Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఏం చిల్లర గాళ్లురా మీరు..? పాకిస్థాన్ మురికి యాటిట్యూడ్ మారదు !!

September 2, 2026 by M S R

.

పాకిస్థాన్ చిల్లర యాటిట్యూడ్… ప్రపంచ వేదికపైనా ఇదేనా తీరు? అంతర్జాతీయ వేదికలపై దేశాల మధ్య విభేదాలు ఉండటం కొత్త కాదు. ఒక దేశానికి మరో దేశంతో దౌత్యపరమైన విభేదాలు ఉండొచ్చు. నేతలు ఒకరితో ఒకరు మాట్లాడకపోవచ్చు. అవసరమైతే ఒకరి విధానాలను మరొకరు తీవ్రంగా విమర్శించుకోవచ్చు. ఇవన్నీ అంతర్జాతీయ రాజకీయాల్లో సహజమే.

కానీ ఒక దేశ ప్రధానిని ఫొటోలోంచి కత్తిరించి పారేయడం మాత్రం దౌత్యం కాదు… చిల్లర రాజకీయమే.  కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో జరిగిన SCO సదస్సు దీనికి తాజా ఉదాహరణ.

Ads

SCO సభ్యదేశాల అధినేతలందరూ కలిసి దిగిన అధికారిక గ్రూప్ ఫొటో ఒకటుంది. అందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఉన్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సహా ఇతర దేశాల అధినేతలంతా ఉన్నారు.

మోదీ తన సోషల్ మీడియా ఖాతాలో అసలు ఒరిజినల్ ఫొటో పెట్టారు. షెహబాజ్ షరీఫ్ కూడా అందులో ఉన్నారు. కానీ పాకిస్థాన్ ప్రధానమంత్రి కార్యాలయం మాత్రం అదే ఫొటోను రెండు వైపులా క్రాప్ చేసి (అటూ అటూ కత్తెర పెట్టి) పెట్టింది. ఫలితం? మోదీ కనిపించరు. ఇరాన్ అధ్యక్షుడు కూడా కనిపించరు. మరికొందరు నేతలు కూడా ఫ్రేమ్ బయటకు వెళ్లిపోయారు. షెహబాజ్ మాత్రం మధ్యలోకి వచ్చేశారు.

pak pmo

 

ఇదేం విచిత్రమైన ఫొటో ఎడిటింగ్? అసలు ఫొటోలో షెహబాజ్ నాలుగో స్థానంలో ఉంటే… క్రాప్ చేసిన ఫొటోలో ఆయన ఏదో ప్రపంచ రాజకీయాల కేంద్రబిందువుగా కనిపిస్తున్నారు. అంటే ప్రపంచ రాజకీయాల్లో స్థానం సంపాదించలేకపోతే… ఫొటోలోనైనా మధ్యలో నిలబడాలి అన్నమాట!

ఇది చూసి నవ్వాలో, జాలిపడాలో అర్థం కాని పరిస్థితి. శత్రుత్వం ఉంటే ఉండొచ్చు… ఫొటోను ఎందుకు కత్తిరించాలి? ఇదేం చిల్లర ధోరణి…

భారత్–పాకిస్థాన్ సంబంధాలు బాగోలేవు. అందరికీ తెలుసు. భారత్‌పై ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వ్యవస్థపై భారత్‌కు తీవ్రమైన అభ్యంతరాలున్నాయి. SCO వేదికపైనే మోదీ ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనూ సహించకూడదని, ఉగ్రవాదానికి మద్దతిచ్చే వ్యవస్థలను నిర్మూలించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

india pmo

అది పాకిస్థాన్‌కు నచ్చకపోవచ్చు. మోదీతో షెహబాజ్ చేతులు కలపకపోవచ్చు. మోదీతో మాట్లాడకపోవచ్చు. దౌత్యపరంగా దూరంగా ఉండవచ్చు. కానీ ఒక బహుపాక్షిక అంతర్జాతీయ సంస్థ అధికారిక గ్రూప్ ఫొటోలో తమకు నచ్చని నాయకుడిని కత్తిరించడం? అది ఏ స్థాయి దౌత్యం? ఇదేం గుణం?

ఇది భారత్‌ను అవమానించడంకన్నా ముందు తమ సొంత మానసిక చీప్ స్థితిని బయటపెట్టుకోవడం.  ఎందుకంటే ప్రపంచ నాయకులంతా కలిసి ఉన్న ఫొటోలో ఒక నాయకుడిని తీసేసినంత మాత్రాన ఆయన అక్కడికి వెళ్లిన విషయం చెరిగిపోదు. ఆయన అక్కడ నిలబడిన స్థానం మారదు. ఆయన పాల్గొన్న సమావేశం మారదు. ప్రపంచం చూసిన అసలు ఫొటో మారదు.

మారేది ఒక్కటే— పాకిస్థాన్ అధికారిక సోషల్ మీడియా ఖాతా ఎంత చిన్నబుద్ధితో వ్యవహరించిందో బయటపడుతుంది.

