.
Subramanyam Dogiparthi …. ఫక్తు వంశీ మార్క్ సినిమా . 1993 లో వచ్చిన ఈ జోకర్ సినిమాకు మాతృక తమిళం లోని కిలుక్కంపెట్టి . తమిళంలో జయరాం , సుచిత్ర , బేబీ షామిలి ప్రధాన పాత్రల్లో నటించారు . సాధారణంగా గోదావరి జిల్లాలో షూటింగ్ జరిపే వంశీ ఈ సినిమాను తిరుపతికి తీసుకుని వెళ్ళారు .
రాజేంద్రప్రసాద్ ఆర్కిటెక్ట్ . ప్రొఫెషనల్ గా జీనియస్ అయినా వ్యక్తిగతంగా స్త్రీలోలుడు అని అందరికి తెలిసిందే . టిటిడి వారి కాటేజీల నిర్మాణం కోసం తిరుపతికి బదిలీ అవుతాడు . అక్కడ వాణీ విశ్వనాధ్ తారసపడి మనసు దోచేస్తుంది .
Ads
ఆమేమో పురుషద్వేషి . ఎలాగయినా ఆమె ప్రేమను సంపాదించి పెళ్లి చేసుకోవాలనేది హీరో నిర్ణయం . శెలవు పెట్టి ఆమె ఇంట్లో జోకర్ అనే పేరుతో పనివాడిగా చేరి కొరకరాని కొయ్య అయిన బేబీ షామిలి ప్రేమను పొందుతాడు . ఆ పాప కోసం అన్ని అవమానాలు , అగచాట్లు పడతాడు . ప్రేమంటే అంతేగా . పాతాళభైరవిలో తోటరాముడు దగ్గర నుండి ఈరోజు వరకు ప్రేమికులకు ఈ కష్టాలు తప్పవు .
క్లైమాక్సులో వాణీ విశ్వనాధ్ ప్రేమను పొందటంతో సినిమా శుభాంతం అవుతుంది . స్త్రీలోలుడుగా , ప్రేమికుడిగా , జోకర్ గా రాజేంద్రప్రసాద్ అదరగొట్టేసాడు . ఆ తర్వాత మెచ్చుకోవలసింది బేబీ షామిలినే . చిచ్చరపిడుగు చాలా బాగా నటించింది . వీరిద్దరి తర్వాత పురుషద్వేషిగా , స్వాతిశయం నిండా ఉన్న స్త్రీగా వాణీ విశ్వనాధ్ బ్రహ్మాండంగా నటించింది .
ప్రేక్షకులు మరచిపోలేని మరో రెండు పాత్రలు ఉన్నాయి . ఒకటి మా గుంటూరు వగలరాణి జయలలితది . రాజేంద్రప్రసాద్ కోసం వెంటపడే తరుణిగా , ఉడుం పట్టు పట్టే ప్రేమికురాలిగా ఇరగతీసేసింది . రాజేంద్రప్రసాద్ , జయలలితల మీద సాగే చమకు చమకు పాట కూడా వంశీ స్టైల్లో చాలా బాగుంటుంది . చేతిలో ట్రాన్సిష్టర్ . భలే పెట్టాడు వంశీ .
మరో పాత్ర మల్లికార్జున రావుది . రాజేంద్రప్రసాద్ సేవకుడిగా సర్వ కార్యక్రమ నిర్వాహకుడిగా బ్రహ్మాండంగా నటించాడు . రాజేంద్రప్రసాదుకు ధీటుగా ఉంటుంది నటన . ఇతర ప్రధాన పాత్రల్లో జగ్గయ్య , సాక్షి రంగారావు , శివాజీ రాజా , కళ్ళు చిదంబరం , ధమ్ , రాళ్ళపల్లి తదితరులు నటించారు .
మరో విశేషం ఏమిటంటే వంశీ సంగీత దర్శకుని అవతారం కూడా ఎత్తాడు ఈ సినిమాలో . (నిజానికి వంశీని ఇళయరాజా బాగా ప్రేమించేవాడు. ప్రయారిటీ ఇస్తాడు తన సినిమాలకు, కానీ ఎక్కడో ఓసారి ఏదో తేడా కొట్టింది. ఈమాత్రం నేను సంగీతదర్శకత్వం చేయలేనా అనుకున్నాడేమో వంశీ, తనే హార్మోనియం పెట్టె ముందు కూర్చున్నాడు ఇక… మరో మూణ్నాలుగు సినిమాలకు కంటిన్యూ చేశాడు కూడా…)
గురుచరణ్ వ్రాసిన పాటల్ని బాలసుబ్రమణ్యం , చిత్ర , శుభ శ్రావ్యంగా పాడారు . రాజేంద్రప్రసాద్ , వాణీ విశ్వనాధుల మీద సాగే రేపటి రూపం కంటి , దిందిన్న దిందిన్న , పూచిన తారలు పూవులుగా చిత్రీకరణ బాగుంటుంది . రాజేంద్రప్రసాద్ పాడే పాల నవ్వుల లోన పగడాల వెలుగులు బాల పలుకు లోన పలకాలి చిలుకలు కూడా చాలా బాగుంటుంది .
డైలాగులను వి ఆనంద శంకరం వ్రాసారని టైటిల్సులో వేసారు . కానీ తన గురించిన సమాచారం పెద్దగా తెలియదు. ఇది చక్కటి వినోదాత్మక సినిమా . యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూసి ఉన్నా మరలా చూడవచ్చు .
Share this Article