రతన్ టాటా… జగమెరిగిన పేరు… వేల కోట్ల ఛారిటీ, విలువలతో కూడిన వ్యాపారం, క్రమశిక్షణ, నిలువెల్లా భారతీయత, విశ్వసనీయత, పరిపూర్ణ జాతీయతత్వం ఎట్సెట్రా… టీవీలు, పత్రికలు, సైట్లు, చానెళ్లు, బిజినెస్ సర్కిళ్లు, పొలిటికల్-బ్యూరోక్రటిక్ సర్కిళ్లు, ఇతర ఇండియన్ అత్యధిక ప్రభావశీల సమూహాల్లో ఎప్పుడూ నానే పేరు ఆయనది… ఈ కేరక్టర్‌కు పూర్తి భిన్నమైన నీడ ఒకటి ఉంది… ఫుల్ కంట్రాస్ట్ కేరక్టర్… ఆయన పేరు జిమ్మీ టాటా… ఆ రతన్ టాటాకు స్వయానా తమ్ముడు… అసలు ఈయన ఉన్నాడనే విషయమే లోకానికి సరిగ్గా తెలియదు… అంతెందుకు..? టాటా గ్రూప్ హైప్రొఫైల్ డిగ్నిటరీల్లోనే చాలామంది తెలియదు, ఆయన మొహం చూడలేదు…
అంత నిరాడంబర జీవితం తనది… సముద్రముఖంతో ఉండే ఓ అపార్ట్‌మెంట్… ముంబైలోని కొలబా… అక్కడే రతన్ టాటా కూడా ఉంటాడు… ఈ జిమ్మీ టాటా ఆ భవనపు ఆరో ఫ్లోర్‌లోని టూబెడ్రూం ఫ్లాటులో ఉంటాడు… అన్నలాగే బ్రహ్మచారి… కానీ తమ్ముడి ఫ్లాట్ మెయింటెనెన్స్ పూర్… ఫైళ్లు, దుమ్ము… ఎప్పుడూ తలుపులు మూసే ఉంటయ్… ఎప్పుడోసారి గానీ బయటికి రాడు… అంతెందుకు..? తనకు ఓ మొబైల్ ఫోన్ లేదు ఇప్పటికీ… అలాగని ఏమీ తెలియని వాడేమీ కాదు… తమ గ్రూపులో ఎప్పుడేం జరుగుతుందో మొత్తం తెలుసు… వివిధ పత్రికల్లో వచ్చిన విశ్లేషణలు, కథనాలు సేకరించి, తనకంటూ ఓ అంచనాకు వస్తాడు…
Ads
హఠాత్తుగా కొన్ని బిజినెస్ పత్రికలు నిన్న ఈయన గురించి ప్రత్యేకంగా రాసుకొచ్చాయి… కానీ నిజానికి 2016లోనే టైమ్స్ ఆఫ్ ఇండియా ఆయన జీవితం గురించి రాసుకొచ్చింది… టాటా వర్సెస్ మిస్త్రీ జోరుగా సాగుతున్నవేళ ఈయన అభిప్రాయాన్ని సేకరించింది… అప్పుడే చాలామందికి రతన్ టాటాకు ఓ సోదరుడున్నాడనే విషయం తెలిసొచ్చింది… టీసీఎస్, టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా కెమికల్స్, ఇండియన్ హోటల్స్, టాటా పవర్ వంటి ప్రిస్టేజియస్, వెరీ వాల్యూబుల్ కంపెనీల్లో జిమ్మీకి షేర్లున్నయ్… అంటే తను వ్యక్తిగతంగా ఎంత ఆస్తిపరుడో అర్థమైంది కదా… తను టాటా ఫౌండేషన్‌లో కూడా ఓ ట్రస్టీ… కానీ నమ్మశక్యం కానంతగా బాగా లోప్రొఫైల్ జీవితం…
ఆయనకున్న వ్యాపకం ఒకటే… మంచి స్క్వాష్ ప్లేయర్… సర్కిల్ తక్కువ, ఫ్రెండ్స్ తక్కువ… అసలు ఆయన ఫ్లాటుకు వచ్చేవాళ్లే కనిపించరు… మిస్త్రీ యవ్వారం అప్పట్లో వేడివేడిగా గ్రూపులో కలకలం రేపుతున్నవేళ తన అభిప్రాయాల్ని క్రోడీకరిస్తూ ఎప్పటికప్పుడు టాటా సన్స్‌కు పంపించేవాడు… కానీ తనెప్పుడూ తెర మీదకు రాడు… రాలేదు… ఈరోజుకూ… నిజంగా ఎంతటి పరస్పర విరుద్ధ జీవనాలు ఈ ఇద్దరు సోదరులవి… ఒకరు హైప్రొఫైల్… మరొకరు అదే స్థాయిలో లోప్రొఫైల్… ఈ అజ్ఞాతవాసాన్ని కూడా జిమ్మీ తనంతట తను కోరుకున్నదే కాబట్టి నో రిగ్రెట్స్… అసలు అలా ఉండటమే తనకు ఆనందమట… లోకోభిన్నరుచి… కానీ చదువుతుంటేనే ఆశ్చర్యానికి గురిచేసే కథ ఆయనది..!!
Share this Article