ఇంకో విచిత్రం ఉంది! ఇక్కడ అసలు కామెడీ ఏమిటంటే… పాకిస్థాన్ PMO చేసిన పని దాచిపెట్టడానికి వీల్లేనంత సులభంగా బయటపడిపోయింది. ఎందుకంటే మోదీ పోస్ట్ చేసిన అసలు ఫొటో అందుబాటులోనే ఉంది. అంటే ఒకవైపు “ఇదిగో అసలు ఫొటో” అని భారత ప్రధాని పోస్ట్ చేశారు.

మరోవైపు “మేము కొంచెం కత్తిరించాం” అంటూ పాకిస్థాన్ PMO వెర్షన్ పెట్టింది. తర్వాత షెహబాజ్ షరీఫ్ స్వయంగా పూర్తి ఫొటోను తన ఖాతాలో పెట్టినట్లు కూడా రిపోర్టులు వచ్చాయి. అంటే పాకిస్థాన్ ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పని చివరకు పాకిస్థాన్ ప్రధానమంత్రే పెట్టిన అసలు ఫొటోతోనే బట్టబయలైంది!

ఇదీ చిల్లర ఎడిటింగ్‌కు వచ్చిన అంతర్జాతీయ స్థాయి ముగింపు. ప్రపంచం చూస్తున్నది ఫొటో కాదు… మనస్తత్వం . పాకిస్థాన్‌కు భారత్‌పై ఎంత కోపం ఉన్నా ఉండొచ్చు. మోదీపై ఎంత రాజకీయ వ్యతిరేకత ఉన్నా ఉండొచ్చు. భారత్‌ను ఎంతగా విమర్శించాలనుకున్నా విమర్శించవచ్చు. అది వారి హక్కు.

కానీ అంతర్జాతీయ వేదిక మీద “నాకు నచ్చలేదు కాబట్టి ఫొటోలోంచి తీసేశాను” అనే స్థాయికి దిగజారడం ఒక దేశం యొక్క దౌత్యపరమైన పరిపక్వతను ప్రశ్నార్థకం చేస్తుంది. దేశాల మధ్య పోటీ ఉంటే ఆర్థికంగా పోటీ పడాలి. సాంకేతికంగా పోటీ పడాలి. సైనికంగా బలపడాలి. దౌత్యంలో ప్రభావం పెంచుకోవాలి. ప్రపంచ దేశాలను తమవైపు తిప్పుకోవాలి.

కానీ ఫోటోలు క్రాస్ చేసి, ఎడిటింగ్ చేసి, నేను గొప్పోణ్ని అని జబ్బలు చరుచుకుంటే జాలిపడాలి తప్ప ఇంకేమీ లేదు… ఫొటోను క్రాప్ చేయొచ్చు… వాస్తవాన్ని క్రాప్ చేయలేరు… సర్లెండి, ఇవన్నీ తెలిస్తే అది పాకిస్థాన్ ఎందుకు అవుతుంది..? తెలుగు టీవీల్లో ఓ పాపులర్ డైలాగ్ వినిపిస్తూ ఉంటుంది… ఏం చిల్లర గాళ్లున్నారుర భయ్… 

పాకిస్థాన్ చిల్లర యాటిట్యూడ్‌కు ఇదొక చిన్న ఫొటో… కానీ పెద్ద ఉదాహరణ.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏం చిల్లర గాళ్లురా మీరు..? పాకిస్థాన్ మురికి యాటిట్యూడ్ మారదు !!
  • బొద్దింకల అసలు కథ ! తెర వెనుక ఇండియా వ్యతిరేకుల ఆట !!
  • ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అదే… జో జీతా వహీ సికిందర్ ! వహీ చంద్రబాబు !!
  • ఇరుముడి, హనుమాన్ అంశ్ – మధ్యలో మరో సెన్సేషనల్ హిట్ !!
  • వామ్మో… అమ్మ గారు- ఆరు గంటలు… ఎడిటర్లకు ఓ ‘టాక్సిక్‌’ టాస్క్ !!
  • ‘నాణ్యమైన వీర్యాని’కి మస్తు గిరాకీ – ‘మంచి సంతానం’ కోసం అడ్డగోలు రేట్లు !!
  • ఆల్ ది బెస్ట్ సుజయ్ S/o ETV సుమన్… రామోజీ ఏకైక మగవారసుడు…
  • రేవంత్ రెడ్డి తిట్టాడు సరే – కానీ ఒక్క ప్రశ్నకూ జవాబివ్వలేని BRS క్యాంపు !!
  • అల్లు అరవింద్ మాటల్లో తప్పు లేదు- తను యశ్‌ను కించపరచలేదు !!
  • బ్రెజిల్‌లో ఈ ఆవు ధర 36 కోట్లు !! ఆ జాతికి పూర్వీకులు మన పశువులే !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions