‘‘సిగ్గుపడేలా రాష్ట్ర విభజన’’ …. ఇదీ శ్రీమాన్ డిల్లీ పాదుషా మోడీ గారు ఉవాచ…. నిజానికి ఇందులో ఓ వ్యూహం, ఓ దశ, ఓ దిశ ఉన్నాయా..? ఏమీ లేవు… ఒకవైపు పంజాబ్‌లో ఖలిస్థానీ శక్తులు ప్రాణం పోసుకుంటున్నయ్… మరోవైపు కేరళ ఎస్డీపీఐ, జమాతే ప్రమాదకరంగా మారుతూ కర్నాటకలో హిజాబ్ నిప్పు రగిలిస్తున్నయ్… ఇంకోవైపు బీజేపీ మాత్రం వ్యూహరాహిత్యంతో కొట్టుకుంటోంది… తెలంగాణ ఏర్పాటు మీద మోడీ చేసిన వ్యాఖ్యల సారాంశం అదే…
మోడీ వ్యాఖ్య మొదటిసారి ఏమీ కాదు… రాష్ట్ర విభజన తరువాత ‘‘తల్లీ – పిల్ల’’ తరహా తలతిక్క కామెంట్లతో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎదుగుదల మీద తనంతటతానే విషం ప్రయోగించాడు… ఆ వ్యాఖ్యతో ప్రయోజనం లేదు, వచ్చేదీ లేదు… గుడ్డిగా కాంగ్రెస్‌ను వ్యతిరేకించే ధోరణిలో ‘రాజకీయ చాణక్యం’ ఎరుగని నాయకుడిలా మాట్లాడాడు… సరే, అప్పుడేదో అయిపోయింది… పార్టీ ఏపీలో చేర్చుకున్న స్వార్థ నేతలతో, ఓ దిశారాహిత్యంతో ఏపీలో బీజేపీని దెబ్బతీశాడు…
Ads
ఏడేళ్లు దాటిపోయినయ్… ఇప్పుడు ఏపీ, తెలంగాణ మధ్య విద్వేషాలు ఏమీ లేవు… కల్పిత అల్లర్లు ఏమీ లేవు… ఏపీ తన మానాన తాను ప్రత్యేక రాష్ట్రంగా ఎదగడానికి ప్రయత్నిస్తోంది… పాలకుడు చంద్రబాబు అయినా సరే, జగన్ అయినా సరే..! ఇంకోవైపు ఆంధ్రా ద్వేషం పెచ్చరిల్లుతుంది అనే భ్రమల్ని, భావనల్ని, అంచనాల్ని పటాపంచలు చేస్తూ కేసీయార్ తెలంగాణలో పాలనను కొత్త రీతుల్లో, తనకిష్టం వచ్చినట్టు సాగిస్తున్నాడు… మరిప్పుడు మళ్లీ ‘‘విభజన తీరు బాగాలేదు, మన్నూమశానం’’ అనే వ్యాఖ్యలు దేనికి..? ప్రయోజనం ఏముంది..? ఇప్పుడు కాంగ్రెస్ కు నష్టం ఏమీ లేదు, సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని ప్రతి తెలంగాణవాసికీ తెలుసు… కెసిఆర్ స్వయంగా చెప్పాడు… అయినా కాంగ్రెస్ పెరగక పోవడం దాని ఖర్మ… గ్రూపుల తన్నులాట… ఈరోజుకీ అంతే కదా…
ప్రచ్ఛన్న దోస్త్ కేసీయార్‌కు ‘‘తెలంగాణ ఎమోషన్’’ అస్త్రాన్ని అందించడానికా ఈ తాజా వ్యాఖ్యలు..? ఏపీని వదిలేయండి, అక్కడ బీజేపీకి ఓ దశ లేదు, ఓ దిశ లేదు… నాయకుడే లేడు… కానీ కాస్తో కూస్తో తెలంగాణలో బీజేపీకి ఆశలు చిగురిస్తున్న దశలో వాటిని చిదిమేసే పనికి మోడీ ఎందుకు పూనుకున్నట్టు..? (అఫ్ కోర్స్, మోడీ వ్యాఖ్యల్ని పట్టుకుని టీఆర్ఎస్ ఏదో ట్రై చేస్తోంది గానీ, ప్రస్తుతం తెలంగాణ ఉద్వేగం ఏమీ లేదు, మోడీ-కేసీయార్ వ్యూహం ఏమీ పనిచేయదు… అలాగని బీజేపీ కి use ఏమీ లేదు… సందర్భశుద్ధి అనే పదం కూడా మోడీకి తెలియదు పాపం…)
