ప్రతి శనివారం… అవును, మల్లాది నవల ‘శనివారం నాది’లో నెగెటివ్ షేడ్స్ ఉన్న ఓ వ్యక్తి ప్రతి శనివారం ఏదో ఓ దుర్ఘటనకు పాల్పడుతుంటాడు… సరిపోదా శనివారం అని ఓ సినిమా వస్తోంది, హీరో నాని… ఆ మల్లాది నవల కథనే ఈ సినిమా కథ కావచ్చుననే సందేహాలు కూడా వినవస్తున్నాయి… ఈ శనివారం సెర్చింగులో మరో ఇంట్రస్టింగ్ కథ కనిపించింది… కథ అని ఎందుకంటున్నానో కథ మొత్తం చదివాక మీకు తెలుస్తుంది…
ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్… వికాస్ దూబే అని 24 ఏళ్ల యువకుడు… ప్రతి శనివారం తనను ఓ పాము కాటేస్తోందని చెబుతున్నాడు… 40 రోజుల్లో 7 సార్లు పాము కాటేసిందట… సరే, యాదృచ్ఛికం కావచ్చు అనుకోలేం… ఖచ్చితంగా ప్రతి శనివారం పాము కాటేయడం ఏమిటి..? పాము పగ తీరదు, పగ పట్టిందంటే వదలదు బాపతు పుస్తకాలు, సినిమాలు, సీరియళ్లు గట్రా బోలెడు చూసి ఉన్నాం కదా… ఏమో, ఇదీ అదేనేమో అనుకుంటున్నారా..?
తను చెప్పే కథే కొన్ని సందేహాలను కలిగిస్తోంది… ‘‘పాము కలలోకి వచ్చి చెప్పింది… ప్రతి శనివారం వస్తాను, నిన్ను మొత్తం 9 సార్లు కాటేస్తాను, తొమ్మిదోసారి నీ ప్రాణం పోతుంది… ఏ తాంత్రికుడు, ఏ మంత్రగాడు, ఏ డాక్టరూ నిన్ను కాపాడలేడు, 9వ సారి కాటేయగానే నిన్ను నాతోపాటు తీసుకుపోతాను అని చెప్పింది… అన్నట్టుగానే 7 సార్లు కాటేసింది’’ ఇదీ తను చెబుతున్న కథ…
Ads
కథలాగే ఉంది కదా… ఈసారి జిల్లా అధికారులకు మొరపెట్టుకున్నాడు… రెండుమూడుసార్లు బంధువుల ఇళ్లకు వెళ్లి పడుకున్నాను… ఐనా పాము వచ్చి కాటేసింది… ప్రతిసారీ చికిత్సకు బోలెడు డబ్బులు ఖర్చవుతున్నాయి… నాకు ఆర్థికసాయం చేయండి, నన్ను కాపాడండి, లేకపోతే చచ్చిపోతాను, ఆ పాము చంపేస్తుంది అనేది ఆ కోరిక… పాము కాటేయడానికి మూడునాలుగు గంటల ముందు హెచ్చరిక సంకేతాలు కూడా కనిపిస్తాయట…
ఠాట్, ఈరోజుల్లో ఇవన్నీ హంబగ్, ఒకే పాము పదే పదే వచ్చి, ఫిక్స్‌డ్ షెడ్యూల్‌తో కాటేయడం ఏమిటి..? ఎక్కడికి వెళ్లినా వదలకపోవడం ఏమిటి..? అని చీఫ్ మెడికల్ ఆఫీసర్ రాజీవ్ నారాయణ గిరి కొట్టిపారేస్తున్నాడు… తను ప్రతిసారీ ఒకే హాస్పిటల్‌కు వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు… మరుసటిరోజే డిశ్ఛార్జి అవుతున్నాడు… అసలు తనకు వైద్యం చేసే డాక్టర్ మీదా డౌటుంది అంటున్నాడు…
అసలు ఈ కథలో నిజమెంతో తెలుసుకోవడానికి ప్రభుత్వం ముగ్గురు డాక్టర్లతో ఓ కమిటీ వేసింది, అది అధ్యయనం చేసి ఓ రిపోర్టు ఇవ్వాలి… ఎహె, నాన్సెన్స్, ఏదో డ్రామా ఆడుతున్నాడు అంటారా..? చూద్దాం, కమిటీ ఏమంటుందో..? ఐనా పాము తన కలలో చెప్పినట్టు ఇంకా రెండు శనివారాలు, రెండు కాట్లు బాకీ ఉన్నాయి కదా…!! అవునూ, పాము పగే నిజం అనుకుందాం, కానీ ఎందుకు పగపట్టినట్టు… అది కూడా తేలాలి, దానికీ ఓ కమిటీ అవసరమేమో..!!
Share this Article