ఈనాడు హైదరాబాద్ పాఠకులకు రెండేసి పేపర్లు వచ్చాయ్… అదేమిటని ఆశ్చర్యపోకండి… రెండు ఫస్ట్ పేజీలు, రెండు బ్యాక్ పేజీలు… రెండు ఫస్ట్ పేజీల్లో కూడా వేర్వేరు వార్తలు, వేర్వేరు ప్రయారిటీలు… చివరకు వేర్వేరు యాడ్స్ కూడా… రొటీన్ పేజీలు, ఎడిట్ పేజీలు, బిజినెస్, నేషనల్, ఫీచర్స్ పేజీలు, వసుంధర, సినిమా, బిజినెస్, స్పోర్ట్స్ పేజీలన్నీ అందులో కొన్ని, ఇందులో కొన్ని పరిచేసి… మొత్తానికి ‘‘రెండు పేపర్లు’’ ఇచ్చారు… అసలే న్యూస్ ప్రింట్ కాస్ట్ విపరీతంగా పెరిగి, మీడియా హౌజులు గగ్గోలు పెడుతున్నయ్ కదా, మరి రెండు పేపర్లతో మొత్తం 20 నుంచి 22 పేజీలను ఈనాడు ఎలా ఇవ్వగలదు..?
ఇది ప్రయోగమా..? పైత్యమా..? కక్కుర్తా..? ధనాపేక్షా..? ఈనాడు మాత్రమే చేయదగిన ప్రయోగమా..? అసలు ఈనాడు చేయాల్సిన ప్రయోగమేనా..? అన్నీ ప్రశ్నలే కదా… వివరంగా చూద్దాం… ఒక్కసారి ఈరోజు ఈనాడు ఎడిషన్ల వారీ తేడాలు చూద్దాం…
ఏపీ ఎడిషన్… 12 పేజీలు… ప్రింట్ ఎడిషన్ అయితే… ఈపేపర్ అయితే ఇంకొన్ని పేజీలు కనిపిస్తయ్… ఇందులో ఫస్ట్ పేజీ బ్యానర్ ‘‘అప్పు పుట్టేదెలా’’ అని జగన్ పైసల కటకటపై స్టోరీ…
తెలంగాణ ఎడిషన్… సేమ్ 12 పేజీలు… ఈపేపర్ అయితే మరికొన్ని పేజీలు ఎక్సట్రా కనిపిస్తయ్… ఇందులో ఫస్ట్ పేజీ బ్యానర్ ‘దిల్లీ కోటను బద్దలు కొడతం’ అని కేసీయార్ వీరావేశ ప్రసంగం స్టోరీ…
కానీ హైదరాబాద్ ఎడిషన్ కథ వేరు… ఓ జాకెట్ యాడ్ తరువాత ఓ ఫస్ట్ పేజీ కనిపిస్తుంది… అదీ తెలంగాణ ఎడిషన్‌లాగే… అలా అలా 12 పేజీలు దాటగానే… మరో ఫస్ట్ పేజీ కనిపిస్తుంది… అందులో బ్యానర్ స్టోరీ వేరు… ‘సమస్యను దేశవ్యాప్తం చేయొద్దు’ అని సుప్రీం చీఫ్ జస్టిస్ రమణ ‘హిజాబ్ సంబంధ’ విచారణ వార్త…
ఏపీ ఎడిషన్, తెలంగాణ ఎడిషన్ ఎప్పటిలాగే ఉన్నయ్.., కానీ ఎటొచ్చీ కమర్షియల్ యాడ్స్ బాగా వచ్చే హైదరాబాద్ ఎడిషన్ వచ్చేసరికి, ఈ రెండు ఫస్ట్ పేజీలు, రెండు పత్రికల కలగాపులగం కనిపిస్తోంది… ఈ వేర్వేరు ఫస్ట్ పేజీల యాడ్స్ కూడా వేర్వేరు… సాధారణంగా ఫస్ట్ పేజీ యాడ్ టారిఫ్ ఎక్కువ కదా… మరి రెండు ఫస్ట్ పేజీలయితే ఇంకా డబ్బులు ఎక్కువొస్తాయి కదా… అదీ ఈ ప్రయోగ పైత్యానికి కారణం అన్నమాట…
Ads
యాడ్స్ కటకట కదా… రెవిన్యూ అన్ని మీడియా హౌజుల్లోనూ దారుణంగా పడిపోయింది కదా… ఒకప్పుడు ఒక్క రూపాయి రిబేట్ కూడా ఇచ్చేది కాదు ఈనాడు… ఇప్పుడు ప్రకటనకర్త ఎంత బేరం చేస్తే అంతకు దిగిపోయి, కొన్నిసార్లు సాక్షి, జ్యోతి టారిఫ్‌లకన్నా తక్కువగా స్పేస్ అమ్మేస్తోంది ఈనాడు… ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి… అంతిమంగా ఒక మీడియా హౌజుకు డబ్బులే ప్రధానం కాబట్టి యాడ్స్, మార్కెటింగ్ కొత్త టెక్నిక్స్ అవసరమే…
కానీ ఇక్కడ ఈ ప్రయోగంలో పాఠకుడికి అదనంగా వచ్చే ప్రయోజనం ఏమీలేదు… అసలు ప్రయారిటీ పాఠకాసక్తి, పాఠకుడి ప్రయోజనమే కదా… ఈ ప్రయోగంలో ఇదేమీ లేదు సరికదా, అనవసరం గందరగోళం… రెండు పేపర్లు ఇస్తున్నారనే ఓ కృత్రిమ భ్రమకు పాఠకుడిని గురిచేయడం… వార్తల ప్రయారిటీలు దెబ్బతినడం… అలాంటప్పుడు ఈ కలగాపులగం రెండు పేపర్లు అనే కాన్సెప్టు సాధించేదేమిటి… పోనీ, ప్రకటనకర్తను మోసం చేసి, యాడ్స్ తీసుకుంటున్నారు అనుకుందాం…
ఐనా ప్రకటనకర్త ఊరుకోడు కదా… రెండు వేర్వేరు ఫస్ట్ పేజీల మర్మాన్ని ఈరోజు గాకపోతే రేపయినా గమనిస్తాడు కదా… ఉదాహరణకు, కేసీయార్ ప్రసంగం బ్యానర్‌గా ఉన్నది అసలు పేపర్… చీఫ్ జస్టిస్ వార్త ఉన్నదేమో దాదాపు సప్లిమెంట్ లేదా సెకండ్ పేపర్… ప్రయారిటీలు వేర్వేరు కదా… సో, దీంట్లో పడాల్సిన యాడ్‌ను సప్లిమెంట్ కమ్ సెకండ్ పేపర్‌లో పడేస్తే ప్రకటనకర్త ఊరుకుంటాడా..? పైగా పేపర్ బాయ్స్ అందరికీ రెండేసి పేపర్లు వేస్తారనే నమ్మకమూ లేదు…
నిజానికి ఈనాడు మాత్రమే ఈ కొత్త ప్రయోగం చేయడం లేదు… దైనిక్ భాస్కర్ ఎప్పటి నుంచో చేస్తోంది… చోటా, బడా పేరిట పాఠకుడు తనకు ఇష్టం వచ్చినట్టు చందా కట్టొచ్చు… చోటా పేపర్ అంటే ముఖ్యమైన వార్తలతో తక్కువ పేజీలు… బడా పేపర్ అంటే ఫీచర్లతో ఎక్కువ పేజీలు… కాకపోతే ఈనాడు ప్రయోగం పేరిట కాస్త మోసాన్ని ప్రదర్శిస్తున్నట్టే అనుకోవాలి… రేప్పొద్దున మరిన్ని ఫస్ట్ పేజీలు కనిపిస్తే, మరింత డబ్బు వస్తుందీ అనిపిస్తే… మరో ఫస్ట్ పేజీ పెట్టేసి, ఎనిమిదేసి పేజీలతో మూడు పేపర్లు వేస్తారా..? ఏమిటీ గందరగోళం..?!
Share this Article