సాధారణంగా సొసైటీలో అనామకులు ఎవరో సోషల్ మీడియాలో ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటే… వాళ్ల మిత్రవర్గం అటోఇటో స్టాండ్ తీసుకుని, సంవాదంలోకి దూరిపోతుంటారు… చిన్న చిన్న విషయాలు కూడా రచ్చ రచ్చ అయిపోతుంటాయి…. కానీ ఇది పూర్తి భిన్నంగా, కాస్త ఆసక్తికరంగా కనిపిస్తోంది… ఒకాయన దేవులపల్లి అమర్… జగన్ ప్రభుత్వంలో జాతీయ, అంతర్జాతీయ మీడియా వ్యవహారాల సలహాదారు… జాతీయ స్థాయిలో వేలాది మంది జర్నలిస్టులు సభ్యులుగా ఉన్న ఐజేయూ నాయకుడు… ఆమధ్య అధ్యక్షుడు కూడా… సో, సొసైటీలో ఓ పాపులర్ పర్సనాలిటీ…
మరొకాయన సీపీఐ జాతీయ కార్యదర్శి… రెండు తెలుగు రాష్ట్రాలకూ పరిచయం అక్కర్లేని పేరు… సుదీర్ఘకాల కమ్యూనిస్టు… ఆ ఇద్దరి నడుమ ప్రస్తుతం బట్టలిప్పుకునే సంవాదం ఒకటి సాగుతోంది… లోలోపల ఏమీ కాదు, సోషల్ మీడియాలోనే… మరి ఆ ఇద్దరు పాపులర్ సెలబ్రిటీల నడుమ సంవాదం, అదీ వివాదాస్పద అంశాలపై సాగుతుంటే… విచిత్రం ఏమిటంటే… ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు… లైకులు, కామెంట్లు దాదాపు శూన్యం… ఎందుకంటే, కామెంట్లలోనూ వాళ్ల పరస్పర నిందలే కనిపిస్తున్నయ్…
అయితే ఆ సంవాదాన్ని ఎవరూ చూడటం లేదా..? చూస్తున్నారు..! తెలుగు రాష్ట్రాల ముఖ్య జర్నలిస్టులు, నాయకులు గమనిస్తున్నారు… చదువుతున్నారు… అంతే… కానీ ఎవరూ స్పందించడం లేదు… వైసీపీ, సీపీఐ, జర్నలిస్టు సంఘాల శ్రేణులు కూడా సైలెంట్… అదీ ఆసక్తికరంగా కనిపిస్తోంది… ఈ ఫేస్ బుక్ లింక్ ఓపెన్ చేసి చదవొచ్చు మీరు కూడా… https://m.facebook.com/story.php?story_fbid=10225679914241358&id=1134766578
Ads
ఇక్కడ వాళ్లేం తిట్టేసుకుంటున్నారో, ఆ నిందల్లోని నిజానిజాలు, ఔచిత్యాల జోలికి ‘ముచ్చట’ వెళ్లడం లేదు… నిజానికి ఇద్దరూ దాదాపు ఒకే క్యాంపు… ఐజేయు లెఫ్ట్ అనుబంధ సంస్థలాగే ఉంటుంది… నారాయణ సరేసరి… అసలు ఇష్యూ ఎక్కడ స్టార్టయిందీ అంటే… ఇది ఓసారి చూడండి…
జగన్ ప్రభుత్వంలోని పనీపాటా లేని సలహాదారులు విలాసవంతంగా లక్షల జీతాలు తీసుకుంటున్నారు… ఒకాయన అయితే అచ్చోసిన ఆబోతులా మాట్లాడుతున్నాడు అని నారాయణ విమర్శలు గుప్పించాడు… నిజానికి ఆ విమర్శే శుద్ధ దండుగ… జగన్ ఎవరి సలహాలూ వినడు… అన్నీ తనే ఆలోచించుకుంటాడు, ఆదేశిస్తాడు… అంతే… సలహాదారుల పాత్ర నామ్‌కేవాస్తే మాత్రమే… ఒక్క సజ్జల మాత్రమే కాస్త ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తుంటాడు…
తను మాట్లాడితే జగన్ మాట్లాడినట్టే… తను కూడా ఇదే సీపీఐ క్యాంపు ఒకప్పుడు… కానీ నారాయణ విమర్శల్ని లైట్ తీసుకుని, నవ్వుకుని వదిలేశాడు… నిజానికి అమర్ అదే చేస్తే సరిపోయేది… ఎందుకంటే..? నారాయణ ఎవరి పేరూ ప్రస్తావించలేదు ప్రత్యేకంగా… పైగా ఉద్యోగుల ఆందోళన అనే అంశంలో అమర్ పాత్ర ఏముంటుంది..? నారాయణ విమర్శ చదివి వదిలేయాల్సింది… కానీ కమ్యూనిస్టు ఉద్యమం కొన్ని ఆబోతులను కూడా అచ్చోసి తెలుగు సమాజం మీదకు వదిలేసింది అని ఓ పోస్టు పెట్టాడు… అది నారాయణను ఉద్దేశించే అనేది చదివినవాళ్లకు ఇట్టే అర్థమవుతుంది…
కాస్త లేటుగా నారాయణ స్పందించి, తనూ అదే భాషను అందుకున్నాడు… ఇక ఇద్దరూ తిట్టేసుకుంటున్నారు… జర్నలిస్టు సంఘాల నేత కె.శ్రీనివాసరెడ్డిని కూడా ఈ వివాదంలోకి లాగాలని నారాయణ ట్రై చేస్తున్నట్టుంది… ఈ కథనం రాసే సమయానికి కూడా ఇద్దరి నడుమ సంవాదం సాగుతూనే ఉంది… నువ్వు అది, నువ్వేమైనా తక్కువా, నువ్వు ఇది అనే వాగ్వాదం నడుస్తూనే ఉంది… అవునూ, పార్టీ ఎందుకు సైలెంటుగా ఉంది..? అమర్ జగన్ సలహాదారు కాబట్టి తనను ఓన్ చేసుకోకపోవచ్చు కానీ నారాయణకు కూడా మద్దతుగా కూడా ఒక్కరూ మాట్లాడటం లేదెందుకు..? అమర్‌కు మద్దతుగా జర్నలిస్టులూ పెద్దగా రియాక్ట్ కావడం లేదు దేనికి..? ఎందుకబ్బా..?!
Share this Article