ఎవడి బతుకు వాడు బతుకుతున్నాడు ఇప్పుడు… బజార్లలో ఆంధ్రా, తెలంగాణ జనం అల్లర్లు అనే పిచ్చి అంచనాలు ఎప్పుడో బద్దలయ్యాయి… కేసీయార్ తెలివైన ‘అందర్నీ కలుపుకుని’ వెళ్లాలనే ధోరణి రెండు రాష్ట్రాల నడుమ ఉద్రిక్తతల్ని, రెండు సమూహాల నడుమ ఉద్వేగాల్ని చల్లబరిచింది… మళ్లీ ఇప్పుడు మోడీ ప్రయత్నం దేనికి..? కాంగ్రెస్‌ను నిలువరించడానికా..? అదే నిజమైతే అంతకుమించిన మూర్ఖత్వం మరొకటి ఉండదు…
రేవంత్ పీసీసీ అధ్యక్షుడయ్యాక పార్టీలో కొంత జోష్ పెరిగింది, దూకుడు పెరిగింది… అదే సమయంలో బీజేపీ కూడా ఎదుగుతోంది… దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికలే నిదర్శనం… దాన్ని కూడా బొందపెట్టే ప్రయత్నమా ఇది..? విభజన తీరు బాగాలేదు అనే వ్యాఖ్య స్థూలంగా చూస్తే తప్పు కాదు, కానీ మోడీ వ్యాఖ్యలకు ఓ టైమింగూ లేదు, అవసరమూ లేదు, అందులో ఓ వ్యూహమూ లేదు… తెలంగాణలో బీజేపీ అధికారం అనే లక్ష్యం వైపు వీసమెత్తు ఉపయోగకరమూ కాదు…
అసలు ఒక్కసారిగా బీజేపీకి ఏం పుట్టింది..? ప్రతిచోటా ఇదే వ్యూహరాహిత్యం… ఎలాగూ తమ జనరంజక విధానాలతో ప్రజల్ని కనెక్టయ్యే మంచి పాలనా ధోరణి లేనే లేదు… దీనికితోడు ఈ పిచ్చి ఎత్తుగడలు దేనికి..? ఇప్పుడు కాదు… 1984లో నాదెండ్ల వెన్నుపోటు ఎపిసోడ్ తరువాత నుంచీ ఇదే కథ… తెలంగాణ బీజేపీకి హైకమాండ్ వ్యూహాలే పెద్ద శాపాలు అవుతున్నయ్… అప్పట్లో వెంకయ్యనాయుడు అనుసరించిన ధోరణి, టీడీపీకి తోకగా మార్చిన వ్యూహరాహిత్యం…
మరిప్పుడు మోడీ చేసిందేమిటి..? తెలంగాణ బీజేపీకి వరుసగా ఇవే దెబ్బలా..? ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది… యువతెలంగాణ వంటి చిన్న పార్టీలు వచ్చి కలుస్తున్నయ్… కేసీయార్ మీద వ్యతిరేకత పెరుగుతోంది… జనంలో ఆలోచన పెరిగింది… కెసిఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత ఉంది… ఈ స్థితిలో మళ్లీ కేసీయార్ చేతికి ఓ ఎమోషనల్ అస్త్రాన్ని అందించడమేనా మోడీ ఉద్దేశం…?! మరి కేసీయార్ మళ్లీ బలపడితే తెలంగాణ బీజేపీకి వచ్చే ఫాయిదా ఏమిటి..? ఈ మోడీ పిచ్చి వ్యాఖ్యలు సాధించేది ఏమిటి..? ఫాఫం, బీజేపీ సగటు కార్యకర్త కమ్ అభిమాని అని నిట్టూర్చడం కోసమేనా..?!
మోడీ రామానుజ క్షేత్ర పర్యటనను కేసీయార్ బహిష్కరించడం, తాజాగా మోడీ వ్యాఖ్యలు… టీఆర్ఎస్ ఎదురుదాడులు… తెలంగాణ బీజేపీలో ఒక నిర్వేదాన్ని కలిగిస్తున్నాయంటే ఆశ్చర్యపడాల్సింది ఏముంది..? దానికి మోడీయే కారకుడు అనే వ్యాఖ్యలకు జవాబు ఏముంది..? అసలు బీజేపికి ఏమైంది..?!
((కేసీయార్ అంటే మైహోం, మైహోం అంటే కేసీయార్… జియ్యర్ అంటే మైహోం, మైహోం అంటే జియ్యర్…. ఆ ముచ్చింతలకు మోడీ వచ్చాడు, అమిత్ షా వచ్చాడు, యోగీ వస్తాడు… మోడీ దోస్త్ జగన్ వచ్చిపోయాడు… కేసీయార్ తలూపకుండా మైహోం, జియ్యర్ బీజేపీ అంటకాగుతున్నారా..?!))
Share this Article