిద్రలోకి జారిపోయిన ఏసీబీని యాక్టివేట్ చేసి, ప్రధానంగా మున్సిపల్ వుమెన్ ఆఫీసర్లను కట్టడి చేయగలడా తను.... ఫాఫం..!!
Share this Article